మంగళవారం నాడు అల్‌జజీరా వెల్లడించిన సమాచారం మేరకు హమాస్ దాడుల్లో 1,400 మందికి పైగా మరణించగా దానికి ప్రతిగా ఇప్పటి వరకు గత పదకొండు రోజుల్లో ఇజ్రాయిల్ మిలిటరీ దాడుల్లో గాజాలోని పాలస్తీనియన్లు 2,808 మంది మరణించారు. వారిలో మూడో వంతు మంది పిల్లలు. అయినా రక్తదాహం తీరలేదు. ఈ స్థితిలో హమాస్ దాడుల నుంచి ఆత్మరక్షణకు పూనుకోవటం ఇజ్రాయిల్‌కు ఉన్న హక్కు, దాని బాధ్యత అని నొక్కివక్కాణించేందుకు అమెరికా అధినేత జో బైడెన్ బుధవారం నాడు ఇజ్రాయిల్ వచ్చి కొన్ని గంటల పాటు అక్కడ గడపుతాడని తాజా వార్తలు. నిరంతరం మానవ హక్కుల గురించి ప్రపంచానికి బోధ చేస్తున్న అమెరికా నేత ఇజ్రాయిల్ గడ్డ మీద కూర్చొని ఇంకా కొట్టండి, చంపండి...అని గాక ఇంకా ఏం చెబుతాడో చూద్దాం.
''హంతకుల మీద ఈ రోజు మనం నెపం నెట్టకూడదు. మన పట్ల వారి తీవ్ర ద్వేషాన్ని ఎందుకు గర్హించాలి? ఎనిమిది సంవత్సరాలుగా గాజాలోని శరణార్ధి శిబిరాలలో వారు కూర్చున్నారు. వారు, వారి తండ్రులు నివశించిన చోట వారి భూములు, గ్రామాలను వారి కళ్ళ ముందే మన ఎస్టేట్లుగా మార్చివేయటాన్ని వారు చూస్తున్నారు'' ఈ మాటలు చెప్పింది జనరల్ మోషే డయాన్. నూటికి నూరు పాళ్లు యూదు దురహంకారే. 1948లో ఇజ్రాయిల్ మిలిటరీ పాలస్తీనా అరబ్బు ప్రాంతాల మీద జరిపిన దురాక్రమణ, హత్యాకాండకు నాయకత్వం వహించిన అధికారులలో ఒకడు. తరువాత మిలిటరీ ప్రధాన అధికారిగా పని చేశాడు. 1956లో పాలస్తీనా గెరిల్లాలు జరిపిన దాడుల తరువాత డయాన్ చేసిన వ్యాఖ్యలివి. తరువాత కాలంలో పాలస్తీనియన్లతో శాంతి పరిష్కారం కోరుకున్న కారణంగా అదే యూదు దురహంకారులు అతన్ని పక్కన పెట్టారు. ఈ రోజు హమాస్ చేసిన దాడులతో మొత్తం పాలస్తీనా వాసులను నిందిస్తున్న వారు అర్ధం చేసుకోవాల్సిన కీలక అంశం ఏమిటో డయాన్ చెప్పాడు.
