Oct 31,2023 10:59
  • లండన్‌లో ఐదు లక్షల మందితో భారీ ప్రదర్శన
  • ప్రపంచ వ్యాపితంగా పలు నగరాల్లో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలు

లండన్‌ : ఇజ్రాయిల్‌ హంతక దాడులకు వ్యతిరేకంగా, పాలస్తీనియన్లకు సంఘీభావంగా బ్రిటన్‌లో ఆదివారం అయిదు లక్షల మందితో భారీ ర్యాలీ జరిగింది. బ్రిటన్‌తో బాటు ప్రపంచవ్యాపితంగా పలు నగరాల్లో శని, ఆదివారాల్లో ప్రదర్శనలు, సంఘీభావ సమావేశాలు పెద్ద ఎత్తున జరిగాయి. వీధుల్లోకి వచ్చిన ప్రజలు ఆగ్రహంతో ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్న నినాదాలతో లండన్‌ వీధులు మార్మోగాయి. ఇజ్రాయిల్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వ ఆయుధాల అమ్మకం ఆపాలని వారు కోరారు. ఆదివారం నాటి ప్రదర్శన ఇప్పటివరకు జరిగిన ఆందోళనల్లో అతిపెద్దది.
          గత రెండు రోజులుగా గ్లాస్గో, న్యూ కేజిల్‌, లివర్‌పూల్‌, బెల్‌ఫాస్ట్‌, లీడ్స్‌, బ్రాడ్‌ఫోర్డ్‌, బ్రిస్టల్‌, ఇతర కేంద్రాల్లో వేలాదిమంది ప్రదర్శనలు నిర్వహించారు. ' తక్షణమే కాల్పుల విరమణ' పాటించాలని నిరసనకారులు ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు. లండన్‌లోని పార్లమెంట్‌ స్క్వేర్‌లో జరిగిన ర్యాలీలో లేబర్‌ పార్టీ మాజీ నేత జెర్మీ కార్బిన్‌ మాట్లాడుతూ, కాల్పుల విరమణ తక్షణమే జరగాలంటూ ప్రపంచంలో అత్యధిక దేశాలు ఐక్యరాజ్య సమితిలో ముక్త కంఠంతో డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తీర్మానంపై ఓటింగ్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం గైర్హాజరు కావడం దేశ ప్రజలను ఎంతగానో బాధిస్తోందని చెప్పారు. తమ ఇళ్లలోకి దూసుకువస్తున్న ఆయుధాల దాడిలో అభం శుభం తెలియని వేలాదిమంది చిన్నారులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్‌ జూయిస్‌ అలయన్స్‌కి చెందిన నావోమి గ్రీన్‌బర్గ్‌ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అమ్మిన ఆయుధాలను ఉపయోగించి ఇజ్రాయిల్‌ మారణకాండకు పాల్పడడం విచారకరమని వ్యాఖ్యానించారు. గాజాలో ప్రజల దిగ్బంధనానికి తక్షణమే స్వస్తి పలికి, కాల్పుల విరమణ జరగాలన్నదే తమ ఏకైక డిమాండ్‌ అని ఆయన స్పష్టం చేశారు.
         పాలస్తీనియన్‌-బ్రిటీష్‌ జాతీయురాలైన బాస్మా తన భర్త, ఇద్దరు పిల్లలతో ఈ ప్రదర్శనలో పాల్గొంది. ఆమె తండ్రి, ముగ్గురు సోదరులు గాజాలో వున్నారు. వారు రోజూ పడుతున్న ఇబ్బందులను ఫోన్‌ ద్వారా ఆమె తెలుసుకుంటున్నారు. పాలస్తీనియన్లకు మాంచెస్టర్‌లో బలమైన సంఘీభావం నెలకొందని చెప్పారు. పాలస్తీనియన్ల వాణి ఎక్కడా వినిపించకుండా సెన్సార్‌ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్‌ మీడియాలో కూడా పాలస్తీనా వాణి సెన్సార్‌కు గురవుతోందన్నారు. ప్రధాన స్రవంతిలోని మీడియా వార్తలకు వాస్తవంగా జరుగుతున్న దానికి చాలా తేడా వుంటోందన్నారు. పాలస్తీనాకు ఎవరు మద్దతు ప్రకటించినా వారిని మొత్తంగా పక్కకు నెట్టేస్తున్నారని అన్నారు.
         పాలస్తీనా సాలిడారిటీ క్యాంపెయిన్‌ (పిఎస్‌సి) డైరెక్టర్‌ బెన్‌ జమాల్‌ మాట్లాడుతూ, పరిస్థితులు మరింత దారుణంగా దిగజారకుండా వుండాలంటే ముందుగా జరగాల్సింది కాల్పుల విరమణ అని స్పష్టం చేశారు.
టోరీ మంత్రి మిషెల్లె డాన్‌లాన్‌ మాట్లాడుతూ, గాజాలోకి మరింతగా మానవతా సాయం వెళ్లేందుకు వీలుగా, అక్కడున్నవారు ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లేందుకు అనుమతించేలా హింసకు విరామం ఇవ్వాలని బ్రిటన్‌ ప్రభుత్వం కోరుతోందని చెప్పారు.
 

                                                           ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో...

ప్రపంచవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. పారిస్‌లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై నిషేధం వుంది. దాన్ని ఉల్లంఘించి ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు వందలాదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రదర్శకులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మార్షలె, స్ట్రాస్‌బర్గ్‌ల్లో కూడా నిరసనలు జరిగాయి. న్యూయార్క్‌లో బ్రూక్లిన్‌ బ్రిడ్జిపై ఆందోళనకారులు నల్లని టీ షర్ట్‌లతో ప్రదర్శన నిర్వహించారు. తక్షణ కాల్పుల విరమణను యూదులు కోరుతున్నారంటూ నినదించారు.