Mar 08,2023 17:00

ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : మండలంలోని జడ్డంగి నుండి గొబ్బులమడుగు మీదుగా డి భీమవరం వెళ్లే రహదారి పనులు తక్షణం చేపట్టాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు బుధవారం డిమాండ్‌ చేశారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు గొబ్బులమడుగు రహదారిని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013లో సుమారు రూ.7 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ రహదారి నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. రహదారి నిర్మిస్తుండగా ఫారెస్ట్‌ అనుమతిలు లేవని అడ్డంకులు చెప్పడంతో రహదారి నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని తెలిపారు. పది సంవత్సరాలుగా రహదారి అద్వాన స్థితికి చేరు కోవడంతో పాటు గొబ్బిలమడుగు గండి ప్రమాద భరితంగా మారిన నేపథ్యంలో ఈ రహదారిపై ప్రయాణించేటప్పుడు తరచూ వాహనాలు ప్రమాదాలు గురై అనేకమంది గిరిజనులు గాయాల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో ఈ రహదారి మీద ప్రయాణం సాగించలేని పరిస్థితి నెలకొన్న దృష్ట్యా తక్షణం ఉన్నతాధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని లేని పక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.