Jan 28,2023 13:22

భీమవరం (పశ్చిమ గోదావరి) : నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించి ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి శనివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ దాళ్వా సాగుకు నీటి ఎద్దడి రాకుండా రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల నుండి దాళ్వా సాగుకు నీటి ఎద్దడి సమస్య తలెత్తుతుందని వార్తలు వస్తున్నాయన్నారు. నీరు అందకపోవడం, పంట ఎండిపోవడం వంటివి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. తక్షణం జిల్లా యంత్రాంగం, నీటి పారుదల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎద్దడి రాకుండా, రైతులు ఇబ్బందులకు గురి కాకుండా, పంట నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీటి సలహా మండలి సమావేశంలో దాళ్వా సాగుకు ఎలాంటి నీటి ఎద్దడి సమస్య ఉండదని అధికారులు చెప్పినప్పటికీ దాళ్వా పంట ప్రారంభ సమయంలోనే నీటి ఎద్దడి రావడం దారుణమన్నారు. పైగా క్రమంగా ఎండలు పెరుగడం, వేసవి రావడంతో సమస్య మరింత జఠిలమయ్యేలా ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ ఎకరాకు సాగు నీటిని అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పంట ఎండిపోయినా, నష్టపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. లస్కర్లకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ కొనసాగించాలి - సిపిఎం
ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్‌ చేశారు. రద్దు చేసిన సబ్సిడీని పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలన్నారు.

ధాన్యం బకాయిలను తక్షణం చెల్లించాలి - సిపిఎం
ఇప్పటికీ జిల్లాలో చాల మంది రైతులకు ధాన్యం బకాయిలు రాలేదన్నారు. బకాయిలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి, ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన కోరారు.