Feb 14,2023 16:26

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : శాసనమండలి ఎన్నికలలో నిర్వహణలో విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది చిన్నపొరపాటుకు కూడా తావివ్వరాదని కేటాయించిన విధులను ఎప్పటికప్పుడు అవగాహనతో నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ డి.కె.బాలాజీ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో ఎన్నికల విధులు కేటాయించిన ప్రత్యేక అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ సమావేశమై ఎన్నికల నిర్వహణపై పలు సూచనల చేశారు. జెసి మాట్లాడుతూ ప్రధానంగా పోలింగ్‌ మెటీరియల్‌ సిద్ధం చేయడం వాటిని సక్రమంగా పోలింగ్‌ కేంద్రాలకు అందించడం ప్రణాళిక ప్రకారం జరగాలని అన్నారు. పిఓలకు, ఎపిఓలకు ఆర్‌డిఓల సమక్షంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణను ఇవ్వనున్నామని, ఈ శిక్షణను రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌ వి.ఆర్‌.చంద్రమౌళి నిర్వహించనున్నారని సూచించారు. ఈ ఎన్నికలు బ్యాలట్‌ పేపర్లతో జరగనున్నాయని అన్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ అమలుపై అధికారులు పోలీస్‌ యంత్రాంగం రోజు వారి నివేదికలను అందించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పి కులశేఖర్‌, డిఆర్‌ఓ శ్రీనివాసరావు, రిటైర్డ్‌ జెసి (ట్రైనర్‌) ఆర్‌.చంద్రమౌళి, నగరపాలక డిప్యూటీ కమీషనర్‌ చంద్రమౌళీశ్వర రెడ్డి, తుడా సెక్రటరీ లక్ష్మి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్‌ రెడ్డి, ఎ.ఓ. సుబ్రహ్మణ్యం, ఎన్నికల తహశీల్దార్‌ పరమేశ్వర స్వామి, డి.టి. విజయభాస్కర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.