జెరూసలెం : న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు బిల్లును తీసుకువస్తున్న పచ్చి మితవాద నెతన్యాహూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. మంగళవారం 'డే ఆఫ్ డిసరప్షన్ (అంతరాయం కలిగించే రోజు)'లో భాగంగా ఆందోళనకారులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. టెల్ అవీవ్, సైనిక ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకారులు (అధిక శాతం మంది మిలటరీ సభ్యులు) మానవహారం చేపట్టారు. సెంట్రల్ టెల్ అవీవ్‌లోని ఇజ్రాయిల్ సైనిక ప్రధాన కార్యాలయమైన కిర్యా ప్రవేశద్వారాలలో ఒక దానిని అడ్డుకున్నారు. అలాగే ఈ రోజంతా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఇజ్రాయిల్ 75 ఏళ్ల చరిత్రలో పచ్చిమితవాద, సాంప్రదాయ కన్జర్వేటివ్ ప్రభుత్వానికి నెతన్యాహూ నాయకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి దేశ న్యాయవ్యవస్థలో తీవ్రమైన మార్పులను ప్రతిపాదించారు. నాలుగేళ్లలో దేశంలో ఐదుసార్లు ఎన్నికలు నిర్వహించిన అనంతరం నెతన్యాహూ అధికారం చేపట్టారు. నిరసనలు వెల్లువెత్తడంతో మార్చిలో ఈ ప్రతిపాదనను నిలిపివేశారు. అయితే రాజకీయ ప్రతిపక్షాలతో రాజీ చర్చలు విఫలమవడంతో .. గత నెలలో తిరిగి ప్రణాళికను పునరుద్ధరించాలని నిర్ణయించారు.