పాలస్తీనా-ఇజ్రాయిల్ వివాదంలో ఒక యూదు దురంహంకారికి తెలిసిన మేరకు కూడా మధ్యవర్తిగా ఉన్న అమెరికా అర్ధం కానంత అమాయకంగా ఉందా? 1948 నుంచి పాలస్తీనియన్ల ప్రాంతాలను ఆక్రమించి వారిని తరమివేయటంతో విదేశాల్లో శరణార్ధులుగా, ఇజ్రాయిలీ పాలకులు బహిరంగ జైలుగా మార్చిన పాలస్తీనా ప్రాంతాలలో బందీల మాదిరి క్షణం క్షణం ఏం జరుగుతుందో తెలియని భయం, అనిశ్చితిలో బతుకుతున్నారు. మంగళవారం నాడు అల్‌జజీరా వెల్లడించిన సమాచారం మేరకు హమాస్ దాడుల్లో 1,400 మందికి పైగా మరణించగా దానికి ప్రతిగా ఇప్పటి వరకు గత పదకొండు రోజుల్లో ఇజ్రాయిల్ మిలిటరీ దాడుల్లో గాజాలోని పాలస్తీనియన్లు 2,808 మంది మరణించారు. వారిలో మూడో వంతు మంది పిల్లలు. అయినా రక్తదాహం తీరలేదు. ఈ స్థితిలో హమాస్ దాడుల నుంచి ఆత్మరక్షణకు పూనుకోవటం ఇజ్రాయిల్‌కు ఉన్న హక్కు, దాని బాధ్యత అని నొక్కివక్కాణించేందుకు అమెరికా అధినేత జో బైడెన్ బుధవారం నాడు ఇజ్రాయిల్ వచ్చి కొన్ని గంటల పాటు అక్కడ గడపుతాడని తాజా వార్తలు. నిరంతరం మానవ హక్కుల గురించి ప్రపంచానికి బోధ చేస్తున్న అమెరికా నేత ఇజ్రాయిల్ గడ్డ మీద కూర్చొని ఇంకా కొట్టండి, చంపండి...అని గాక ఇంకా ఏం చెబుతాడో చూద్దాం. త్రివిధ దళాలతో గాజా లోని సామాన్య పౌరుల మీద దాడులకు ఇప్పటికే సన్నాహాలు పూర్తి అయ్యాయి. బైడెన్ తిరిగి అమెరికా వెళ్లిన తరువాత విరుచుకుపడవచ్చు. ఈ పూర్వ రంగంలో మరోవైపున లెబనాన్-ఇజ్రాయిల్ సరిహద్దులో పరస్పరం దాడులకు దిగినట్లు, కొందరు మరణించినట్లు వార్తలు. రానున్న కొద్ది గంటల్లో ఇజ్రాయిల్ మీద ఆ ప్రాంతంలోని కొన్ని బృందాలు దాడులకు దిగవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పాడు. వివాదం మరింతగా ముదరకూడదని తాము కోరుకుంటున్నామని ఇరాన్ ఒక సందేశాన్ని పంపింది. అయితే గాజాలో పరిస్థితి దిగజారితే తాను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు కూడా వార్తలు. ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తే పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఇరాన్ భాగస్వామి అవుతుందని కొందరు చెబుతున్నారు.
పాలస్తీనా విముక్తి కోసం పలు పద్ధతులలో పోరాడుతున్నవారు ఉన్నారు. హమాస్ సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుంది. అదీ ఎప్పుడు? ఇజ్రాయిల్ ఆక్రమణలకు పాల్పడి అరబ్బుల తరిమివేత, హత్యాకాండను ప్రారంభించిన ఐదు దశాబ్దాల తరువాత. పాలస్తీనా ప్రాంతాలను అక్కడి జనాలకు అప్పగించి ఇజ్రాయిల్ తప్పుకుంటే సమస్య ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది. అంతా అమెరికా చేతిలో ఉంది. ఐక్యరాజ్య సమితి తాను చేసిన తీర్మానాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్యకు ఎందుకు ఉపక్రమించటం లేదు ? భద్రతా మండలి చేసే తీర్మానాన్ని ఇజ్రాయిల్ కు అనుకూలమైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వీటో చేస్తాయి. సాధారణ అసెంబ్లీ చేసే తీర్మానాలకు విలువ ఉండదు. నాలుగున్నర దశాబ్దాల తరువాత అమెరికా మధ్యవర్తిత్వంలో ఓస్లో ఒప్పందం కుదిరింది. ఆ మేరకు పాలస్తీనాలో పరిమిత అధికారాలున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఇజ్రాయెల్ తాను ఆక్రమించిన ప్రాంతాలను క్రమంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఈ ఒప్పందాన్ని పాలస్తీనా విమోచనా సంస్థ (పిఎల్‌ఓ) చేసుకుంది. దాన్ని ఇతర పార్టీలు, సంస్థలు ఆమోదించలేదు. లొంగుబాటుగా వర్ణించాయి. వాటిలో హమాస్ ఒకటి. ఎందుకంటే దానిలో అసలు పాలస్తీనా దేశం అనే పదాలే లేవు. ఆ ఒప్పందాలు జరిగి మూడు దశాబ్దాలు గడచింది. మొత్తం మీద చూసినపుడు ఒక్క నిబంధనను కూడా అమలు జరపలేదు. ఆక్రమణల నుంచి ఇజ్రాయిల్ వైదొలగలేదు, పాలస్తీనాకు అప్పగించలేదు. ఆక్రమణలు ఇంకా పెరిగాయి. జెరూసలెం పట్టణాన్ని కూడా ఆక్రమించేందుకు పూనుకుంది. మధ్యవర్తిగా ఉన్న అమెరికా అమలు జరిపేందుకు ఒత్తిడి తేవటంమాని యూదుల పక్షాన నిలబడింది. ఓస్లో ఒప్పందంపై సంతకాలు చేసి దాన్ని అమలు జరిపేందుకు పూనుకోవాలి అని చెప్పిన ఇజ్రాయిల్ ప్రధాని యత్జిక్ రబిన్‌పై తీవ్రవాదులైన యూదు దురహంకారులు కుట్ర చేసి 1995లో హత్య చేశారు. ఎవరైనా అమలుకు పూనుకుంటే వారికి ఇదే గతి అన్న హెచ్చరికే అది.
ఇక హమాస్ తాజా దాడులకు ఎందుకు పాల్పడిందన్న అంశం మీద ప్రచారంలో ఉన్న కుట్ర సిద్ధాంతాలలో ఒకటేమిటంటే ఇజ్రాయిల్-సౌదీ అరేబియా మధ్య సయోధ్య కుదిర్చేందుకు అమెరికా చేస్తున్న యత్నాలను దెబ్బ తీసేందుకు అన్నది ఒకటి. పాలస్తీనా అరబ్బులకు మద్దతు ఇస్తున్న దేశాలలో సౌదీ ఒకటి. అది ఇజ్రాయిల్‌తో కుదుర్చుకొనే ఒప్పందాలకు ప్రాతిపదికలు ఏమిటో బహిర్గతం కాలేదు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం జెరూసలెంతో సహ పశ్చిమ గట్టు, గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్ ఆక్రమించుకున్న ప్రాంతాలను పాలస్తీనాకు బదలాయిస్తేనే రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనేందుకు అవకాశం ఉందని సౌదీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఉగ్రవాదులైన ఇజ్రాయిల్ మంత్రులు, యంత్రాంగానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దాడి జరిగిన ఐదు గంటల తరువాత మాత్రమే ఇజ్రాయిల్ భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ కుట్రను అర్ధం చేసుకోలేని హమాస్ వచ్చిన అవకాశాన్ని దాడికి ఉపయోగించుకున్నట్లు కొందరు చెబుతున్నారు.
గాజాపై దాడికి ఇజ్రాయిల్ పూనుకున్న పూర్వరంగంలో పశ్చిమాసియాలో పర్యవసానాలు, చైనా పాత్ర గురించి కూడా విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయిల్‌తో ఒప్పందాన్ని సౌదీ పక్కన పెట్టినట్లు, ఇరాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా పరిస్థితికి బాధ్యత ఇజ్రాయిల్ దే అన్న సౌదీ, పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది, హమాస్ చర్యను ఖండించలేదు. గతంలో ఇజ్రాయిల్‌ను హెచ్చరించినట్లు కూడా పేర్కొన్నది. ఈ స్పందన మీద అమెరికా మండిపడింది. తమతో సాధారణ సంబంధాలను కోరుకోవాలనుకొనే వారి నుంచి రావాల్సిన సాధారణ ప్రకటన ఇలా ఉండకూడదని వ్యాఖ్యానించింది. ఉప్పు-నిప్పుగా ఉన్న సౌదీ-ఇరాన్‌లను ఒక దగ్గరకు చేర్చి సంబంధాల ఏర్పాటుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా మధ్యవర్తిత్వం వహించింది. బ్రిక్స్ కూటమి లోకి ఈజిప్టు, సౌదీ, యుఏఇ, ఇరాన్‌లను తెచ్చేందుకు కూడా చూస్తున్నది. ఈ పూర్వరంగంలో చైనా నుంచి దూరంగా జరిగితే పౌర అణు కార్యక్రమంలో భాగంగా ఒక విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని అమెరికా ఇటీవల సౌదీకి ఒక బిస్కెట్ వేసింది. గత కొన్ని దశబ్దాలుగా అమెరికా మిత్ర దేశంగా ఉన్నప్పటికీ గతంలో అలాంటి ప్రతిపాదన చేయలేదు. ఇరాన్‌తో కుదిరిన మైత్రిని దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. మరోవైపున మధ్య ప్రాచ్యంలో తన పట్టు తగ్గలేదని, తనను ఎదిరిస్తే అంతు చూస్తానని బెదిరించేందుకు రెండు విమాన వాహక యుద్ధ నౌకలను, యుద్ధ ఓడలను ఆ ప్రాంతానికి పంపింది. ఉక్రెయిన్ సంక్షోభంలో తటస్థంగా ఉన్న మన దేశం ఇప్పుడు ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటించింది.
