
విజయవాడ : 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని గద్దెదించకపోతే ఈ దేశానికి పెద్ద ప్రమాదం ఎదురవుతుందని పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు పేర్కొన్నారు. సిపిఎం ప్రజా రక్షణ భేరి బహిరంగ సభ బుధవారం అజిత్ సింగ్‌నగర్‌లో గల ఎంబి స్టేడియంలో జరిగింది. ఈసభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం, ఎన్‌డిఎ అధికారంలోకి రాకూండా చూసుకోవాల్సి ఉందన్నారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధిని దశాబ్దాల పాటు వెనక్కి పోతుందన్నారు. ఈ రాష్ట్రంలో బిజెపి ఉనికిలేదు. ఎపిలో ప్రత్యక్షంగా లేకపోయినా అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఆ పల్లకిని మోస్తోందని, వారి కాళ్లు పట్టుకుని మొక్కుతోందని విమర్శించారు. జగన్‌ను ఓడించడమే కాదు.. కేంద్రంలో బిజెపిని ఓడించాల్సి ఉందన్నారు. అయితే దురదృష్టమేమిటంటే ఎపిలో అధికారంలో లేకపోయినప్పటికీ బిజెపి ఇక్కడే బలంగా ఉందని, పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెడితే.. ఎపిలో 25 పార్లమెంటు సభ్యులు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. వారు వైఎస్‌ఆర్ పార్టీకాని, టిడిపి కాని ఎవరైనా పూర్తిగా మద్దతు తెలుపుతున్నారని అన్నారు. పైకి టిడిపి, వైఎస్‌ఆర్ పార్టీలు ఒకరిపై ఒకరు దూషించుకున్నా.. అక్కడ ఐక్యంగానే ఉంటారని స్పష్టం చేశారు. గతంలో ఎపి ముఖ్యమంత్రులు కేంద్రాన్ని నిలదీసిన ఘటనలు ఉన్నాయని, టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటీష్ వారిని లెక్కచేయలేదని అన్నారు. నీలం సంజీవరెడ్డి కేంద్రంలోనే ఉండి ఉక్కు ఫ్యాక్టరీ కోసం గట్టిగా పోరాడారని, కేంద్రాన్ని నిలదీశారని గుర్తు చేశారు. ఎన్‌టిఆర్.. ఇందిరాగాంధీ ఆయనను పదవి నుండి తొలగిస్తే.. ప్రజలను కదిలించి తిరిగి ఇందిరాగాంధే ముఖ్యమంత్రిగా నిలబెట్టేలా చేశారని అన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు వెన్నెముక లేని విధంగా, పిరికిపందల్లా వ్యవహరిస్తున్నాయన్నారు.
చంద్రబాబునాయుడిని జైలులో పెట్టింది .. జగన్ అని టిడిపి సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కేంద్రంలో మోడీ అనుమతి లేకుండా చంద్రబాబును జైలులో పెట్టే ధైర్యం జగన్‌కుఉందా అని ప్రశ్నించారు. జగన్ ఫోన్ ట్యాప్ చేయలేరా.. ఇక్కడి పోలీసులు అమిత్‌షాకి చెప్పరా .. అమిత్‌షాకి తెలియకుండా చంద్రబాబును జైలులో పెట్టడం ఎవరికి సాధ్యంకాదని అన్నారు. కానీ ధైర్యంగా బిజెపిని ఒక్కమాట కూడా అనే ధైర్యం టిడిపికి లేదని చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిసి గర్జన సభలో మోడీని పొగడ్తలతో ముంచెత్తారని విమర్శించారు. 370 అధికరణను రద్దు చేసినందుకు, రామాలయం నిర్మాణానికి, జి20 నిర్వహించినందుకు సలాం కొట్టారని, మూడోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారని అన్నారు.
టిడిపి, జనసేన ఉమ్మడిగా మెనిఫెస్టోను రూపొందించి ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ప్రకటిస్తున్న ఈ రెండు పార్టీలు చివరికి మోడీకే తలవంచుతాయని అన్నారు. ఈ మూడు పార్టీలు ఇలాగే వుంటే రాష్ట్రానికి ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేమని, ఈ మూడు పార్టీలను అధికారంలోకి రాకుండ చేయాలని ప్రజలకు సూచించారు.
