Aug 10,2023 18:04

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం 'జైలర్‌'. రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్‌, తమన్నా వంటి ప్రముఖ తారాగణంతో దర్శకుడు నెల్సన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఆగస్టు 10వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందామా.!

కథ
ముత్తు (రజనీకాంత్‌) రిటైరైన ఓ పోలీస్‌ అధికారి. ముత్తు కొడుకు అర్జున్‌ (వసంత్‌ రవి) అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ). తండ్రిలాగే కొడుకు డిపార్ట్‌మెంట్‌లో నిజాయితీగల ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. అర్జున్‌ ఓ విగ్రహాల చోరీ కేసును చేధించే క్రమంలో పెద్దమాఫియాతో తలపడతాడు. ఆ తర్వాత కనిపించకుండా పోతాడు. ఆ మాఫియానే అన్యాయంగా అర్జున్‌ని చంపేసిందని తెలుసుకున్న ముత్తు.. ఆ మాఫియాకు చెందిన ఒక్కొక్కరిని చంపుతుంటాడు. ఈ క్రమంలోనే ముత్తు చాలా పవర్‌ఫుల్‌ అని ఆ మాఫియాకు తెలుస్తుంది. అప్పుడే అర్జున్‌ని చంపలేదని.. తమ దగ్గరే బంధీగా ఉంచినట్లు మాఫియా లీడర్‌ (వినయగన్‌) ముత్తుకు చెబుతారు. అయితే ఓ కండీషన్‌ మీదనే బంధీగా ఉన్న అర్జున్‌ని ప్రాణాలతో అప్పజెబుతానని ముత్తుకు చెబుతాడు. ఇంతకీ మాఫియా పెట్టిన కండీషన్‌ ఏంటి? చివరికి మాఫియా నుంచి ముత్తు తన కొడుకుని రక్షించుకున్నాడా? లేదా వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

jailer

 

jailer


విశ్లేషణ
దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌.. సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. కాలా, కబాలి, అన్నాత్తై (పెద్దన్న) సినిమాలు రజనీ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేశాయి. అయితే 'జైలర్‌' సినిమాతో రజనీ అభిమానులకు ఆ కొరతను దర్శకుడు నెల్సన్‌ తీర్చారు. ఇక సినిమా విషయానికొస్తే.. ముందు మాఫియా గురించి తెలిసేలా అరక్కోణం అనే ఊరిలోని ఓ గుడిలో పూజారిని హత్య చేసి విగ్రహం దొంగతనం చేసే సీన్‌తో దర్శకుడు కథను ప్రారంభించాడు. ఆ తర్వాత ముత్తు కుటుంబాన్ని తెరపై చూపించారు. రిటైర్‌ అయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతివాళ్లకి లోకువగానే కనిస్తారనడానికి ముత్తు క్యారెక్టర్‌ సింపుల్‌ ఎగ్జాంపుల్‌. ముత్తు తన మనవడితో, భార్య (రమ్యకృష్ణ).. వీధిలో ఉండే క్యాబ్‌ డ్రైవర్‌ (యోగిబాబు)తో సాగించే సరదా సన్నివేశాలతో కథనం సాగుతుంది. ఈలోపే కొడుకు అర్జున్‌ చనిపోయాడని ముత్తుకు సమాచారమందడంతో కుంగిపోతాడు. తన కొడుకుని చంపిన మాఫియాను వదిలిపెట్టకూడదని భావించి.. ఆ మాఫియాలోని మనుషులను ఒక్కొక్కరిని మట్టుబెడుతుంటాడు. ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్స్‌ హైలెట్‌గా నిలిచి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాయి. ఇక సెకండాఫ్‌ ప్రేక్షకులు ఊహించినట్టుగా మొదలైనా.. కథ గాడి తప్పింది. కొడుకుని ప్రాణాలతో దక్కించుకోవడం కోసం.. విలువైన కిరిటాన్ని తెచ్చి ఇవ్వాలనే మాఫియా లీడర్‌ కండీషన్‌కి ముత్తు ఒప్పుకోవడం.. దాన్ని తేవడానికి ప్రయత్నించడం వంటి సీన్స్‌ చూస్తే ఆసక్తిగా లేవు. ముత్తు క్యారెక్టర్‌ని దర్శకుడు బాగా ఎలివేట్‌ చేసినా.. దానికితగ్గట్టుగా.. విలన్‌ క్యారెక్టర్‌ని ఎలివేట్‌ చేయలేదు. ప్రతినాయకుడు చాలా బలవంతుడు అనిపించేలా సన్నివేశాలు లేకపోవడం ఈ చిత్రంలో మైనస్‌. ఇక చివరి క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఫ్యాన్స్‌ చేత ఈలలు వేయించేలా ఉన్నాయి. దర్శకుడు నెల్సన్‌ సెకండాఫ్‌పై మరింత కసరత్తు చేసి ఉంటే.. సినిమా మరోస్థాయిలో ఉండేది. ట్విస్టుల కోసం ఆశపడకుండా.. రజనీ నటనను తెరపై చూడాలనుకునేవారు ఓసారి థియేటర్‌కి వెళ్లి చూసి రావొచ్చు.

jailer


ఎవరెలా చేశారంటే..
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటన హైలెట్‌. ఆయన వయసుకు తగిన పాత్రలో పోషించి..తెరపై మెప్పించారు. భార్యగా రమ్యకృష్ణ పాత్ర నిడివి తక్కువ అయినా.. బాగా నటించారు. కొడుకుగా వసంత రవి నటన పరవాలేదు. ఇందులో యోగిబాబు కామెడీ నవ్వులు పూయించింది. సునీల్‌, తమన్నా పాత్రలు తెరపై కొద్దిసేపే ఉన్నా.. గుర్తుండిపోయే పాత్రలు కాదు. వారి నటన పరవాలేదు. శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, జాకీష్రాప్‌ అతిథిపాత్రల్లో మెరిశారు. కానీ వీరి పాత్రల వల్ల సినిమాపై ఇంపాక్ట్‌ చాలా తక్కువ. అనిరుధ్‌ సంగీతం మరోస్థాయిలో ఉంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి.