రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో సుమారుగా 15 లక్షల ఎకరాలలో రైతులు వరి పంట సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పంట పండించడానికేగాక, ఆ పంటను అమ్ముకోవడానికి కూడా రైతు కష్టపడాల్సి వస్తోంది. పంట పండించడానికే కాక, అమ్ముకోవడానికి కూడా రైతు పెట్టుబడి పెట్టవలసి వస్తోంది.
ధాన్యం కొనుగోలు నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశామని ప్రభుత్వం చెబుతోంది. కల్లాల నుండే ధాన్యాన్ని సేకరిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారెందుకు? దీనికి ప్రభుత్వం నుండి సమాధానం లేదు. కల్లాల నుండి ధాన్యం కొనుగోలు జరగడం లేదు. ఆ విధంగా జరిగితే నాణ్యతా ప్రమాణాల పేరుతో రైతుల నుండి మిల్లర్లు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు ?
రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్ళనవసరం లేదని ముఖ్యమంత్రి, పౌర సరఫరాల మంత్రి చెబుతున్నారు. ధాన్యం రైస్ మిల్లుకు చేరిన తర్వాత రైతు భరోసా కేంద్రం అధికారి రైతుకు ఫోన్ చేసి మీ ధాన్యం ఫలానా మిల్లు దగ్గర ఉంది. ఆ మిల్లు యజమానితో మాట్లాడుకోమని చెబుతారు. తేమ శాతం, నూక శాతం ఎక్కువ ఉందని, బరువు తక్కువ ఉందని డబ్బులు చెల్లిస్తే గానీ ధాన్యాన్ని అన్‌లోడ్ చేయమని మిల్లర్లు చెప్పడంతో అనివార్యంగా రైతులు డబ్బులు కట్టాల్సి వస్తోంది. లారీ మిల్లుకు చేరే నాటికి కొంత డీజిల్ ఖర్చు అవుతుంది. ఈ తగ్గిన డీజిల్ మేరకు మిల్లు దగ్గర తూకంలో కొంత బరువు తగ్గుతుంది. ఆ పేరుతో కూడా రైతులను మోసగిస్తున్నారు. ఏ రైతైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిందే. ఒకసారి మిల్లుకు చేరిన ధాన్యం మరలా ఆన్‌లైన్ కావడానికి వారం, పది రోజులు పడుతుంది. చేసేదిలేక గొడవ పడలేక మిల్లర్లకు రైతులు డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రైతుకు మద్దతు ధర చెల్లించామని గొప్పగా చెబుతోంది. రైతు భరోసా కేంద్రం వద్ద తేమ శాతం, నూక శాతం నిర్ణయిస్తున్నారు. ఆర్.బి.కె లకు కేటాయించిన వే బ్రిడ్జి కాటాల దగ్గర తూకం వేసి రైతులకు ట్రక్ షీట్లు ఇస్తున్నారు. ట్రక్ షీట్ ఇచ్చిన తర్వాత రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి అప్పగించినట్లే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం రైస్ మిల్లు దగ్గరకు చేరిన తర్వాత రైతుకు ఎటువంటి సంబంధం లేదు. మరి ఆచరణలో ప్రభుత్వ అధికారులు ఈ నిబంధన ఎందుకు అమలు చేయడం లేదు. కల్లాల దగ్గరే ధాన్యం నాణ్యతా ప్రమాణాలు చూసుకోవాలి తప్ప మిల్లుకు చేరిన తర్వాత ఇబ్బందులకు గురిచేయడం తగదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆర్.బి.కె లు, రైస్ మిల్లుల దగ్గర ఉన్న తేమ శాతం లెక్కింపు మిషన్లు ఒకేరకమైనవి కావు. ఈ తేడాలు రాకుండా ఆర్‌బికె నిర్ణయించిన తేమ శాతం, నూక శాతం, వే బ్రిడ్జి తూకం ఆధారంగానే మిల్లుల దగ్గర ధాన్యాన్ని అన్‌లోడ్ చేసుకోవాలి.
