
బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపుతామంటూ అస్సాం ప్రభుత్వం గత రెండేళ్లలో అలాంటి వివాహం చేసుకున్న వారిని అరెస్టు చేయడం, ఆ కుటుంబాలను రోడ్డునపడేసి, ఆందోళన చేస్తున్న బాధిత మహిళల పట్ల తీవ్ర అణచివేతను ప్రయోగించడం క్షంతవ్యం కాదు. బాల్య వివాహాల సంగతి ఏమో గాని జనబాహుళ్యంపై సర్కారు ఉక్కుపాదం మోపింది. తన కుటుంబ సభ్యుల అరెస్టును జీర్ణించుకోలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా, తను ప్రేమించిన యువకుడితో వివాహం నిలిచిపోయిందని మరో యువతి బలవన్మరణానికి పాల్పడింది.
బాల్య వివాహాలు ఒక సామాజిక రుగ్మత. దానిని పారద్రోలడానికి సరైన మార్గంలో వెళ్లాలి. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది బాల్య వివాహ బాధిత యువతులున్నారు. వారిలో మూడోవంతు 15 ఏళ్లలోపు వివాహమైన వారే. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం మనదేశంలో 15 లక్షల మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహం జరుగుతోంది. 2019-21 సంవత్సరానికి సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం మనదేశంలోని 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వివాహిత మహిళల్లో 23.3 శాతం మందికి 18 ఏళ్లలోపే పెళ్లయింది. బాల్య వివాహాలు 2005-06లో 47.4 శాతం ఉంటే, 2015-16 నాటికి 26.8 శాతానికి తగ్గాయి. 2020-21 నాటికి మరో 3.5 శాతం తగ్గి 23.3 శాతానికి చేరుకుందని అదే సర్వే చెబుతోంది. అతి తక్కువగా 18 ఏళ్లలోపు బాలికలు వివాహం చేసుకున్న రాష్ట్రం కేరళ. తీవ్ర పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, విద్య, సామాజికార్థిక రంగాల్లోనూ వెనుకబాటు, లింగ వివక్ష, ఆరోగ్యం, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం తదితర కారణాల వల్లే నేటికీ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించకుండా కేంద్రం, వివిధ రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు అసహనాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. మైనారిటీలపై ఏదో ఒక రూపంలో సంఘపరివార్ విద్వేష విషాన్ని చిమ్ముతోంది. అందులో భాగమే హేమంత్ బిశ్వశర్మ తీసుకున్న బాల్యవివాహాలపై స్పెషల్ డ్రైవ్. 18 ఏళ్లలోపు బాలికలను వివాహం చేసుకున్న వారందరిపై బాల్యవివాహాల నిరోదక చట్టం 2006 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, 14 ఏళ్లలోపు వయసున్న వారిని పెళ్లి చేసుకున్న వారిపై లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే (పోక్సో) కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని అస్సాం ప్రభుత్వం జనవరి 23న నిర్ణయించింది. ఆ డ్రైవ్‌ను ఈ నెలలో ప్రారంభించి, ఇప్పటివరకూ 4,074 మందిపై కేసులు నమోదు చేసి, 2,500 మందిని అరెస్టు చేశారు. గత ఏడేళ్లుగా అస్సాంలో అధికారంలో ఉన్న కాషాయ సర్కారు ఇన్నాళ్లూ కళ్లుమూసుకుని ఇప్పుడు హడావిడి చేయడం వెనుక కారణాలేమిటి? అనే ప్రశ్నకు వారి నుండి సమాధానమే లేదు.
అస్సాం అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ముస్లిములు, గిరిజనులు అధికంగా ఉన్న మూడు జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల వద్ద బాధిత కుటుంబాల మహిళలు ఆందోళన చేశారు. వారు తమ పిల్లలతోపాటు స్టేషన్ల వద్దకు వచ్చి తమ భర్తలను, తండ్రులను విడిచిపెట్టాలని, లేకపోతే తమకు జీవించే మార్గం లేదని కంటతడిపెట్టుకున్నారు. ఆందోళన చేస్తున్న వారి సమస్యను పరిష్కరించవలసిన సర్కారు... వారిపై కర్కశంగా లాఠీఛార్జి చేసి, అణచివేసే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో 6.2 లక్షల మంది గర్భిణిలలో 17 శాతం మంది 18 ఏళ్లలోపు వారే ఉన్నారు. వీరంతా రహదారులపై చేస్తున్న ఆందోళనలు చూపరులను కంటతడిపెట్టిస్తున్నాయి. ఈ రుగ్మతను రూపుమాపడానికి అభివృద్ధి ఫలాలు సాధారణ ప్రజలకు చేరడమే మార్గం. కార్పొరేట్లకు కాసులన్నీ కట్టబెడుతూ సామాన్యులల్లో అజ్ఞానాన్ని రేకెత్తించి, ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్న కాషాయ ప్రభుత్వాలు ప్రజల్లో చీలిక కోసం సిఎఎ నుంచి నేటి బాల్య వివాహాల వరకూ తురుపుముక్కలుగా వాడుకుంటున్నాయి. ఇప్పటికైనా అరెస్టులను ఆపి, పార్టీలు, మహిళా, స్వచ్ఛంద సంస్థలతో చర్చించి సరైన చర్యలు తీసుకోవాలి. కేరళలో వామపక్ష ప్రభుత్వాలు అభివృద్ధి ఫలాలను సామాన్యులకు అందిస్తూ ప్రజల్లో విద్య, వైద్యంపై సంపూర్ణ అవగాహన కల్పించడంతో, అక్కడ బాల్యవివాహాల ఊసేలేదు. ఇతర రాష్ట్రాల్లోని విద్యాభివృద్ధి, సామాజిక పురోభివృద్ధి గల ప్రాంతాల్లో, జిల్లాల్లోనూ అదే పరిస్థితిని గమనించవచ్చు. కనుక అలాంటి మార్గం అనుసరించడమే ఈ జాడ్యానికి విరుగుడు.