Dec 17,2022 07:45

          భారత సమాఖ్య స్ఫూర్తికి సమాధి కట్టే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించే వివాదస్పద జమిలి ఎన్నికల అంశాన్ని బిజెపి ప్రభుత్వం మరోమారు తెరపైకి తెచ్చింది. పార్లమెంటుకూ, రాష్ట్రాల శాసనసభలకూ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం తమ విధానమని రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు బదులిచ్చారు. పాలనలో స్థిరత్వం కోసం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్‌ 170వ నివేదికలో పేర్కొన్నట్లు ఆయన సెలవిచ్చారు. కానీ రాజ్యాంగం నిర్దేశిస్తున్న 'సమాఖ్య' వ్యవస్థలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని కూడా ఇదే లా కమిషన్‌ నివేదిక కుండబద్దలు కొట్టిన విషయాన్ని అమాత్యులవారు కావాలనే తొక్కిపెట్టారు. పాలనలో స్థిరత్వం కోరుకునే చిత్తశుద్ధి మోడీ సర్కార్‌ నిజంగానే ఉంటే పార్టీ ఫిరాయింపులు చట్టం మరింత పటిష్టంగా మార్చి బలోపేతం చేయాలని దేశవ్యాప్తంగా నినదిస్తుంటే అబ్బే అది సాధ్యపడదని నిసిగ్గుగా ప్రకటించింది. జమిలి ఎన్నికల వల్ల వ్యయం భారీగా తగ్గిపోతుందని, ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకు లబ్ది చేకూరుతుందనేది మోడీ సర్కార్‌ ముందుకు తెస్తున్న వాదన. కానీ అసలు కుట్ర వేరే ఉంది. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దానిది 'ఒంటెత్తు పోకడే' ! 'ఒకే దేశం - ఒకే విధానం' అంటూ దేశాన్ని క్రమక్రమంగా కేంద్రీకృతం వైపు లాక్కెళ్లుతున్న సంగతి విదితమే. భౌగోళికంగానూ, ప్రజల జీవన విధానంలోనూ అడుగడుగునా భిన్నత్వంతో తొణికిసలాడుతూ ఏకత్వాన్ని చాటే విశిష్టమైన లక్షణం భారత్‌ సొంతం. సంఫ్‌ు పరివార్‌కు మొదటి నుంచి కంటగింపు కలిగిస్తున్నదీ ఇదే. అందుకనే బిజెపికి అధికారంలోకి వచ్చిననాటి నంచి ఈ భిన్నత్వ వైశిష్టాన్ని దెబ్బతీసే కుట్రలు సాగుతున్నాయి. సువిశాల భూభాగంలో విస్తరించి 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో ప్రతి విషయంలోనూ ఒకే విధానాన్ని అనుసరిస్తూ పోతే అది ప్రభుత్వ పాలనాధికారులు కేంద్రీకృతం కావడానికి దోహదం చేస్తుందే తప్ప వివిధ ప్రాంతాల పురోగతికి కానీ, ప్రజల సంక్షేమానికి కానీ ఏ కోశానా తోడ్పడదు.
          ఒకే భాష, ఒకే కట్టుబొట్టు, ఒకే తిండి, ఒకే విద్య..ఇలా దేశమంతా ఒకే విధానం ఉండాలని సంఫ్‌ు పరివార్‌ పేరాశ. జమిలి ఎన్నికలు కూడా ఈ కోవలో రుద్దాలనే దాని ఉబలాటం. ప్రజల సంపదను లూటీ చేసి కార్పొరేట్‌ కంపెనీలు కుమ్మరిస్తున్న కోట్లాది సొమ్ముతో ఆపరేషన్‌ కమల్‌ చేపట్టి రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చివేస్తూ ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తోంది. ఇక దేశమంతటా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే అది పార్లమెంటరీ వ్యవస్థకు పెను విఘాతంగా మారుతుంది, సమాఖ్య స్ఫూర్తిని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. జమిలి ఎన్నికలు జరపాలంటే దేశంలోని అన్ని శాసనసభలనూ ఒకేసారి రద్దు చేయాలి. లేదా కొన్ని శాసనసభలను ముందస్తు ఎన్నికలకు ఒప్పించాలి..మరికొన్నింటికి పదవీకాలం పొడిగించాలి..ఇంత కసరత్తు చేస్తే తప్ప 'జమిలి' సాధ్యపడదు. రాజ్యాంగపరంగానూ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇంత కసరత్తులో న్యాయపరమైన చిక్కుముడులతో రాజ్యాంగ సంక్షోభాలతో పాలనావ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారితే ఆ వ్యయ భారాన్ని మోసేదెవరు ?
            భారతదేశం..రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగ చాలా స్పష్టంగా నిర్దేశిస్తోంది. ఒకవేళ బిజెపి కోరుకున్నట్లు జమిలి జరిగితే రాష్ట్రాల ఉనికికే ప్రమాదం వాటిల్లక తప్పదు. దేశవ్యాప్త ప్రచారాల్లో ప్రాంతాలవారీ సమస్యలు కొట్టుకుపోతాయి. ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోయి.. క్రమంగా కొన్ని పార్టీలే మిగిలి, బహుళ పార్టీ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదముంది. సరిహద్దు ఘర్షణలనో, మైనార్టీలనో బూచిగా చూపెట్టి ప్రజలను మతాల పరంగా, ప్రాంతాల పరంగా చీలికలు పేలికలు చేసి ప్రజా సమస్యలను తొక్కిపెట్టేస్తారు. గుజరాత్‌ మినహా.. ఢిల్లీ పుర సమరంలోనూ, హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ, ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాషాయ విధానాలను ఛీకొట్టిన నేపథ్యంలోనే బిజెపి మళ్లీ 'జమిలి' రాగాలు తీస్తోందన్నది స్పష్టం. రూపాయి అంతకంతకూ దిగజారిపోవడం, వడ్డీరేట్లు పెరిగిపోవడం, ద్రవ్యోల్బణ ధరాఘాతం, నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతుండటంతో వాటిని పరిష్కరించే చేవ లేక బిజెపి తెరలేపుతున్న ఈ నాటకాలు దేశ ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు ప్రమాదకరం.