గుక్కెడు ముర్రుపాలకు
చెంచాడు తులసి తీర్థానికి నడుమ
అవిశ్రాంత ప్రయాణమే జీవితం!
కళ్లు తెరవడానికి
మూయడానికి నడుమ
నడిచేదే క్షణభంగుర జీవితం!
పేగు బంధం తుంచడానికి..
తాడు తెంచడానికి నడుమ
చదరంగపు పావుల ఆటే జీవితం!
పిడికెడు ఆశలకు..
దోసెడు అడియాశలకు నడుమ
కదిలే అలల లయలేగా జీవితం!
కన్నీటి దుఃఖ సాగరానికి..
ఆనంద భాష్ప జలపాతానికి..
నడుమ సయ్యాటేగా జీవితం!
తాత్కాలిక మెలకువకు..
శాశ్వత మౌననిద్రకు నడుమ..
క్షణాలేగా
తీపి చేదుల గురుతులు!
ఎక్కెక్కి ఏడ్వటానికి..
ఏడ్పించడానికి నడుమ..
కదిలే కదా ఈ జగన్నాటకం !
గొంతు పెకలడానికి..
స్వర తలుపులు మూయడానికి..
నడుమ సాగడమేగా
ముచ్చట్ల జీవితం !
కష్టాల కడలికి..
సుఖ తీరాలకు నడుమ..
ప్రవాహ ఎదురీతేగా జీవన క్రీడ !
చంటోడి తొలి అడుగులకు..
వృద్ధుడి తడబడే
అడుగుల నడుమ..
పాదయాత్రేగా జీవన పయనం !
నీతి నియమాలకు..
అనైతిక రోతపనులకు నడుమ..
సంఘర్షణే కదా జీవన గమనం!
విజయ తీరాలకు..
అపజయాల
అంథకారాలకు నడుమ..
పాము నిచ్చెనల ఆటే కదా
జీవనయానం !
చిక్కటి చీకటికి
తేజోమయ వెలుగులకు నడుమ..
నలగడమే కదా
బడుగుల బతుకులు !
మధుపాళీ
9949700037