Apr 07,2023 07:53

          దేశంలో సాగుతున్న కార్పొరేట్‌- మతతత్వ కూటమి పాలన అంతం కావాలని, 'మోడీ గద్దె దిగు' అంటూ లక్షలాదిమంది కష్టజీవులు మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ఢిల్లీ నడిబొడ్డున నినదించడం అభినందనీయం. ఆసేతు శీతాచలం నుండి హస్తినకు తరలివచ్చిన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశ సంపద సృష్టికర్తలు బుధవారంనాడు ఒకే వేదికపైకి వచ్చి ఒక్కటై హోరెత్తించారు. కాలికి చెప్పులు లేకుండా అనేక మంది ర్యాలీలో పాల్గొనడం, మహిళలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం ఎంతో స్ఫూర్తిదాయకం. దేశ నలు మూలలనుండి వచ్చిన కష్టజీవులు ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే ఆహార్యంతో పాల్గొనడం 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' కళ్లకు కట్టింది. శ్రామిక ప్రజలపైన వారి జీవనోపాధులపైన, హక్కులపైన మోడీ సర్కారు చేస్తున్న దాడికి వ్యతిరేకంగా పోరాడటంతోపాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ఈ దేశాన్ని లౌకిక గణతంత్ర రాజ్యంగా పరిరక్షించడానికి సాగుతున్న మహోద్యమంలో ఈ ర్యాలీ ఓ ఉజ్వల ఘట్టం. రాం లీలా మైదానంలో సిఐటియు, ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన చారిత్రాత్మక మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ మార్చ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, వారికి అన్ని విధాలా సహకరించిన వారందరికీ జేజేలు !.
         దేశంలో నయా ఉదారవాద పాలన కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలపై సాగించిన తీవ్ర దాడి ఫలితంగా గత రెండు దశాబ్దాలుగా మూడు లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రస్తుత బిజెపి ప్రభుత్వ హయాంలో ఈ దాడి మరింత తీవ్రమైంది. మోడీ ప్రభుత్వం లేబర్‌ కోడ్‌లు, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలతో ఈ దాడిని సంస్థాగతీకరించడానికి ప్రయత్నించింది. రైతుల సుదీర్ఘ వీరోచిత ప్రతిఘటనతో వెనక్కి తగ్గినా అది తన ఉద్దేశాన్ని వదులుకోలేదు. వ్యవసాయ కార్మికులు, సామాన్య రైతాంగానికి ఉపాధి లభించడం లేదు. ఆహార ధాన్యాల సాగు నుండి రైతులను దూరం చేయడంతో దేశ ఆహార భద్రత దెబ్బ తింటోంది. పేదలకు ఇచ్చే సబ్సిడీల రద్దు, వారికి మేలుచేసే పథకాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధిస్తున్నారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు సకల కుట్రలు చేస్తున్నారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ, తొమ్మిదేళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా ఆ హామీని పూర్తిగా గాలికొదిలేశారు. యువతీయువకులకు ఉపాధి కల్పించని మోడీ సర్కారు గోరక్షక్‌ పేరుతో రెచ్చిపోతున్న మూకలకు మాత్రం ఉద్యోగాలిచ్చి విద్వేషాలు, విధ్వంసం సృష్టిస్తోంది.
          కరోనా సమయంలో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వేల మైళ్లు కాలినడకన స్వగ్రామాలకు పోయి బికారులుగా మారిన పరిస్థితిరాగా మరోవైపు అదానీ, అంబానీ వంటి కుబేరుల ఆస్తులు అనేక రెట్లు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ధనికులకు పన్ను రాయితీలు ఇస్తోంది. ఆశ్రిత పెట్టుబడి దేెశ సంపదను ఆమూలాగ్రం దోచుకు తింటోంది. ప్రజల సంపదయైన ప్రభుత్వరంగ సంస్థలను సర్కారు ధారాదత్తం చేస్తోంది. నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోంది. ఇన్ని దారుణాలకు తెగబడుతున్న ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే వారిని భయభ్రాంతులకు గురిచేయడం, ప్రతిపక్ష రాజకీయాల పార్టీలను అంతమొందించడానికి ప్రయత్నించడం ఘోరం. ప్రజల మధ్య విద్వేషాల సృష్టికి యత్నించడం దుర్మార్గం.
        మోడీ సర్కారు దుర్విధానాలకు వ్యతిరేకంగా మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ మార్చ్‌ జాతీయ స్థాయిలో జరిగింది. ఇలాంటి ర్యాలీలు, ప్రతిఘటనా పోరాటాలు క్షేత్ర స్థాయిలో కూడా జరగాలి. దేశ భవిష్యత్తు కోసం మార్పు అవసరం, అనివార్యం. కార్పొరేట్‌-మతతత్వ కూటమి పాలనకు వ్యతిరేకంగా కార్మిక కర్షక లోకం మరింతగా ఉద్యమించాలి. విశాల ఐక్య పోరాటాలను నిర్మించాలి. ఐక్య పోరాటాలతోనే భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఆపడం, మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించడం సాధ్యమైందన్న విషయం సదా గుర్తుంచుకోవాలి. పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చేసే చట్ట సాధన, లేబర్‌ కోడ్‌ల రద్దు, విద్యుత్‌ చట్ట సవరణల ఉపసంహరణ వంటి డిమాండ్లపై భవిష్యత్‌ ఉద్యమాలు, పోరాటాలకు అదే స్ఫూర్తి.