
చంద్రబాబుపై కేసు కేంద్రానికి తెలియకుండా జరిగింది కాదు
రాజకీయ లబ్దికోసమే మహిళా బిల్లు
రాష్ట్రపతిని పదేపదే అవమానిస్తున్న ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్
ఎన్నికలు సమీపించే కొద్దీ మతాల మధ్య వైషమ్యాలు
విలేకరుల సమావేశంలో ఎంఏ బేబీ, బి.వి రాఘవులు
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :వైసిపి, టిడిపిలు కేంద్రంలో బిజెపికి మద్దతు ఇస్తున్నాయని, ఇది దురదృష్టకర పరిణామమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబి, బి.వి రాఘవులు అన్నారు. విజయవాడ బాలోత్సవ్ భవన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావుతో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌డిఎలో ఉన్న అనేక పార్టీలు బయటకు వస్తున్నాయని, అయినా, ఈ రెండు పార్టీలూ కళ్లు తెరవడం లేదన్నారు. బి.వి.రాఘవులు మాట్లాడుతూ మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు గత్యంతరం లేక మద్దతు ఇచ్చాయని, స్వతహాగా ఇష్టం లేదని ప్రధాని మోడీ అన్నారని, వాస్తవానికి గతంలో మహిళా బిల్లును పెడుతున్న సమయంలో ఇదే బిజెపి ఆసక్తి చూపలేదని చెప్పారు. ఇప్పుడు ఒకరిద్దరు తప్ప అందరూ ఆమోదిస్తే దాన్ని పార్లమెంటు విజయంగా చెప్పకుండా బిజెపి తన సొంత గొప్పతనంగా చెప్పుకోవడం అసహ్యంగా ఉందన్నారు. గత తొమ్మిదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోడీ ఇప్పటి వరకూ ఎందుకు మహిళా బిల్లు పెట్టలేదని ప్రశ్నించారు. బిల్లు ఆమోదించినా 2029 నుండి అమలు చేయాలని చెప్పడం మోసం చేయడమేనన్నారు. నిజంగా అమలు చేయాలనుకుంటే ఇప్పటి నుండే అమలు చేయొచ్చని, కానీ బిజెపికి ఆ చిత్తశుద్ది లేదన్నారు. 2029 నుండి అమల్లోకి వచ్చేటట్లయితే ఇప్పుడు బిల్లు పెట్టడం రాజకీయ లబ్దికోసం తప్ప మరొకటి కాదన్నారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో వెంటనే అమలు చేసేలా చూడాలని కోరారు. చట్టసభల్లో ఇప్పుడున్న సంఖ్యను 33 శాతం ప్రకారం విభజించి అమలు చేయొచ్చని సూచించారు. ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో బిజెపి ఎంపి రమేష్ బిదూరి సహచర ఎంపి రమేష్‌డాలీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని రాఘవులు ప్రస్తావించారు. డాలీపై టెర్రరిస్టుగా ముద్ర వేస్తూ, మతపరమైన అంశాలను ప్రస్తావించి అవమానించారని, మాట్లాడకూడని పదాలు మాట్లాడారని అన్నారు. అయినా దానిపై క్షమాపణలు చెప్పలేదని. రాజకీయ పార్టీగా బిజెపి వైషమ్యాలు సృష్టించే విధంగా వ్యవహరిస్తోందని చెప్పారు. దీనిపై అసలు ఎంపి ఏమీ మాట్లాడలేదని, రాజ్‌నాథ్ సింగ్ స్పందించారని అన్నారు. దీనివెనుక మతపరమైన విభజన తేవాలనే కుట్ర దాగుందని అన్నారు. మతాల మధ్య విభజన సృష్టించి ఎన్నికల్లో గెలుపొందాలనే ఆలోచన ఉందని విమర్శించారు. మరోవైపు ఎన్నికలు జరిగిన అన్నిరాష్ట్రాల్లోనూ బిజెపి ఓడిపోతోందని, అది సృష్టిస్తున్న వైషమ్యాలను ప్రజలు గమనిస్తున్నారని 2024లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎన్‌డిఎ నుండి ఎఐఏడిఎంకే కూడా వైదొలగిందని తెలిపారు. జమిలీ ఎన్నికల పేరుతో తమకు అనుకూలమైన వాతావరణం సృష్టించుకోవాలనే చర్చ బిజెపి చేస్తోందని తెలిపారు. సందర్భానుసారం జమిలి ఎన్నికలు రావడం వేరని, ఒకేసారి జరపాలని చట్టం చేయాలని చూడటం ప్రమాదకరం, అప్రజాస్వామికం, నిరంకుశమని చెప్పారు. ఇటువంటి నియంతృత్వ పద్ధతులను సిపిఎంగా తాము అంగీకరించడం లేదని పేర్కొన్నారు. వైసిపి, టిడిపిలు ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లోగానీ, అంతకు ముందు సమావేశాల్లోగానీ కేంద్రంలో బిజెపికి మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో వైసిపి నాయకులు మోడీని పొగడటంలో తలమునకలు అయ్యారని, ఢిల్లీ బిల్లులోనూ కేంద్రానికి మద్దతు ఇచ్చారని తెలిపారు. టిడిపి కూడా అదే బాటలో ఉందని అన్నారు. వైసిపి, కేంద్రం కలిసి చంద్రబాబును అరెస్టు చేయించారని వార్తా పత్రికల్లోనూ కథనాలు వస్తున్నాయని అన్నారు. కేంద్ర నిఘా సంస్థల సూచనల మేరకే తాము చర్యలు తీసుకుంటున్నామని సిఐడి కూడా నివేదికలో పేర్కొందని తెలిపారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అర్థరాత్రి పోయి అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ పద్ధతుల్లో చంద్రబాబును అరెస్టు చేయడం వేధింపు అనుకోవాల్సి వస్తుందని అన్నారు. తప్పుచేశారా లేదా అనేది విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని నాశనం చేస్తున్న బిజెపితో వెళ్లాలా లేదా అనే విషయంలో వైసిపి, టిడిపిలు పునరాలోచన చేయాలని, బిజెపికి దూరంగా జరగాలని కోరారు. తనకు దగ్గరగా ఉండే రాజకీయ పార్టీలను నాశనం చేసి బిజెపి ఎదుగుతోందని వారు గమనిస్తే మంచిదని అన్నారు.
ప్రధాని మోడీకి రాజ్యాంగపట్ల గౌరవం లేదని అన్నారు. ఆయన ఇటీవల ప్రత్యేక సమావేశాలు నిర్వహించారని, ఇటీవల సావర్కర్ పుట్టినరోజున పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారని, ఆ సమయంలో రాష్ట్రపతిని కూడా భాగస్వామిని చేయలేదని అన్నారు. ఇండియన్ పార్లమెంటు రాష్ట్రపతితో కలిపి ఉభయసభలు అని అర్ధమని చెప్పారు. కానీ మోడీ దాన్ని గౌరవించకుండా ఆయనే ప్రారంభించారని తెలిపారు. అయినా అందులో సమావేశాలు నిర్వహించకుండా పాత భవనంలోనే నిర్వహించారని, అంటే అది పూర్తిగా నిర్మాణం కాలేదని తెలిపారు. తాజా సమావేశాలుకూడా పాత భవనంలోనే జరిగాయని, అందులోనే పార్లమెంటు ప్రాశస్త్యంపై చర్చించారని, ఆ తరువాత కొత్త భవనంలో సమావేశాలు నిర్వహించారని తెలిపారు. పార్లమెంటుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ద్రౌపదిముర్మును పట్టించుకోలేదని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ప్రకారం ఆమె మహిళ కావడం, రెండోది గిరిజన తరగతులకు చెందిన మహిళ కావడటవంతో భాగస్వామ్యం చేయలేదని తెలిపారు. మోడీ పూర్తి నియంతృత్వంగా వ్యవహరిస్తూ చట్టాలు చేసే సమయంలో కనీసం ప్రతిపక్షాలను సంప్రదించడం లేదని తెలిపారు.
- అసాంఘిక శక్తుల పేరుతో ఉద్యమాలను అణచడం సరికాదు
అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం దారుణంగా వ్యవహరించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ధర్నా చేసుకుంటామంటే అనుమతి ఇవ్వకపోగా అసాంఘిక శక్తులు జరపడతారని పోలీసులు ప్రచారం చేశారని తెలిపారు. నగరంలో జరిగిన ఆందోళనలో ఎక్కడైనా సంఘ విద్రోహశక్తులు జరపడినట్లు గుర్తించారా అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేసినందుకు పోలీసులు క్షమాపణ చెప్పాలని అన్నారు. పోనీ గత పదేళ్లలో ప్రజాస్వామ్య పరంగా జరుగుతున్న ఆందోళనల్లో ఎప్పుడైనా సంఘ విద్రోహశక్తులను గుర్తించారా అదన్నా చెప్పాలని ప్రశ్నించారు. ఒకవైపు మహిళలపై అమానుషాన్ని ప్రయోగించి అసెంబ్లీలో మంత్రులు ఉషశ్రీచరణ్, రోజా మహిళలకు సాధికారిత ఇస్తామని ప్రకటిస్తున్నారని ఎవరిని మోసం చేయడానికో చెప్పాలని డిమాండు చేశారు. వైసిపి అంగన్‌వాడీలను మోసం చేసిందని అన్నారు. పక్కనున్న తెలంగాణాలో వారికి ఎక్కువ వేతనం ఇస్తున్నారని, ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయమంటే ఎందుకు చేయడం లేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీలకు న్యాయం చేసే అంశంపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని కోరారు.