Nov 22,2022 07:29

తమ సంపద పెరిగే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని మూడో ప్రపంచ దేశాలలో ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. అటువంటి అవకాశాలు వారికి కనిపించనప్పుడు వారి కేంద్రం అయిన అమెరికా లోకి వెనక్కి తరలిపోతారు.

కొద్దిమంది ద్రవ్య పెట్టుబడిదారుల, స్పెక్యులేటర్ల దురాశ, వారి ప్రయోజనాలు అత్యధిక మెజారిటీగా ఉండే శ్రామిక ప్రజల జీవన పరిస్థితులను శాసించడం నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానపు ప్రత్యేకత. ఆ కొద్దిమంది స్పెక్యులేటర్లు గనుక ద్రవ్యోల్బణం తాకిడికి గాభరా పడి నిర్ణయాలు తీసుకుంటే అది మూడవ ప్రపంచపు అసంఖ్యాక శ్రామిక ప్రజలకు ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుంది. విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు సమస్య నుండి బైట పడడానికి ఆ మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు అనుసరించే పొదుపు చర్యల ఫలితంగా ఆ శ్రామిక ప్రజానీకమే బలిపశువులౌతారు. నయా ఉదారవాద విధానాలు ఊపుగా అమలు జరిగినప్పుడు వారికి ఏ ప్రయోజనాలూ కలగలేదు. ఇప్పుడు ఆ విధానాలు పతనమౌతున్నప్పుడు సైతం దానికి వారే బలిపశువులు అవుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండు ముఖ్యమైన ధోరణులు మనకు కనిపిిస్తున్నాయి. రాబోయే మార్పులను ఇవి సూచిస్తున్నాయి. వాటిలో ఒకదాని గురించి చర్చ బాగానే జరిగింది. ప్రపంచం అంతటా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోడానికి వడ్డీల రేట్లను దాదాపు అన్ని దేశాల్లోనూ పెంచడం జరుగుతోంది. దీని వలన ఉత్పత్తి మందగిస్తుంది. దానితోబాటు ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయి. ఆ విధంగా ఏమీ జరగబోదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు, పాలకులు చెప్తున్నా, వాస్తవానికి జరుగుతున్నది అదే. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం పేరుతో పెట్టుబడిదారీ వర్గం కార్మికుల ఆదాయాలను, ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తోంది. తమ సంపద విలువ పడిపోకుండా కాపాడుకుంటోంది.
        ఇక రెండో ధోరణి గురించి చర్చ తక్కువగా జరుగుతోంది. తక్కిన ప్రపంచం నుండి అమెరికా వైపు ద్రవ్య పెట్టుబడి ప్రవహిస్తోంది. దాని వలన తక్కిన దేశాల కరెన్సీలతో పోల్చితే అమెరికన్‌ డాలర్‌ బలపడుతోంది. దీనికి ఒక్క రష్యన్‌ రూబుల్‌ మాత్రమే మినహాయింపు. రష్యాపై ఆంక్షలను విధించిన తర్వాత కూడా రూబుల్‌ బలపడడమే ఇక్కడ విచిత్రం. బ్రిటిష్‌ పౌండు, యూరో లతో సహా ప్రధాన కరెన్సీలన్నీ డాలర్‌ తో పోల్చితే బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల కరెన్సీలు, అందునా మన రూపాయి బలహీనపడడం మనకి సంబంధించి ఆందోళన కలిగించే విషయం.
         ఈ 2022 లోనే మన దేశం నుండి 20,000 కోట్ల డాలర్లు తరలిపోయాయని అంచనా. మన మొత్తం విదేశీ మారక నిల్వలలో ఇది మూడో వంతు. రూపాయి విలువ పడిపోకుండా ఉండాలన్న లక్ష్యంతో మన రిజర్వు బ్యాంకు దాదాపు 10,000 కోట్ల డాలర్లను మార్కెట్‌ లోకి విడుదల చేసింది. అయినప్పటికీ మన రూపాయి దాదాపు పది శాతం విలువ కోల్పోయింది.
