Oct 14,2023 07:07

ఇజ్రాయిల్‌ ఇంత పెద్దయెత్తున నాశనం, విధ్వంసానికి తెగబడుతుండడం వల్ల అది పాలస్తీనా ప్రజలు మరోసారి ప్రతిఘటించడానికే దారి తీస్తుంది. గత ఏడు దశాబ్దాలుగా తమ విముక్తి కోసం పాలస్తీనియన్లు సాగిస్తున్న పోరాటాన్ని వారెన్నడూ విడనాడరు. ఇజ్రాయిల్‌కు ప్రధాన వెన్నెముక అయిన అమెరికా రంగంలోకి దిగింది. మారణాయుధాలను, మందుగుండును ఇజ్రాయిల్‌కు అందచేస్తామని హామీ ఇచ్చింది. ఆ మారణాయుధాలను పాలస్తీనియన్లను ఊచకోత కోయడానికే ఉపయోగిస్తారు. రెండు దేశాల ఏర్పాటు ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని పైపై మాటలు చెబుతున్నప్పటికీ... పాలస్తీనియన్లపై అణచివేతను నివారించడానికి ఇన్నేళ్ళలో అమెరికా, దాని మిత్రపక్షాలు చేసిందేమీ లేదు.

         దక్షిణ ఇజ్రాయిల్‌పై హమాస్‌ విస్మయ పరిచే రీతిలో దాడులు జరపడం, దానికి ప్రతిగా ఇజ్రాయిల్‌ గాజాలో క్రూరమైన బాంబు దాడులకు దిగడంతో...ఇజ్రాయిల్‌ ఆక్రమణ, పాలస్తీనా ప్రజల ప్రతిఘటన చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ సంపాదకీయం రాస్తున్న సమయానికి (ఘర్షణలు ప్రారంభమై నాలుగు రోజులు గడిచిన తర్వాత) 1200 మంది ఇజ్రాయిలీలు మరణించారు (వారిలో 155 మంది సైనికులు), 2700 మంది గాయపడ్డారు. పాలస్తీనా వైపు చూసినట్లైతే, ఇప్పటివరకు గాజాపై ఇజ్రాయిల్‌ బాంబు దాడుల్లో 1055 మంది మరణించారు, 5,128 మంది గాయపడ్డారు. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో 17 మంది పాలస్తీనియనున్ల మరణించగా 80 మంది గాయపడ్డారు.
        ఇజ్రాయిల్‌లో హమాస్‌ దాడుల కారణంగా మహిళలు, చిన్నారులతో సహా పౌరులు ప్రాణాలు కోల్పోవడం, గాజాలో కూడా ప్రజల మరణాలు పెరగడం, అందులోనూ మహిళలు, పిల్లలు మృతి చెందడం కచ్చితంగా గట్టిగా ఖండించాల్సిన విషయం.
        అదే సమయంలో, అంతర్జాతీయ కార్పొరేట్‌ మీడి యా, పశ్చిమ దేశాల పాలక వర్గాలు అందిస్తున్న వర్ణనలతో కూడిన కథనాలను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా ఇజ్రాయిల్‌ ఆక్రమణల గురించి అస్సలు ప్రస్తావించకుండా ఇజ్రాయిల్‌పై దారుణమైన తీవ్రవాద దాడి జరిగిందంటూ పేర్కొనడాన్ని వ్యతిరేకించాల్సి వుంది.