గన్నీ బ్యాగులు, లోడింగ్, రవాణా (జి.ఎల్.టి) పేరుతో రూ.250 రైతుకు లబ్ధి చేకూరుస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్న దాంట్లో పూర్తి వాస్తవం లేదు. గోనె సంచులు రైస్ మిల్లర్లు రైతు భరోసా కేంద్రాలకు అందిస్తున్నారు. ప్రభుత్వం తమకు ఎటువంటి అద్దె చెల్లించడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. రైతులకు ఇస్తున్న గోనె సంచులలో దాదాపు 30 శాతం చినిగినవే. వాటిని మరమ్మతులు కూడా చేయడం లేదు. చినిగిన గోనె సంచులలో పట్టిన ధాన్యం నేలపాలై రైతులు నష్టపోతున్నారు. క్వింటాకు హమాలీ చార్జీ రూ.25 ఇస్తున్నారు. ధాన్యం సొమ్ముతో రైతుల ఖాతాలకు జమ చేస్తామని చెబుతున్నా ఆచరణలో పూర్తిగా రైతులకు చేరడం లేదు. రవాణాకు సంబంధించి క్వింటాకు రూ.50 లోపు ఖర్చవుతుంది. ఏ విధంగా చూసినా క్వింటాకు రూ.100 లోపే జిఎల్‌టి రూపంలో రైతుకు అందుతోంది. జిఎల్‌టి పేరుతో రూ.150 ఎవరికి చేరుతున్నాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ధాన్యం కల్లాల దగ్గరకు చేరిన తర్వాత కొనుగోలు కేంద్రాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గోనెసంచులు అందుబాటులో ఉండవు. సంచులు ఇచ్చినా రవాణాకు లారీలు ఏర్పాటు చేయరు. వర్షాలు పడి ధాన్యం తడిచిపోతే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సామూహిక కల్లాలు లేక రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆ ధాన్యాన్ని కాపాడుకోవడానికి రాత్రింబవళ్లు కాపలా కాయాల్సి వస్తోంది. సరైన టార్పాలిన్లు రైతుకు అందుబాటులో లేవు. ఎరువుల సంచులతో కుట్టిన బరకాలనే వాడుతున్నారు. రైతు ధాన్యం అమ్మిన 21 రోజులలో నగదు బ్యాంకులలో జమ చేస్తామని చెప్తున్నా ఆచరణలో నెల దాటిపోతుంది. ధాన్యం మిల్లుకు చేరి అన్‌లోడ్ అయిన తర్వాత వెంటనే ఆన్‌లైన్ కావడం లేదు. ఫలితంగా నగదు చెల్లించడం ఆలస్యం అవుతోంది. నవంబర్, డిసెంబర్ నెలలు తుఫాన్ల కాలం కావడంతో కొనుగోలు నిబంధన ప్రకారం ధాన్యం 17 శాతం తేమ వచ్చే వరకు ఆరబెట్టడానికి రైతు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. తేమ శాతం నిబంధనలు సడలించాలి. ధాన్యం అమ్మకాల సందర్భంగా కౌలు రైతులు మరింతగా నలిగిపోతున్నారు. 80 శాతం ధాన్యం ఉత్పత్తి కౌలు రైతుల కష్టమే. పంట సాగుదారు హక్కు పత్రాలు ఇవ్వకపోవడంతో ఈ-క్రాప్‌లో భూ యజమానుల పేర్లనే నమోదు చేస్తున్నారు. యజమానుల పేరుతో ధాన్యం కొనుగోలు చేసి వారి బ్యాంక్ ఖాతాలకే నగదు జమ చేస్తున్నారు. కష్టపడి పంట పండించిన కౌలు రైతు పేరుతో ధాన్యం కొనుగోలు చేయకపోవడం అన్యాయం. గతంలో మాదిరిగా గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువపత్రం ఆధారంగా కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగోలు సమస్యలపై రైతులు, రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చించడం లేదు. అధికార పార్టీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వ్యవసాయ సలహా మండలి సభ్యులతో మాత్రమే మాట్లాడుతున్నారు. ఫలితంగా వాస్తవ సమస్యలు ప్రభుత్వం, అధికారుల దృష్టికి వెళ్లడం లేదు.
ఖరీఫ్ సాగుకు ఒక ఎకరాకు సుమారుగా రూ.38,700 వరకు ఖర్చవుతుంది. కౌలు 13 నుండి 16 బస్తాల వరకు చెల్లిస్తున్నారు. ఖరీఫ్‌లో సరాసరి దిగుబడి 26 నుండి 28 క్వింటాళ్లు వస్తోంది. కౌలు రైతుకు గడ్డి కూడా మిగలడం లేదు. కౌలుతో కలుపుకుని సరాసరి పెట్టుబడి రూ.63,255 అవుతోంది. 28 క్వింటాళ్ల దిగుబడి వస్తే రూ.61,124 ఆదాయం వస్తుంది. ఖరీఫ్‌లో నష్టాలు వచ్చినా రబీలో కాస్త మిగులుతుందని, అప్పులు పుడతాయని, పాడి పశువులకు కాస్త గడ్డి దొరుకుతుందని ఆశతో ప్రత్యామ్నాయ ఉపాధి లేక కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. నష్టాలపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతుకు ఏమాత్రం సరిపోవు. వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ధాన్యం క్వింటాల్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సాధారణ రకానికి రూ.2,183 (75 కేజీల బస్తాకు రూ.1637.25 ) ఎ గ్రేడ్‌కు రూ.2,203 (75 కేజీల బస్తాకు రూ.1652.25)గా ఉంది. సిపిఎం నేతృత్వంలోని కేరళ వామపక్ష ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.900 వరకు బోనస్ ఇస్తోంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు. మన రాష్ట్ర బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధి పథకం పేరుతో రూ.3 వేల కోట్లు కేటాయిస్తోంది. ఈ పథకం ద్వారా ధాన్యానికి ఎంతో కొంత బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తేనే రైతు గట్టెక్కే పరిస్థితి ఉంటుంది.
/ వ్యాసకర్త ఎ.పి రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, సెల్:94900 98574 /
కె. శ్రీనివాస్