       తక్కిన దేశాల కన్నా అమెరికా తన వడ్డీ రేట్లను ఎక్కువగా పెంచింది గనుక పెట్టుబడి అమెరికా వైపు పరుగు తీస్తోందని, అందువలన తక్కిన కరెన్సీలతో పోల్చితే డాలర్‌ బలపడిందని కొందరు నమ్ముతున్నారు. అదే పూర్తి వాస్తవం అయితే అమెరికా తో దీటుగా తక్కిన దేశాలు కూడా వడ్డీ రేట్లను పెంచితే. ఆ దేశాలనుండి ద్రవ్య పెట్టుబడులు బైటకు పోవు అని అనుకోవలసి వుంటుంది. వడ్డీ రేట్ల పెంపు లోని హెచ్చుతగ్గులు ద్రవ్య పెట్టుబడి ప్రవాహం మీద ప్రభావం చూపుతాయన్నది కొంతవరకూ వాస్తవమే అయినా, అదే పూర్తి నిజం కాదు. పెట్టుబడిదారుల అంచనాలు వారిలో రేకెెత్తే ఆశలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. తమ సంపద పెరిగే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని మూడో ప్రపంచ దేశాలలో ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. అటువంటి అవకాశాలు వారికి కనిపించనప్పుడు వారి కేంద్రం అయిన అమెరికా లోకి వెనక్కి తరలిపోతారు. ద్రవ్య పెట్టుబడి అంచనాలను ప్రభావితం చేసే ఒక కీలక అంశం అమెరికా లోని వడ్డీ రేట్లు.
          అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయనుకోండి. అప్పుడు మార్కెట్‌లో ద్రవ్యం చాలా చవకగా, తక్కువ వడ్డీకే కావలసినంత అందుబాటులో ఉంటుంది. అప్పుడు దానిని ప్రపంచంలో ఎక్కడ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో అక్కడికల్లా తీసుకుపోతారు. అదే మాంద్యం ముంచుకొస్తున్నప్పుడు దానిని అదుపు చేయడానికి పరిష్కారంగా మార్కెట్‌ లో పెట్టుబడులు అందుబాటులో లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. వడ్డీ రేట్లు పెంచడం అందుకోసమే. అప్పుడు పెట్టుబడులు వెనక్కి అమెరికా మళ్ళిపోతాయి. అమెరికాలో వడ్డీ రేటు సున్నా ఉన్నప్పుడు ఇండియాలో గనుక 3 శాతం వడ్డీ రేటు ఉందనుకోండి. అప్పుడు పెట్టుబడులు ఇండియాకు తరలివస్తాయి. అదే అమెరికాలో 6 శాతం వడ్డీ రేటు ఉండి ఇండియాలో 9 శాతం వడ్డీ రేటు ఉంటే (అప్పుడూ తేడా 3 శాతమే) మాత్రం అంత ఎక్కువగా ఇండియాలోకి పెట్టుబడులు ప్రవహించవు.
         ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందీ అంటే అప్పుడు పెట్టుబడిదారులకు కాళ్ళు, చేతులు ఆడని స్థితి వస్తుంది. ''లాభం సంగతి ఆనక చూసుకుందాం, ముందు మప సంపదను భద్రంగా కాపాడుకుందాం'' అన్న ధోరణి వారిలో బలంగా ముందుకొస్తుంది. అప్పుడు తమ కాపలాదారు అయిన అమెరికా కు పెట్టుబడులన్నింటినీ తరలిస్తారు. 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు జరిగింది ఇదే. ఆ సమయానికి అమెరికాలో పలు ఆర్థిక లావాదేవీలు రిస్క్‌ ఎక్కువగా ఉండే స్టాక్‌ లతో ( హెడ్జ్‌ ఫండ్స్‌ వంటివి, తిరిగి వస్తాయో రావో తెలియని రుణాలతో కూడినవి) జరుగుతూ వున్నాయి. నిజానికి ఆర్థిక సంక్షోభం ముదరడానికి అటువంటి పెట్టుబడులే కారణం. ద్రవ్య పెట్టుబడులకు అమెరికాలో భద్రత కనిపించని ఆ పరిస్థితుల్లో కూడా అక్కడినుండి ఇతరదేశాలకు తరలిపోడానికి బదులు, సంక్షోభం బద్దలు కాగానే అమెరికా వైపుగానే పెట్టుబడులు ప్రవహించాయి. నిజానికి మన ఇండియాలో ఆ సమయంలో రిస్క్‌తో కూడిన పెట్టుబడులు పెద్దగా లేవు. అమెరికాలో సంక్షోభం బద్దలైనా, ఇక్కడ మనం దాని తాకిడిని తట్టుకోగలిగిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ, ద్రవ్య పెట్టుబడులు ఇండియా వైపు రానేలేదు.