        దశాబ్దాల తరబడి ఇజ్రాయిల్‌ ఆక్రమణలు, పాలస్తీనా ప్రజలను లొంగదీసుకోవడం నేపథ్యంలో హమాస్‌ దాడిని చూడాలి. 1967 యుద్ధం జరిగినప్పటి నుండి ఇజ్రాయిల్‌ సాయుధ బలగాలు వెస్ట్‌ బ్యాంక్‌, గాజాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. గత 56 ఏళ్ళుగా తమ ఆక్రమణలోనే అట్టిపెట్టుకున్నాయి. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి తీర్మానాల మేరకు, ఇవన్నీ ఆక్రమిత ప్రాంతాలు. ఇన్నేళ్ళలో వెస్ట్‌ బ్యాంక్‌లో అక్రమంగా యూదు ఆవాసాలను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ అడ్డంకుల పేరుతో ఈ ప్రాంతాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టారు. ఇజ్రాయిల్‌ నుండి వెస్ట్‌ బ్యాంక్‌ను వేరు చేస్తూ పెద్ద గోడ నిర్మించారు. వర్ణ వివక్ష వ్యవస్థను అమలు చేశారు. 2022లో బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలో మితవాద ప్రభుత్వం ఏర్పడడంతో పాలస్తీనియన్ల అణచివేత మరింత ఉధృతమైంది. సెటిలర్ల మూకలు, మితవాద ముఠాలు పాలస్తీనియన్లను వారి ఇళ్ల నుండి గెంటివేయడం, గ్రామాల నుండి పారద్రోలడం, ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేకుండా చంపేస్తూ పాలస్తీనియన్ల జీవితాలను ఈ అతి జాతీయవాద ప్రభుత్వం దుర్భరం చేసింది. ఘర్షణలకు ముందు ఈ ఒక్క ఏడాదిలోనే ఇజ్రాయిల్‌ భద్రతా బలగాలు, సెటిలర్ల చేతుల్లో 248మంది పాలస్తీనియన్లు మరణించారు. అంటే సగటున రోజుకో పాలస్తీనియుడు చనిపోయాడన్న మాట. జెరూసలెంలో, పాలస్తీనియన్ల కుటుంబాలను బలవంతంగా తరలించారు. వారి ఇళ్ళను ఆక్రమించుకున్నారు. తూర్పు జెరూసలెంలో జాతి ప్రక్షాళన క్రమం కొనసాగుతోంది. ముస్లిం ప్రపంచానికి మూడో అతి పవిత్ర ప్రదేశమైన అల్‌ అక్సా మసీదు ఆవరణలో తీవ్రవాదులైన యూదు అల్లరి మూకలు, భద్రతా బలగాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. మసీదు లోకి ప్రవేశించి, అక్కడ ప్రార్ధనలు చేసుకుంటున్న వారిని చితకబాదారు.
          గాజా స్ట్రిప్‌కు సంబంధించినంత వరకు చూసినట్లైతే, 2007లో ఇజ్రాయిల్‌ తమ సైనిక బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత, గాజా ప్రాంతం మొత్తంగా ఆంక్షలను విధించింది. ఈ గాజా ప్రాంతంలో దాదాపు 23 లక్షల మంది జీవిస్తున్నారు. గత 16 ఏళ్ళుగా, గాజా ప్రాంతం దయా దాక్షిణ్యాలు లేని ఆంక్షలను, దిగ్బంధనాలను ఎదుర్కొంటోంది. ఒక రకంగా బహిరంగ జైలుగా మారింది. ఇదే కాలంలో, ఆంక్షలను, దిగ్బంధనాలను ప్రతిఘటించే ప్రయత్నాలు జరిగినపుడు వైమానిక బాంబు దాడులతో విరుచుకుపడిన సందర్భాలు వున్నాయి. ఈ నరకాన్ని అనుభవిస్తూ వచ్చిన హమాస్‌ అందరినీ సమీకరిస్తూ, సంఘటితపరుస్తూ అనూహ్యమైన రీతిలో తాజా దాడికి దిగింది. దీంతో ఎంతగానో గొప్పగా చెప్పుకునే ఇజ్రాయిల్‌ ఇంటెలిజెన్స్‌, మిలటరీ విభాగాలను విస్మయానికి గురిచేసింది. తమకు తాము అజేయమనుకునే ఇజ్రాయిల్‌ రక్షణ బలగాల ఆలోచనలు చెల్లా చెదురయ్యాయి. ఈ దాడులకు ప్రతీకారంగా, నెతన్యాహు, ఆయన సహచరులు గాజాపై మొత్తంగా యుద్ధానికి దిగాలని నిర్ణయించారు. నెతన్యాహు మాటల్లో చెప్పాలంటే 'గాజాలో వాస్తవికతలను మార్చాలి'. ఇంధనం, ఆహారం, విద్యుత్‌ సరఫరాలు ఆపివేసి గాజాను మొత్తంగా దిగ్బంధించాల్సిందిగా ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి గలాంట్‌ ఆదేశించారు. గాజాలో 'మానవ మృగాల'పై పోరాటం జరపాల్సిందిగా పిలుపిచ్చారు. నాలుగు రోజుల పాటు జరిగిన వైమానిక బాంబు దాడుల్లో దాదాపు 900 మంది మరణించారు. వీరిలో మహిళలు, పిల్లలు వున్నారు. వేలాదిమంది గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ లేదు. నీరు, ఆహారం లేదు.
