Jan 28,2023 07:29

        వందే భారత్‌ రైలు 130 కిలోమీటర్ల వేగంతో అత్యంత వేగంగా గమ్యానికి చేరుస్తుందని ఇదొక గొప్ప విజయమని రైల్వేశాఖ ప్రకటించింది. దేశ ప్రధానమంత్రితో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్‌ అందరూ పండగవేళ ఆ రైలు గురించే మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజమైన పండగ వచ్చిందని ప్రధానమంత్రి అభివర్ణించారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేమిటంటే...సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు 905 రూపాయల చార్జీ ఉంది. సాధారణంగా సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో చార్జి 172 రూపాయలే కాగా, అవి గమ్యస్థానానికి ఆరు గంటల్లో చేరుస్తాయి. వందే భారత్‌ రైలుకు సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు నాలుగు గంటల సమయం పడుతోంది. ఇతర రైళ్లకు, వందే భారత్‌కు తేడా కేవలం రెండు గంటలు మాత్రమే. ఆ రెండు గంటల సమయం కోసం అదనంగా 725 రూపాయలు చెల్లించుకోవాలా? వందేభారత్‌లో విమానం తరహాలో సదుపాయాలు ఉన్నాయని ఎంతగా ఊదరగొట్టినప్పటికీ ప్రయాణికుల నుంచి ఆశించిన స్పందన లేదు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు నడిపే సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ అతి ముఖ్యమైనది. దీనిలో ఫస్ట్‌ ఎసి, సెకండ్‌ ఎసి, థర్డ్‌ ఎసి కోచ్‌లు ఉంటాయి. అన్నీ స్లీపర్‌ బెర్తులే. దురంతోలో ఫస్ట్‌ ఎసి టికెట్‌ ధర 2,800 రూపాయలు, సెకండ్‌ ఎ.సి 2,300 రూపాయలు, థర్డ్‌ ఎ.సి 1,630 రూపాయలుగా ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ కూడా గంటకు 130 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు 10 గంటల 10 నిమిషాల వ్యవధిలో చేరుకుంటుంది. ఇక వందే భారత్‌ రైలు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు 3,170 రూపాయలుగా ఉంది. ఇందులో స్లీపర్‌ బెర్తులు ఉండవు. అన్నీ చైర్‌ సీటింగ్‌ మాత్రమే. సికింద్రాబాద్‌ నుంచి 8.30 గంటల ప్రయాణంతో విశాఖకు చేరుకోవచ్చు. దురంతోతో పోల్చుకుంటే గంటా 40 నిమిషాలు ముందుగా వందేభారత్‌లో ప్రయాణించవచ్చు.
            ఇవన్నీ చూసిన తర్వాత సగటు ప్రయాణికుడు వందేభారత్‌ కంటే దురంతో వైపే ఆసక్తి చూపిస్తున్నాడు. గంటన్నర వ్యత్యాసానికి అంత డబ్బు చెల్లించి, అదీ స్లిపర్‌ బెర్తులు లేకుండా చైర్‌లో కూర్చొని వందేభారత్‌లో వెళ్లే కంటే ఇతర సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లలో ప్రయాణించడం మేలని ప్రయాణికులు భావిస్తున్నారు. వందేభారత్‌లో 1,128 సీటింగ్‌కు కాను 1,050 సీట్లు చైర్‌ కార్‌ సదుపాయంతో ఉన్నాయి. మిగిలినవి ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌కు కేటాయించారు. ఎగ్జిక్యూటివ్‌ క్లాసులో ఏకంగా 400 రుపాయలు వరకు చార్జీ చేస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి పది రోజుల ముందు బుక్‌ చేసుకుంటే విమానం టికెట్‌ 3,900 రూపాయలకే లభిస్తుంది. ప్రయాణ సమయం గంట మాత్రమే. అదే వందే భారత్‌ రైలులో ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌కి 3,170 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రయాణ సమయం 8.30 గంటలు. ఇంకో 700 రూపాయలు అదనంగా పెడితే విమానం ఎక్కి ఏకంగా ఏడు గంటల సమయం ఆదా చేసుకోవచ్చు.
          ఈజిప్టు లో గంటకు 230 కిలోమీటర్లు, మొరాకో లో 320 కిలోమీటర్లు, జపాన్‌ లో 374 కిలోమీటర్లు, ఫ్రాన్స్‌లో 357 కిలోమీటర్లు, స్పెయిన్‌లో 400 కిలోమీటర్లు, చైనాలో 420 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైళ్ళను ఉపయోగిస్తుంటే మనం గంటకు 300 కిలోమీటర్ల వేగాన్నైనా ఎప్పటికి చేరుకుంటాం? ఒకవేళ చేరుకుంటే సామాన్యుడు ప్రయాణించగలడా?

- యం.ఎ. జబ్బార్‌
సెల్‌: 9177264832