         ప్రస్తుతం అమెరికా వడ్డీ రేట్లను పెంచడం ప్రపంచ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందన్న సంకేతాలను ఇస్తోంది. అందుచేత తక్కిన దేశాల నుండి అమెరికా వైపు ద్రవ్య పెట్టుబడులు ప్రవహించడం మళ్ళీ పెరుగుతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నందువలన అదనంగా లాభాలు వస్తాయన్న కోరిక ఒక్కటే ఇందుకు కారణం కాదు. ఒకవేళ ఇప్పుడు తక్కిన దేశాలు కూడా అమెరికాతో పోటీ పడి తమ తమ వడ్డీ రేట్లను పెంచినా, అమెరికావైపు ద్రవ్య పెట్టుబడులు ప్రవహించడం ఆగదు.
దీని పర్యవసానాలు మూడో ప్రపంచ దేశాలమీద తీవ్రంగా పడతాయి. తమ తమ దేశాల్లో పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా, అంతర్జాతీయంగా కూడా పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా సరుకుల ఉత్పత్తికి కావలసిన పెట్టుబడుల లభ్యత తగ్గిపోతుంది. దాని ఫలితంగా ఉత్పత్తి తగ్గుతుంది. లేదా, ఉత్పత్తిలో కొనసాగవలసిన వృద్ధి లేకుండా పోతుంది. ఇది ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుంది. ఇంకోవైపు తాము ఐఎంఎఫ్‌ కు, లేదా ప్రపంచ బ్యాంక్‌ కు రుణాల వాయిదాలను చెల్లించడానికి కావలసిన విదేశీ మారకద్రవ్యం మరింత ఖరీదైపోతుంది (డాలర్‌ విలువ పెరిగిపోతున్న కారణంగా). అప్పుడు విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు పెరుగుతుంది. దానిని తట్టుకోడానికి ఆ ప్రభుత్వాలు దారుణమైన స్థాయిలో పొదుపు చర్యలను చేపట్టవలసి వస్తుంది. దాని వలన ప్రజల సంక్షేమం మరింత దెబ్బ తింటుంది. తమ వద్దకు సహాయం కోసం వచ్చే దేశాలు ఈ తరహా పొదుపు చర్యలు తప్పనిసరిగా చేపట్టే విధంగా ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ షరతులు పెడతాయి.
          తక్కిన మూడో ప్రపంచ దేశాలలో చాలా వాటితో పోల్చితే ఇండియాకు విదేశీ రుణ భారం అంత ఎక్కువేమీ కాదు. నయా ఉదారవాద కాలంలో ఇప్పటిదాకా మన దేశానికి రుణం (విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటును భర్తీ చేసుకోడానికి కావలసిన రుణం) సులువుగానే లభిస్తూ వచ్చింది. నయా ఉదారవాద విధానాలను మన దేశంలో అమలు చేయడానికి ముందు ఇక్కడ అనుసరించిన విధానాలు మన దేశం లోకి విదేశీ పెట్టుబడులను అంత తేలికగా అనుమతించలేదు. ఇక్కడ ఉన్న మార్కెట్‌ లోకి ప్రవేశించడానికి విదేశీ బహుళజాతి సంస్థలు ఉవ్విళ్ళూరుతూ వుండేవి. ఆ సమయంలోనే అమెరికాలో వడ్డీ రేట్ల దాదాపు సున్నా దగ్గరికి చేరాయి (అక్కడ ఉన్న మాంద్యం నుంచి బైట పడడానికి ఎక్కువ మోతాదులో పెట్టుబడులను పెట్టేలా ప్రోత్సహించాలంటే చౌకగా పెట్టుబడులు దొరికేట్టు చేయాలి. అందుకే అప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లను తగ్గించారు). దాంతో ఇండియా లోకి, మరికొన్ని మూడో ప్రపంచ దేశాలలోకి పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇక్కడ హెచ్చుగా లాభాలు పోగేసుకోడానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోడానికి వచ్చాయి.
          దీని ఫలితంగా భారతదేశం జిడిపి వృద్ధిరేటు అంతకు ముందు కాలంతో పోల్చితే బాగా పెరిగింది. విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు సమస్య తలెత్తలేదు. అందుకే 2002 నుండి 2012 మధ్య కాలంలో డాలర్‌తో మన రూపాయి మారకపు రేటు చాలా వరకూ స్థిరంగా కొనసాగింది (ఈ జిడిపి వృద్ధి శ్రామిక ప్రజానీకపు జీవితాలలో ఏ విధమైన మెరుగుదలకూ దోహదం చేయలేదు అన్నది వేరేసంగతి). విదేశీ సంపద చాలా పెద్ద స్థాయిలో తరలివచ్చినందు వలన రూపాయి విలువ ను స్థిరంగా నిలబెట్టడానికి రిజర్వు బ్యాంకు తన విదేశీమారకపు నిల్వలను పెంచింది. లేకపోతే వాస్తవానికి రూపాయి విలువ బాగా పెరిగి వుండేది. అదే గనుక జరిగితే విదేశాల నుండి దిగుమతి అయ్యే సరుకులు చౌకగా లభించి స్వదేశీ సరుకుల మార్కెట్‌ ను ఆక్రమించి వుండేవి. చాలా స్వదేశీ పరిశ్రమలు మూతబడే ప్రమాదం ఏర్పడి వుండేది. ఇంకోపక్క మన విదేశీ రుణం బాగా పెరిగివుండేది.
