
హైదరాబాద్ : తెలంగాణలో జర్నలిస్టులకు సంబంధించిన పలు సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య డిమాండ్ చేశారు. అధికార బీఆర్‌ఎస్ పార్టీతో సహా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జర్నలిస్టుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కఅషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. గత ఎన్నికల్లో జర్నలిస్టుల సమస్యలను మేనిఫెస్టో లో చేర్చి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించిందని విమర్శించారు. తొమ్మిదేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు అనేక సార్లు హామీలిచ్చి ఆశలు రేకెత్తించారని, చివరికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా జర్నలిస్టుల సంక్షేమానికి ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని తెలిపారు. కరోనా సమయంలో వందలాది మంది జర్నలిస్టులు చనిపోవడం, అనారోగ్యానికి గురి కావడం జరిగిందని, చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి కేవలం లక్ష రూపాయలు సహాయం అందించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వంటి నగరాల్లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించకుండా కేవలం కొన్ని జిల్లాల్లో కొంతమందికి అనధికారికంగా ఇళ్ళస్థలాలిచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు అవమానాలు, అన్యాయాలు తప్ప తొమ్మిదేళ్ళుగా జరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు, ఇండ్ల నిర్మాణం, పెన్షన్ స్కీమ్, హెల్త్ కార్డులపై అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించడం, సంక్షేమ నిధిని మరో వంద కోట్లకు పెంచడం, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం, చిన్న, మధ్య తరహా పత్రికలను ఆదుకోవడం తదితర డిమాండ్లను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని వారు కోరారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ డిమాండ్లను పరిష్కరిస్తామని అన్ని పార్టీలు హామీ ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలను మేనిఫెస్టో లో చేర్చి పరిష్కరిస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చిన పార్టీలకు జర్నలిస్టులు మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు.