Dec 31,2022 07:36

ఏడాది సైన్స్‌ పరిశోధనలలో ఎవరికి నోబెల్‌ బహుమతి వచ్చిందని అడిగితే...చాలా చోట్ల విద్యార్థులతో పాటు, అనేక మంది ఉపాధ్యాయులు కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం సైన్స్‌ ఆవిష్కరణల గురించి వివిధ మాధ్యమాలు పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోవడమే. సినిమాలు, ఆటలు, రాజకీయాల గురించే ప్రసార మాధ్యమాలు ఎక్కువగా చర్చలు పెడుతుంటాయి. సాధారణ ప్రేక్షకులను అలరించే విధంగా వీరు కార్యక్రమాలు రూపొందిస్తుంటారు. సమాజంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నపుడు విద్యార్థులకు సైన్స్‌ ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంచడానికి సైన్స్‌వాదులు కృషి చేయాలి.
          ఇటీవల కొన్ని ఆవిష్కరణలను చూస్తే...బ్రిటన్‌ కు చెందిన ఇంజినీర్‌ ఆర్ట్స్‌ అనే సంస్థ అమెకా పేరుతో ఒక చురుకైన హ్యూమనాయిడ్‌ రోబోను తయారు చేసింది. ఇది అచ్చం మనిషిలానే స్పందిస్తుంది. నవ్వుతుంది. బాధపడుతుంది. కృత్రిమ మేధో రంగంలో ఇదొక ముందడుగుగా చెప్పవచ్చు.
        నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారక గ్రహంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తోంది. ఇందుకోసం రెండు రకాల రోవర్లను పంపింది. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట పంపిన ఇన్‌సైట్‌ ల్యాండర్‌ అనేక కొత్త విషయాలను సేకరించి భూమికి పంపింది. అయితే, ఈ మిషన్‌ త్వరలో తన పని తీరుకు ముగింపు పలుకుతోంది. అంగారక గ్రహంపై భూ ప్రకంపనలు, వాటి తీరుపై అధ్యయనానికి దీనిని నాసా ప్రయోగించడం చెప్పుకోదగ్గ అంశం.
         అంగారక గ్రహంపై భూకంప కార్యకలాపాల అధ్యయనం చేయడం దాని పరిశోధనలలో ఒకటి. అరుణ గ్రహంపై దిగినప్పటి నుంచి 1,300 కంటే ఎక్కువ భూకంపాల డేటాను సేకరించింది. అక్టోబర్‌ 2022లో ఇన్‌సైట్‌ 16-39 అడుగుల ఎత్తులో ఉన్న ఉల్క గ్రహాన్ని ఢకొీన్న తర్వాత రిక్టర్‌ స్కేల్‌పై 4 తీవత్రతో భూకంపాన్ని గుర్తించింది. భూమి కంటే మార్స్‌ మాంటిల్‌లో ఎక్కువ ఇనుము ఉందని ఇన్‌సైట్‌ పంపిన సమాచారంతో పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. నాసా ప్రకారం అంగారక గ్రహం అంతర్గత నిర్మాణాన్ని అధ్యయనం చేయడం వల్ల అంతర్గత సౌర వ్యవస్థలో రాతి గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో సమాధానం లభిస్తుంది. 'రాతి గ్రహాల నిర్మాణం, పరిణామాన్ని అధ్యయనం చేయడానికి ఇది సరైన ప్రయోగశాల' అని తెలిపింది.
          తాజాగా 30 ఏళ్ల కిందట భద్రపరిచిన పిండం సాయంతో కవలలకు జన్మనిచ్చి గత రికార్డును అమెరికా జంట అధిగమించింది. ఒరేగాన్‌ రాష్ట్రానికి చెందిన రేచెల్‌ రిడ్జ్‌వే, ఫిలిప్‌ రిడ్జ్‌వే దంపతులకు అక్టోబరు 31న కవలలు జన్మించారు. వీరిలో ఒకరు పాప, ఇంకొకరు బాబు. ఈ కవలలకు లిడియా, తిమోతీ రిడ్జివే అనే పేర్లు పెట్టారు.నేషనల్‌ ఎంబ్రియో డొనేషన్‌ సెంటర్‌ (అమెరికా) ప్రకారం...లిడియా, తిమోతీ రిడ్జ్‌వే అనే కవలలు సుదీర్ఘకాలం భద్రపరిచిన పిండాలతో జన్మించారు. పుట్టినప్పుడు పాప లిడియా 5 పౌండ్ల 11 ఔన్సులు (2.5 కిలోలు), బాబు తిమోతీ 6 పౌండ్లు 7 ఔన్సులు (2.92 కిలోలు) బరువు ఉన్నారు. జీవ శాస్త్రంలో దీనిని ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు.
          ఇవే కాకుండా రంగులు మార్చే కారును, మడతపెట్టుకోవడానికి వీలుగా వుండే ల్యాపీని, శరీరంపై ఎటువంటి చిన్న కోత లేకుండా అంగుళం చిప్‌తో అల్ట్రా సౌండ్‌ పరీక్షలు చేయడం, ఉప్పు నీటితో వెలిగే వాటర్‌ లైట్‌ వంటి ఆవిష్కరణలు 2022లో సాధ్యం అయ్యాయి.
అలాగే ప్రముఖ శాస్త్రవేత్త స్వాంటే పాబోకి 2022కు గాను నోబెల్‌ పురస్కారం దక్కింది. ఫిజియాలజీలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం లభించింది. అంతరించిపోయిన ఆదిమానవుల జీనోమ్స్‌, మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు వరించింది. శాస్త్రరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్‌ పురస్కార గ్రహీత 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోన్స్‌ అందుకున్నారు. ఆయన జీనోమ్‌ సీక్వెన్స్‌పై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేశారు.
         ఇక మన దేశంలో క్రమంగా సైన్స్‌ పరిశోధనలకు నిధుల కేటాయింపు తగ్గుతున్నది. టీవీల్లో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం జోరుగా ప్రసారం అవుతున్నాయి. మత ప్రబోధకులకు లభించిన గౌరవం సైంటిస్టులకు రావడం లేదు. పైగా సైన్సు ప్రచారకులపై దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు అంతరిక్షంలో ఇస్రో సంస్థ సాధించిన విజయాలు ఊరట కల్గిస్తున్నా, నూతన ఆవిష్కరణల విషయంలో మనమింకా వెనుకబడే ఉన్నాం.
          ఈ స్థితిని మనం అధిగమించాలంటే సైన్స్‌ ఆవిష్కరణలపై మరింత ప్రచారం జరగాలి. విద్యాలయాల్లో సొంతంగా సైన్స్‌ ప్రయోగాలు చేసే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. విశ్వవిద్యాలయాల్లో సైన్స్‌ పరిశోధనలకు ప్రాముఖ్యతనివ్వాలి. సైన్స్‌ పరిశోధన సంస్థలకు ప్రభుత్వాలు అధిక నిధులు మంజూరు చేయాలి.
జన విజ్ఞాన వేదిక వంటి సైన్స్‌ ప్రచార సంస్థలు మరింత బలోపేతం కావాలి. అప్పుడే ఆవిష్కరణల విషయంలో మనం స్వయంప్రతిపత్తి సాధించగల్గుతాం.

- యం.రాం ప్రదీప్‌,
సెల్‌: 9492712836