చైనా వైఖరిని ఇజ్రాయిల్, అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాలు జీర్ణించుకోకపోగా మండిపడుతున్నాయి. తటస్థం అంటే ఇజ్రాయిల్ వ్యతిరేక వైఖరిని తీసుకోవటంగా చిత్రిస్తున్నాయి. అరబ్ దేశాల్లో తనకు అనుకూలమైన స్థితిని సృష్టించుకొనేందుకు చూస్తున్నదని, తన ప్రపంచ ఎజెండాను ముందుకు తీసుకుపోవటంలో ఇది భాగమని ఉక్రోషం వెల్లడిస్తున్నాయి. ఒకవైపున జనాలను వీధుల్లో హతమారుస్తున్నపుడు దాని గురించి మాట్లాడకుండా పాలస్తీనా ఏర్పాటు గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాలస్తీనా పాలనా మండలి అధ్యక్షుడు అబ్బాస్‌ను ఒక దేశాధినేత హోదాలో చైనా ఆహ్వానించింది. పాలస్తీనా పౌరుల న్యాయమైన జాతీయ హక్కులకు మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో ఇజ్రాయిల్ ప్రధానిని కూడా చైనా ఆహ్వానించింది. పాలస్తీనా పౌరుల హక్కులను హరించినందుకు గాను గతంలో దౌత్య సంబంధాలు పెట్టుకొనేందుకు నిరాకరించిన చైనా ఇటీవలి కాలంలో వైఖరిని మార్చుకొని అటు పాలస్తీనా ప్రతినిధులతో పాటు ఇటు ఇజ్రాయిల్‌తో కూడా సంబంధాలను నిర్వహిస్తున్నది. మరోవైపున చైనా మీడియాలో అమెరికా పాత్రను ఎండగడుతూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒక వైపున అరబ్ దేశాలను ఇజ్రాయిల్‌కు దగ్గర చేసేందుకు, మరోవైపున యూదు దురహంకారులకు మద్దతు ఇస్తూ పాలస్తీనియన్ల మీద భరించరాని ఒత్తిడిని అమెరికా పెంచుతున్నదని, ఒకవైపు కొమ్ముకాస్తున్నదని పేర్కొంటున్నారు. చైనా పశ్చిమాసియా తాజా వివాదంలో తటస్థంగా ఉంది. ఉభయ పక్షాలు శాంతం వహించాలని కోరింది తప్ప హమాస్‌ను ఖండించలేదు. మావో కాలం నుంచీ పాలస్తీనా పక్షమే వహిస్తున్నది. ఆత్మ రక్షణ పేరుతో తన దాడులను ఇజ్రాయిల్ సమర్ధించుకుంటున్నది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్‌తో మాట్లాడుతూ ఆత్మ రక్షణ పరిధికి మించి ఇజ్రాయిల్ చర్యలు ఉన్నాయి. అది అంతర్జాతీయ పిలుపులను వినాలి, గాజా పౌరులందరినీ శిక్షించాలని చూస్తున్న చర్యలను ఐరాస ప్రధాన కార్యదర్శి నిలిపివేయించాలని, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడాలని కూడా చైనా మంత్రి స్పష్టం చేశాడు. చైనా ఇస్తున్న గట్టి మద్దతు అరబ్ ప్రపంచంలో పాలస్తీనియన్లకు మరింత బలాన్ని ఇస్తుందని, అరబ్ దేశాలు వారి వైపున నిలిచే అవకాశం ఉందని, చైనా కోరుకుంటోంది కూడా అదేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభంలో కూడా తటస్థత అంటూ రష్యా దాడులను ఖండించలేదని మరోవైపున దానితో సంబంధాలను మరింతగా మెరుగు పరుచుకుందని పశ్చిమ దేశాల విశ్లేషకులు చైనా మీద మండిపడుతున్నారు.
ఎం. కోటేశ్వరరావు