Nov 08,2023 10:22
  • గతేడాది మిగిలిన వాటి జాడే లేదు
  • ఈ ఏడాది విద్యార్థులు 38.25 లక్షలు
  • కొన్నది 39.96 లక్షలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందిస్తున్న జగనన్న విద్యాకానుక కిట్ల(జెవికి)లో మిగులు కిట్లు మాయమవుతున్నాయి. మునుపటి విద్యాసంవత్సరం ఆధారంగా జెవికె కిట్లను పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ) ద్వారా టెండర్లు పిలిపించి కొనుగోలు చేస్తోంది. అయితే విద్యార్థులకు అందించగా మిగిలిన కిట్లను పట్టించుకోకుండా కొత్త ఏడాదికి ఎస్‌ఎస్‌ఎ కొనుగోలు చేస్తోంది. ఈ మిగిలిన కిట్లను ఏం చేస్తుందో తెలియడం లేదు. అధికారులు మాత్రం వచ్చే విద్యాసంవత్సరానికి అందిస్తున్నామని చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇలా మిగిలిన లక్షల కిట్లు ఏమవుతున్నాయో తెలుసుకోకుండానే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. 2022-23 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 39,96,064 మంది. అయితే ఎస్‌ఎస్‌ఎ 45,60,041 కిట్లను కొనుగోలు చేసింది. అదనంగా 5,63,977 కిట్లు గత విద్యాసంవత్సరంలో మిగిలాయి. వీటిల్లో 6,65,324 నోటు పుస్తకాలు, 1,49,568 బెల్టులను జెవికె-4లో ఉపయోగించామని సమగ్ర శిక్ష చెబుతోంది. 1,15,056 బ్యాగులను, 2,43,153 బూట్లను రీప్లేస్‌మెంటు కోసం ఉపయోగించామని అంటోంది. కెజిబివి, మోడల్‌ స్కూల్స్‌, ఎపి రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 1,41,417 మందికి నాలుగో జత యూనిఫాం కింద సరఫరా చేశామని అధికారులు అంటున్నారు. వీటిల్లో ప్లస్‌-2 చదువుతున్న 1,15,380 మంది విద్యార్థులకు యూనిఫాం క్లాత్‌ ఇచ్చామని అంటున్నారు. ఎస్‌ఎస్‌ఎ చెబుతున్న లెక్కల ప్రకారం 1,15,056 బ్యాగులను రీప్లేస్‌ చేసినా ఇంకా 4,48,921 బ్యాగులు మిగులుగా ఉండాలి. బూట్లలో 2,43,153 రీప్లేస్‌ చేసినా 3,20,824 మిగులు ఉన్నాయి. యూనిఫాం 3,07,180 జతలు మిగులుగా ఉండాలి. ఇవి కాకుండా 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలు కలిపి 42,915 నోటు పుస్తకాలు, 72,196 బెల్టులు, 17,196 బ్యాగులు, 26,618 బూట్లు, 9,982 యునిఫాం జతలు, 2,600 పిక్టోరియల్‌, 11,852 ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు మిగులుగా ఉన్నాయని సమగ్ర శిక్ష లెక్కలు తేల్చింది. వీటిని ప్రస్తుత విద్యా సంవత్సరం (జెవికె-4)లో వినియోగించాలని గతంలో సమగ్ర శిక్ష ఇన్‌ఛార్జి డైరెక్టరుగా ఉన్న పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే ఈ మిగులు కిట్లను పరిగణనలోకి తీసుకోకుండానే 2023-24 సంవత్సరానికి 39,96,064 కిట్లకు సప్లయి ఆర్డర్‌ ఇచ్చింది. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు 38,22,000 మంది మాత్రమే. 2022-23లో మిగిలిన 5,63,977 కిట్లు, 1,74,064 కలిపి మొత్తం 7,38,041 కిట్లు మిగులుగా ఉండాలి. వీటిల్లో రీప్లేస్‌మెంటు బ్యాగులు, బూట్లు, కెజిబివి, మోడల్‌ స్కూల్స్‌, రెసిడెన్షియల్‌ విద్యార్థులకు నాలుగో జత యూనిఫాం అందించిన లెక్కలు తీసేసినా, 7,08,239 నోటు పుస్తకాలు, 6,40,181 బ్యాగులు, 5,21,506 బూట్లు, 4,91,226 యూనిఫాం జతలు, 2,21,764 బెల్టులు మిగిలి ఉండాలి. ఇవి కాకుండా పిక్టోరియల్‌, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు సుమారు లక్షల్లో మిగులు ఉండాలి. కోట్లకు సంబంధించిన ఈ మిగులు వస్తువులపై అధికారులు మాత్రం కాకి లెక్కలతో తప్పించుకుంటున్నారు.
 

                                                                    కొంతమందికే అదనపు యూనిఫాం

2022-23 విద్యాసంవత్సరంలో మిగిలిన యూనిఫాం జతలను కెజిబివి, మోడల్‌ స్కూల్స్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు నాలుగో జత కింద అందించామని సమగ్ర శిక్ష చెబుతోంది. అయితే మిగులు యూనిఫాం అన్ని జిల్లాలకూ అందించలేదు. బాపట్ల, కర్నూలు, అనంతపురం కెజిబివి జిల్లాల్లో ఒక్క విద్యార్థికీ కూడా అందించలేదు. అదేవిధంగా కడప జిల్లాలో అన్ని కెజిబివిలకూ అందించలేదు.