పోలవరం పరిహారానికి నిధులు లేవు. ,ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిలువరించలేదు. అమరావతి అభివృద్ధి ఊసేలేదు. వీటిగురించి కేంద్రాని నిలదీయడం లేదు. ఇక్కడ అమరావతి కోసం మట్టి, నీళ్లు ఇచ్చిపోయిన మోడీని ప్రశ్నించే ధైర్యం లేదు. అమరావతిని అడ్డుకున్నది మోడీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. జగన్‌ను వెనకుండి నడిపిస్తుంది మోడీ ప్రభుత్వమేనన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగంలోని స్ఫూర్తిని నాశనం చేస్తూన్న మోడీకి కాళ్లు మొక్కుతున్న 175 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో ఆయనకు నివాళులు అర్పిస్తామని చెప్పడం సిగ్గు చేటు అని అన్నారు. అంబేద్కర్ పేరు తలుచుకునే అవకాశం కూడా వారికి లేదు. పాలస్తీనా ప్రజలను ఇజ్రాయిల్ ఊచకోత కోస్తుంది. వారికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గతంలో వైఎస్. రాజశేఖర్ జెరూసలెం వెళ్లారు. ఇప్పుడు జగన్ వెళ్లివస్తున్నారు. ఆజెరూసలెం పాలస్తీనా లో లేదా అని నిలదీశారు. ప్రజలకు ఈ విషయం తెలుసు. పాలస్తీనాలో ముస్లింలను ఊచకోత కోస్తుంటే స్పందించని జగన్ ఇక్కడ ముస్లింలకు ఏవిధంగా న్యాయం చేస్తారు అని ప్రశ్నించారు. దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు మోడీ వైఖరిని, విదేశాంగ విధానాన్ని ముక్త కంఠంతో ఖండించాయి. కానీ ఈ మూడు పార్టీలు ఒక్కమాటకూడా మాట్లాడలేదన్నారు. ఇటువంటి వారు సామాజిక సాధికారత యాత్ర చేస్తున్నారు. కానీ అవి సామాజిక సంహార యాత్రలు చేస్తున్నారు. గిరిజన చట్టాల సవరణ, దళితులపై అత్యాచారాలు, మణిపూర్‌లో మహిళలపై హింసాకాండ, రైతు చట్టాలు, ఢిల్లీ ప్రభుత్వ హక్కుల గురించని మాట్లాడవారు.. సామాజిక సాధికార యాత్రలు చేయడం సిగ్గుచేటన్నారు.
బాలలదినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చదువు అనేది బాలలకు మనం ఇచ్చే అనే ఆస్తి.. ఇంగ్లీషు మీడియాం పెట్టి ఆస్తి ఇస్తున్నానని ట్వీట్ చేశారు. ఇంగ్లీషు మీడియం చదువులేనా ఆస్తి అని ప్రశ్నించారు. ఎపిలో చదువులో 32 స్థానంలో ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన విద్యార్థినుల చదువు కోకుండా అడ్డుకుంటున్నారన్నారు. ప్రపంచ బ్యాంక్ నుండి 2020లో రూ.2000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఎస్‌ఎఎల్‌టి అనే పథకంలో భాగంగానే ఇంగ్లీషుమీడియం, నాడు నేడు ఇలా 2,000 కోట్లను మింగేస్తున్నారు. ఈ లెక్కలు ప్రజలకు వివరించే ధైర్యం లేదన్నారు.
ఐదేళ్లు అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు నాశనం చేస్తే.. తిరిగి మూడు రాజధానుల పేరుతో రియల్ ఎస్టేట్ కోసం మూడు రాజధానులని ప్రవేశపెట్టారని, ఐదేళ్ల పాటు రాజధానే లేకుండా చేశారని అన్నారు. సమగ్ర అభివృద్ధి జరగాలన్న, కూలీలు. మహిళలు, దళితులు అభివృద్ధి చెందాలంటే వామపక్షాలు బలంగా ఉండాలి. ప్రతిపక్షంలోనైనా ఉండి ఇలా ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, పుణ్యవతి, తదిరులు పాల్గన్నారు.