మనం భూమిపై అయస్కాంత తుపానులు, అరోరా తరంగాల గురించి వినే ఉంటాం. అవి భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే కక్ష్యల్లో ముఖ్యంగా ధృవ ప్రాంతాల్లో ఏర్పడతాయి. సౌర వ్యవస్థలో గ్రహాలన్నింటినీ అయస్కాంత క్షేత్రాలు ఆవరించి ఉంటాయి. మిగిలిన గ్రహాల కంటే భూమి బలమైన అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంది. దీని నుండి శక్తి విడుదలై, సంఘర్షణ చెందేటప్పుడు భూ అయస్కాంత తుపానులు, అరోరా కాంతి రేఖలు సంభవిస్తాయి. అలాగే సూర్యుని ఉపరితలంపై (కరోనా) కూడా సౌర తుపానులు, అరోరాలు ఏర్పడతాయి. అవి భూమిని చేరకుండా భూ అయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది. కానీ 2025లో ఏర్పడే సౌర తుపాను వల్ల భూమిపై నష్టం వాటిల్లనుందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అలా ఎందుకు..? ఏమి జరిగే అవకాశం ఉంది..? తదితర వివరాలు తెలుసుకుందాం.
సూర్యుడు నిరంతరం మండుతూ వుండే అగ్నిగోళం. ఆ మంటలు కొన్నిసార్లు నిద్రాణంగా వుంటే, మరి కొన్నిసార్లు ఉధతంగా కెరటాలలా ఎగసిపడ్తాయి. వీటిని సన్‌స్పాట్స్ అని పిలుస్తారు. వాటి తీవ్రతను బట్టి సోలార్ మినిమమ్, సోలార్ మ్యాగ్జిమమ్ దశలుగా పేర్కొంటారు. సాధారణంగా ఈ దశలు రెండూ ఒకదాని తర్వాత ఒకటి పదకొండేళ్ళకు ఒకసారి ఏర్పడతాయి. ఈసారి సూర్యుడు 16 ఏళ్లు దాటినా సోలార్ మినిమమ్ దశలోనే కొనసాగుతున్నాడు. సూర్యుడు ఒక్కసారిగా మ్యాగ్జిమమ్ దశలోకి ప్రవేశిస్తే జరిగే పరిణామం ఏమిటి..? భూమి, ఇతర గ్రహాలపై ఎలా వుంటుందనేదని శాస్త్రజ్ఞుల ఆందోళన. ఈ పరిస్థితిని హార్వర్డ్ స్మిత్సోనియన్ ఆస్ట్రోఫిజిక్స్ సెంటర్ పరిశోధకుడు లియోన్ గ్లౌబ్ వెల్లడించారు.
మొరెటన్ వేవ్ ..
మొరెటన్ వేవ్.. సౌర తుపాను రెండూ ఒకటే. సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సన్‌స్పాట్స్ తీవ్రత వల్ల ఈ తరంగాలు మబ్బులా ఏర్పడి, సూర్యుడి ఉపరితలాన్ని (కరోనా) విచ్ఛేదనం చేస్తాయి. అప్పుడు అయస్కాంత విస్ఫోటనం ఏర్పడుతుంది. అదే సౌర తుపాను. అది భూమిని తాకడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ తుపాను విపరీతమైన ఆకర్షణ శక్తితో అంతరిక్షంలో కొన్ని కోట్ల మైళ్ళ దూరం ప్రయాణించి, భూమికి చేరబోతోందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీని సాంకేతిక నామం ఫాస్ట్ మోడ్ మాగెటో హైడ్రోడైనమికల్ వేవ్. సంక్షిప్తంగా ఎం.హెచ్.డి. తరంగం.
కారింగ్టన్ ఈవెంట్..
కారింగ్టన్ ఈవెంట్ చారిత్రాత్మకం. అదే 1859లో వచ్చిన అతిపెద్ద సౌర తుపాను. శక్తిమంతమైన విద్యుత్ తరంగాలు ఉత్తర అర్ధగోళం నుండి క్యూబా, హవాయి, కొలంబియా వంటి దక్షిణ ప్రాంతాల వరకూ వ్యాపించి, బలమైన అరోరల్ డిస్‌ప్లేలను సష్టించింది. అతి శక్తిమంతమైన థర్మోన్యూక్లియర్ తరంగాలు వెలువడి, టెలిగ్రాఫ్ స్టేషన్స్‌లో మంటలు చెలరేగాయి. దీనిని బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్తలు రిచర్డ్ సి. కారింగ్‌టన్, రిచర్డ్ హోడ్గ్సన్ రికార్డ్ చేశారు. అందుకే ఈ తుపానుకు ఆ పేరు వచ్చింది.
సౌర తుపాను.. అరోరా కాంతులు..
అయితే 1997 మేలో వచ్చిన సౌర తుపాను కేవలం పచ్చని, ఎర్రని మేఘాలను పోలి ఉంది. ఇది రంగురంగుల కాంతులు వెదజల్లి, కనువిందు చేసింది. సౌర తుపాను 2010, ఆగస్టు 3న కూడా రష్యా, అమెరికా, న్యూజిల్యాండ్ లాంటి దేశాల్లో అలాంటి వర్ణచిత్రాల అరోరాలే ఏర్పడి, కనువిందు చేశాయి.
హెచ్చరిక..
రాబోతున్న తుపాను మాత్రం భయంకరమైన ఫలితాలనిస్తుందని మాత్రం నాసా హెచ్చరిస్తోంది. సరిగ్గా భూమికి ఎదురుగా 'సన్ స్పాట్ 1092' ఏర్పడింది. దీని నుండి విద్యుదావేశిత కణాలు మేఘంలా ఏర్పడి, భూమి మీదకు బయల్దేరాయి. ఈ తుపాను ప్రభావంతో భూమిపై భారీ విధ్వంసం కలుగుతుందనేది పరిశోధకుల అంచనా. దీని తీవ్రతకు అంతరిక్షం నుంచి వచ్చే అనేక ఉపగ్రహాలు క్రాష్ అయి భూమిపై పడనున్నాయని నాసా అంచనా వేసింది.