Sep 21,2022 06:57

మరావతి రాజధాని కోసం రైతులు భూములిచ్చింది ప్రభుత్వానికి, వ్యక్తులకు కాదు. బాధ్యత ప్రభుత్వానిదే. ఒక అనిశ్చితి, వంద సమస్యలు, ఇంకో వెయ్యి అపోహలను రాజధాని మీద ప్రభుత్వమే ప్రచారం చెయ్యడం తన పిల్లల్ని తానే భక్షించే జాతి లక్షణం తప్ప వేరే కాదు. అమరావతి రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు కావాలన్న ఒక అపోహను ప్రభుత్వం పదే పదే ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం నిజం కాదు. అప్పటి ప్రభుత్వం అంచనా ప్రకారం అమరావతి నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.55,343 కోట్లు. ఇందులో ప్రపంచ బాంక్‌, హడ్కో వంటి ఆర్థిక సంస్థల ద్వారా, బాండ్ల ద్వారా, బాంకుల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం నేరుగా తన వనరుల నుంచి రూ.12,600 కోట్లు, దానిలో కూడా రూ.5,971 కోట్లు ప్రభుత్వ గ్రాంట్‌గా, రూ.6,629 కోట్లు ప్రభుత్వ వాటాగా పెట్టాలని నిర్ణయించారు. ఇది కూడా దశల వారీగా 2026 వరకు, ఏటా రూ.1800 కోట్లు పెట్టుబడి విభజన. ఈ గణాంకాలన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో లభ్యమైనవే. ఈ అంచనాల్లో లోపాల మీద, లేదా అప్పటి ప్రభుత్వంలో ఏదేని స్వార్ధ ప్రయోజనాల మీదా పోరాడాలి తప్ప ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను రాజకీయ వ్యక్తిగత కోణంలో తీసుకొని అంతిమమంగా భూములిచ్చిన రైతులను బాధితులుగా చెయ్యడం అత్యంత పాశవిక చర్య. కంచే చేను మేసినట్టు. ఒక సామాజిక కార్యకర్తగా నేను అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటించాను. ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డా. కొలొకిపూడి శ్రీనివాస్‌ సహకారంతో భూములిచ్చిన రైతుల జీవనం మీదే కాకుండా... కౌలు రైతుల, రైతు కూలీల సామాజిక ఆర్థిక జీవన స్థితిగతుల మీద, 29 గ్రామాల మీద అధ్యయనం చేశాము. ఆ వివరాలు అమరావతి కథల పేరుతో సామాజిక మాధ్యమాల్లో కూడా పెట్టాం. అత్యంత దుర్భర జీవితం, చెప్పలేని మానసిక వేదన, ఆశలు నీరయిపోయిన వ్యధాభరిత జీవితాలను గడుపుతున్న వైనాన్ని చూశాం. బాధపడ్డం తప్ప ఏమీ చెయ్యలేని అసహాయత లోంచి పుట్టిన ఆక్రోశాన్ని విన్నాము. కానీ ఇంత బాధలో కూడా వారు పంచిన ప్రేమ ఆప్యాయతలు రైతు సున్నిత మనస్సుని తెలియచెప్పాయి. ఉన్న దాంట్లోనే పంచే గుణాన్ని చూసి మనసు ఆర్ధ్రమైంది. ఇంతటి బాధలో కూడా వారు తమ పోరాటానికి ఎంచుకొన్న దారి జాతిపిత మనకు అందించిన అహింసావాద సత్యాగ్రహ పోరాటం. బడుగు బలహీన వర్గాల పోరాటాలు ఈ సమాజ వికాసానికి చైతన్య దీపికలయ్యే రోజు వస్తుందన్న నమ్మకం ప్రజాస్వామ్యాన్ని కోరుకొనే ప్రతి ఒక్కరిలో ఉంది. రైతు ఉద్యమాలు సఫలం కావాలి.

- డా|| వసుంధర,
సామాజిక ఉద్యమ కార్యకర్త