
- నిజాంను కూల్చిన స్ఫూర్తితో బిజెపిని గద్దెదించేలా పోరాటాలు
- సంగారెడ్డిలో సాయుధ పోరాట వారోత్సవ సభలో బివి రాఘవులు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ఒకేసారి ఎన్నికలంటే అధ్యక్షతరహా పాలన తీసుకురావడమేనని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. స్థానిక సంస్థలు, రాష్ట్రాల అధికారాలను హరించి ఒకే వ్యక్తి నియంతృత్వ పాలన సాగించడం కోసమే మోడీ జమిలీ జపం చేస్తున్నారని విమర్శించారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం సిపిఎం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పిఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన సభకు రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీరనారి ఐలమ్మ విగ్రహం నుంచి పిఎస్‌ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జమిలీ ఎన్నికలైనా, సాధారణ ఎన్నికకైనా సిపిఎం సిద్ధంగా ఉన్నదన్నారు. దేశంలో ప్రతిపక్షాలు ఐక్యమవుతుండటంతో మోడీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతామన్న నిజాన్ని గమనించే జమిలీ ఎన్నికలకు పోయేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దేశం సాధించిన గొప్పతనమంతా తమ వల్లే జరిగినట్టుగా మోడీ తనకు తానే ప్రచారం చేసుకుంటున్నారన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న చరిత్ర బిజెపికి కాని, దాని మాతృసంస్థలైన జనసంఫ్‌ు, ఆర్‌ఎస్‌ఎస్‌కూ లేవన్నారు. ఇండియా, భారత్ రెండు పదాలు కూడా రాజ్యాంగంలో ఉన్నాయని, ఇప్పుడు భారత్ పేరు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను మరుగున పర్చేందుకే దేశం పేరు మార్పు, సనాతన ధర్మం చుట్టూ చర్చ జరిగేలా చేస్తున్నారన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడడమంటే కుల వ్యవస్థను కొనసాగించడమేనని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హిందూ మతాన్ని రెచ్చగొట్టడం బిజెపికి అలవాటుగా మారిందన్నారు. జీ-20 దేశాల సమావేశాలు ఆయా దేశాల్లో రొటీన్‌గా జరిగే ప్రక్రియ తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. దేశ ప్రజలకు సంబంధించిన అధిక ధరలు, నిరుద్యోగం, రైతులకు మద్దతు ధర, రాజ్యాంగ పరిరక్షణ, మహిళా రిజర్వేషన్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై పోరాటాలు సాగించాలని ప్రజలను కోరారు. వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు నిజాం నవాబును తరిమికొట్టిన స్ఫూర్తితో దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీని గద్దె దించేందుకు పోరాడాలని కోరారు.