Oct 18,2023 07:09

స్తూరిబా గాంధీ పాఠశాల వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2004-2005లో ప్రారంభించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 352 కసూర్తిబా పాఠశాలలు పనిచేస్తున్నాయి. టీచింగ్‌ సిబ్బందిలో ప్రిన్సిపాల్‌, సిఆర్టి, పిజిటి (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌), సిఆర్టి (ఉర్దూ), పిఈటి ఐదు కేడర్లు పనిచేస్తున్నారు. ప్రిన్సిపల్‌ కు రూ.27,755, సిఆర్టిలు, పిఈటి లకు రూ.21,755, పిజిటి లకు రూ.12,000 చెల్లిస్తున్నారు. ఈ వేతనాలు 2017-18 సంవత్సరం నుండి చెల్లిస్తున్నారు. వీరందరికీ మినిమమ్‌ టైమ్‌ స్కేలు (ఎంటిఎస్‌), కనీస వేతనాలు అమలు చేయాలని, రెగ్యులరైజ్‌ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఈ కాలమంతా అనేక పోరాటాలు, ప్రాతినిధ్యాలు జరిగాయి. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఈ పోరాటాలు, ప్రాతినిధ్యాల న్నింట్లోనూ పాల్గొన్నారు. ఎస్‌పిడి కార్యాలయాలు ముట్టడి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఇటీవల చర్చల సందర్భంగా మినిమమ్‌ టైమ్‌ స్కేలు వర్తింప చేయాలని, రెగ్యులరైజ్‌ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు నాయకత్వం, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు పట్టు పట్టినా బడ్జెట్‌ సరిపోదనే సాకుతో 23 శాతం వేతనాల పెంపుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ మేరకు ప్రభుత్వం 15.03.2023న ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుత ఈ ఐదు కేడర్లకు గౌరవ భృతిని 23 శాతం పెంపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పిజిటిలకు కూడా ఆ మేరకు రూ.26,759 పెంచుతూ ఉతర్వులలో పేర్కొన్నారు. ఇంతవరకు రూ.12,000 తీసుకుంటున్న పిజిటిలు ఈ మేరకైనా పెరిగిందని ఊరట చెందారు.
             ఇక్కడే అధికారులు, విద్యా మంత్రి మెలిక పెట్టారు. వారు ఇచ్చిన జీవోకే వింత వ్యాఖ్యానం చేస్తున్నారు. దాంతో పిజిటి లు మళ్ళీ మోసపోయామని ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్లో, ఉత్తర్వులలో పిజిటిలుగా పేర్కొంటూ, పార్ట్‌ టైం పిజిటిీలు అని కూడా అంటున్నారు. జీవో ఎంఎస్‌ నెం-28 లోనూ, స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ మెమోలలోనూ పిజిటి అని పేర్కొంటూ రూ.26,759 గౌరవ భృతి పెంచినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో గత నెల రూ.26,759 జమ చేశారు. ఇది పిజిటి లకు వర్తించదని, రికవరీ చేయాలని మెలిక పెట్టారు. దీనితో కడుపు మండిన కస్తూరిబా పిజిటి లు, సిఐటియు, పిడిఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యాశాఖా మంత్రి, ముఖ్య కార్యదర్శి, ఎస్‌పిడి లను ఇటీవల (అక్టోబర్‌ 12) కలిసి మాట్లాడారు. జీవో ఎంఎస్‌ నెం-28 (15.3.2023) నాటికి పొజిషన్లో ఉన్న క్యాడర్లలో పిజిటి లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని జీవో చదివిన ఎవరికైనా అర్థం అవుతుంది. కానీ చర్చలలో విద్యాశాఖా మంత్రి, అధికారులు ఇప్పటికే పనిచేస్తున్న పిజిటి లకు ఈ పెంపుదల వర్తించదంటే ఆ జీవోలో అప్పటికే ఉద్యోగం చేస్తున్న పిజిటి లు ఎవరో సమాధానం చెప్పాల్సి వుంటుంది. 2023 మే నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చి జులై నెలలో జాయిన్‌ అయిన కొత్త పిజిటి లకు మాత్రమే రూ.26,759 వర్తిస్తుందని వింత భాష్యం చెబుతున్నారు.
            గత ఐదేళ్ల నుండి పని చేస్తూ జీతాలు పెంచాలని పోరాడుతున్న వారికి రూ.12,000 మాత్రమే చెల్లిస్తారట. ఇదే పిజిటి పోస్టుకు 2023 మే నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చి జులై నెలలో కొత్తగా జాయిన్‌ అయిన వారికి నూతన వేతనాలు చెల్లిస్తారట. ఇదేమి న్యాయం? జీవోలో పిజిటి లు అని పేర్కొని మాటల్లో పార్ట్‌ టైం పిజిటి అని చెప్పి ఎంతో కొంత పెంచుతామని విద్యా శాఖా మంత్రి చెప్పడం ఏం న్యాయం అని ప్రశ్నించాము. రాష్ట్ర నోటిఫికేషన్‌ ద్వారా పరీక్ష పెట్టి, డెమో నిర్వహించి, మెరిట్‌ రోస్టర్‌ ఆధారంగా చేసిన నియామకాలకు మళ్లీ ఈ అధికారులే, మంత్రులే అధికారం మారితే అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. ఇది కెజిబివి టీచర్ల తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించాము. సమాన క్యాడర్లకు చెల్లించే దానికి భిన్నంగా రూ.12000 లకు అంతో ఇంతో పెంచి చెల్లిస్తామని చెప్పడం సహజ న్యాయం, సమాన వేతనం సూత్రానికి విరుద్ధం. ఈ విషయాలన్నిటినీ చర్చల సందర్భంగా విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఎస్‌పిడి లకు తెలియజేశాం. పిజిటి లకు రూ.26759 చెల్లించాలని విజ్ఞప్తి చేశాం. అమలు పరచాల్సిన విజ్ఞత వారిదే.

/వ్యాసకర్త శాసనమండలి సభ్యులు /
ఐ. వెంకటేశ్వర రావు

venkateswarrao