            ఈ దిగ్బంధనాన్ని సామూహిక శిక్షగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్‌ వ్యాఖ్యానించారు. ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధం నేరమేనన్నారు. గాజాతో గల సరిహద్దుల్లో ఇజ్రాయిల్‌ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించింది. భూతల దాడి తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక జరగబోయేది వేలాదిమంది ఊచకోతే. ఇజ్రాయిల్‌ ఇంత పెద్దయెత్తున నాశనం, విధ్వంసానికి తెగబడుతుండడం వల్ల అది, పాలస్తీనా ప్రజలు మరోసారి ప్రతిఘటించడానికే దారి తీస్తుంది. గత ఏడు దశాబ్దాలుగా తమ విముక్తి కోసం పాలస్తీనియన్లు సాగిస్తున్న పోరాటాన్ని వారెన్నడూ విడనాడరు. ఇజ్రాయిల్‌కు ప్రధాన వెన్నెముక అయిన అమెరికా రంగంలోకి దిగింది. మారణాయుధాలను, మందుగుండును ఇజ్రాయిల్‌కు అందచేస్తామని హామీ ఇచ్చింది. ఆ మారణాయుధాలను పాలస్తీనియన్లను ఊచకోత కోయడానికే ఉపయోగిస్తారు.
      రెండు దేశాల ఏర్పాటు ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని పైపై మాటలు చెబుతున్నప్పటికీ... పాలస్తీనియన్లపై అణచివేతను నివారించడానికి ఇన్నేళ్ళలో అమెరికా, దాని మిత్రపక్షాలు చేసిందేమీ లేదు.
        ప్రస్తుత ఘర్షణల్లో, అమెరికా వైఖరినే నరేంద్ర మోడీ కూడా పునరుద్ఘాటించారు. తీవ్రవాద దాడులను ఖండించారు. ఇజ్రాయిల్‌కు పూర్తి బాసటగా వుంటామని ప్రకటించారు. అంతే తప్ప పాలస్తీనియన్ల ప్రయోజనాలకు మద్దతుగా గానీ రెండు దేశాల ఏర్పాటు పరిష్కారం గురించి కానీ ఎలాంటి ప్రస్తావన లేదు. పాలస్తీనియన్ల భూములు ఆక్రమణలో కొనసాగుతున్నంత కాలమూ, పాలస్తీనియన్లు అణచివేతకు గురవుతున్నంత కాలమూ ఇజ్రాయిల్‌, పశ్చిమాసియాకు శాశ్వత శాంతి వుండబోదు.
       గాంధీజీ నేతృత్వంలో జాతీయోద్యమ కాలం నుండి, భారత్‌ ఎల్లప్పుడూ పాలస్తీనియన్లకు అండగా, బాసటగానే నిలబడుతూ వచ్చింది. ఈ ప్రతినను మరోసారి పునరుద్ఘాటించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది.

( 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)