Oct 08,2023 11:02

ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.
ఒకరోజు అతనికి తమ ఊరికి దూరాన ఉన్న మరో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊరిలో పని తెమిలేసరికి చాలా పొద్దుపోవడంతో చీకటిలో అడవి గుండా తమ ఊరు వెళ్ళలేక, అదే ఊరిలో ఉండే అతని మిత్రుడైన మాధవయ్య ఇంటికి వెళ్ళాడు.
మిత్రుడ్ని చూసి ఆనందపడిన మాధవయ్య ఆ రాత్రికి విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో వేరే అధరువులతో పాటు కాకరకాయ కూరను కూడా వడ్డించాడు. రామయ్య అంతకు ముందెప్పుడూ కాకరకాయలను చూసి ఉండలేదు. ఉల్లి కారం పెట్టి వండించాడేమో! ఘుమఘుమలాడుతూ చాలా బాగుంది.
'మిత్రమా! ఇదేమి కూర?' అడిగాడు మరింతగా వడ్డించుకుంటూ.
'అది కాకరకాయ కూర. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న కూరగాయ. మన ఆరోగ్యానికి మేలు చేసి, అజీర్ణం, మధుమేహం, ఆస్తమా వంటి రోగాలని అరికట్టడంలో తోడ్పడుతుంది. అందుకే నా పొలంలో వీటి విత్తనాలు నాటి పెంచుతున్నాను' అంటూ చెప్పాడు.
స్నేహితుని మాటలకు సంతోషపడిన రామయ్య తనకీ ఆ విత్తనాలు ఇవ్వమని అడిగి.. కొన్ని విత్తనాలు తెచ్చుకుంటాడు.
ఇంటికి వచ్చిన రామయ్య తన పొలంలో ఆ కాకర విత్తనాలు నాటుతాడు. అవి ఆనతికాలంలోనే పెరిగి, తీగలు సాగి.. పందిరికి అల్లుకుంటాయి. ఆ తరువాత పూతకు వచ్చి, పిందెలు వేస్తాయి.
మొట్టమొదటగా మూడు కాయలు మాత్రమే కూరకు పనికి వచ్చేలా తయారయ్యాయి. మిగిలినవి అన్నీ ఇంకా చిన్నగా పిందెలుగానే ఉన్నాయి.
దాంతో రామయ్య ఆ మూడు కాకరకాయల్ని కోసి ఇంటికి తెచ్చి భార్య సీతకు ఇస్తాడు. సీత కూడా ఆ కాయల్ని ఎప్పుడూ చూసి ఉండకపోవడంతో వాటిని గురించి భర్తని అడుగుతుంది.
తన స్నేహితుడు మాధవయ్య చెప్పిన విధంగానే భార్యకు వివరించి 'ఈ మూడు కాకరకాయల్నీ రేపు ఉదయం చక్కగా ఉల్లికారం పెట్టి వేయించి, కూర చెయ్యి. నా స్నేహితుడి ఇంట్లో అలాగే చేయించాడు' అని చెబుతాడు.
మరునాడు ఎప్పటిలానే భర్త పొలానికి వెళ్ళిన తరువాత వంట ప్రారంభించింది సీత.
ముందుగా భర్త చెప్పినట్లు ఉల్లి కారాన్ని తయారుచేసుకుంది. కాకరకాయల్ని చీల్చి, అందులో దట్టించింది. ఆ తరువాత బాణలి పొయ్యి మీద పెట్టి, నూనె పోసి అందులో కాకరకాయల్ని వేసి బాగా వేయించింది.
అవి అలా వేగుతున్నప్పుడే మంచి వాసనతో ఘుమఘుమలాడాయి. కూర పూర్తయ్యేసరికి సీతకి నోట్లో నీరు ఊరి, కూర ఎలా ఉంటుందో రుచి చూడాలనిపించింది. దానికి తోడు ఎప్పుడూ ఆ కాయల్ని రుచి చూసి ఉండలేదు. వెంటనే, ఓ కాయ నోట్లో వేసుకుని రుచి చూసింది. చాలా బాగుంది. అది బాగుండడంతో, ఇంకో కాయ కూడా తినాలని అనిపించి, 'నా వంతు కూర నేను తింటున్నాను' అనుకుంటూ ఇంకో కాయ కూడా తినేస్తుంది. పొలానికి వెళ్ళిన రామయ్య భార్య వండే కూరను తలచుకుని ఉవ్విళ్ళూరుతూ ఇంటికి వస్తాడు. భర్తకు పీట వేసి కూర్చోబెట్టిన సీత అతని విస్తరిలో, బాణలిలో మిగిలిన ఒక కాకరకాయనూ వేసి, భోజనం పెడుతుంది.
'అదేమిటీ? నేను మూడు కాకరకాయలు తెచ్చానుగా.. ఒకటే ఉందేమిటీ?' అడిగాడు ఆశ్చర్యంగా.
సీత వెనుకా ముందూ తడుముకోకుండా 'నేనే తినేశాను' అంటూ చెప్పింది.
'అదేం? అలా ఎలా తినేసావ్‌?' అన్నాడు కోపంగా తనకు ఒక్కటే మిగిలిందన్న బాధతో.
అతని పక్కనే కూర్చుని ఉన్న సీత 'ఎలాగా! ఇదిగో! ఇలా' అంటూ అతని విస్తరిలో ఉన్న మిగిలిన కాకరకాయను కూడా తీసుకుని.. నోట్లో వేసుకుని..తినేసింది.
ఆమె చర్యను చూసి విస్తుపోయాడు రామయ్య.
అతన్నే గమనించిన సీత 'ముందు రుచి కోసం ఒక కాయ తిన్నాను. మరొకటి నా వంతు కూరగా తిన్నాను. మిగిలినది మీ విస్తరిలోనిది ఇంకా కోరిక తీరక తిన్నాను' అంటూ చెప్పింది.
ఎంతగానో ఎదురుచూసిన కూర.. భార్య తనకి లేకుండా తినేసినందుకు మొదట కోపం వచ్చినా, చేదుగా ఉన్నా భార్యకు కాకరకాయ రుచి నచ్చడంతో.. ఆరోగ్యప్రదమైన, ఔషధ గుణాలున్న కూరగాయ తన తోటలో పండిస్తున్నందుకు సంతోషపడ్డాడు.
'నాలుగు రోజుల్లో మరిన్ని కాయలు కాపుకి వస్తాయి. అప్పుడు మరిన్ని కాయలు తెస్తాను. అప్పుడు ఇలా చేస్తే ఊరుకునేది లేదు' అంటూ ప్రేమగా భార్య చెవిని మెలేశాడు.
తనూ తన స్నేహితుడు పెట్టినపుడు అలానే తిన్నాడు మరి.. మనసులో అనుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నాడు.


- పి.ఎల్‌.ఎన్‌. మంగారత్నం
97014 26788