         ఇప్పుడు నయా ఉదారవాదపు దశ ఆ పరిస్థితిలో కొనసాగడం లేదు. ఆ దశను దాటిపోయింది. గతంలో వచ్చిన జిడిపి వృద్ధి రేటు ఇప్పుడు అదే మోతాదులో కొనసాగడం లేదు. సమాజంలో ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోవడం, ప్రజల కొనుగోలు శక్తి బాగా క్షీణించడం వలన మన దేశీయ డిమాండ్‌ బాగా దెబ్బ తింది. అంతర్జాతీయంగా కూడా శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి దెబ్బ తింది. కనీసం ఇప్పుడు తగ్గిన స్థాయిలోనైనా జిడిపి వృద్ధి కొనసాగాలంటే దానికి విదేశీ చెల్లింపుల ఖాతాలో పెరిగే లోటు ఆటంకంగా తయారౌతుంది.
ఈ విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు గనుక వేగంగా పెరిగిపోతే ఒక దేశానికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో, ఒక దేశాన్ని ఆ సమస్య ఎంత వేగంగా కాళ్ళబేరానికి రప్పిస్తుందో చెప్పడానికి మన పొరుగుదేశం శ్రీలంక ఒక ఉదాహరణ. అంతకు ముందు కొద్ది రోజుల క్రితం దాకా అది 'స్వల్ప ఆదాయ' స్థాయి నుండి 'మధ్య స్థాయి'కి ఎదిగిన దేశంగా పరిగణించబడేది. ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడ విదేశీ రుణం భరించరానంత స్థాయికి పెరిగిపోయింది. విదేశీ మారక ద్రవ్యానికి తీవ్రమైన లోటు ఏర్పడింది. దాని ఫలితంగా అది ఐఎంఎఫ్‌ ముందు చేతులు కట్టుకుని నిలవక తప్పలేదు. ఆ సంస్థ విధించిన ''పొదుపు'' చర్యలను అమలు చేయడానికి అంగీకరించక తప్పలేదు. ఈ విధంగా
        ఉన్నట్టుండి 'కలిగిన' దేశం కాస్తా 'లేని' దేశంగా దిగజారడానికి కారణం స్థానిక అవినీతి రాజకీయ నాయకుల నిర్వాకమేనని, రాజపక్సే వంటి కపట వేషధారులే కారణం అని సామ్రాజ్యవాద ప్రచారం చెప్పవచ్చు. అటువంటి కపటుల పాత్ర ఎంత ఉన్నప్పటికీ, దాని వెనుక నయా ఉదారవాదం బలవంతంగా రుద్దిన వ్యవస్థీకృత మార్పులు కీలకం అన్నది విస్మరిస్తే పొరపాటు.
        కొద్దిమంది ద్రవ్య పెట్టుబడిదారుల, స్పెక్యులేటర్ల దురాశ, వారి ప్రయోజనాలు అత్యధిక మెజారిటీగా ఉండే శ్రామిక ప్రజల జీవన పరిస్థితులను శాసించడం నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానపు ప్రత్యేకత. ఆ కొద్దిమంది స్పెక్యులేటర్లు గనుక ద్రవ్యోల్బణం తాకిడికి గాభరా పడి నిర్ణయాలు తీసుకుంటే అది మూడవ ప్రపంచపు అసంఖ్యాక శ్రామిక ప్రజలకు ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుంది. విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు సమస్యనుండి బైట పడడానికి ఆ మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు అనుసరించే పొదుపు చర్యల ఫలితంగా ఆ శ్రామిక ప్రజానీకమే బలిపశువులౌతారు. నయా ఉదారవాద విధానాలు ఊపుగా అమలు జరిగినప్పుడు వారికి ఏ ప్రయోజనాలూ కలగలేదు. ఇప్పుడు ఆ విధానాలు పతనమౌతున్నప్పుడు సైతం దానికి వారే బలిపశువులు అవుతున్నారు.

(స్వేచ్ఛానువాదం)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