కూరల్లో స్పైసీ కోసం వాడే పచ్చిమిర్చి ఆరోగ్యమైన పోషకమే కాదు ఔషధం కూడా. రైతులు తోటలుగా పండించే పచ్చిమిర్చిని ఇప్పుడు మనం కాస్తంత జాగా ఉంటే చాలు ఇంట్లోనూ పండించుకోవచ్చు. కుండీల్లో మిద్దె తోటగానూ వేసుకోవచ్చు. దీంతో ఇంట్లోనే పచ్చిమిరపకాయలను కాయించుకోవచ్చు. వాటి ద్వారా ఎండిమిర్చి కూడా తయారుచేసుకోవచ్చు. అయితే ఇందులోనూ అనేక రకాలు ఉన్నాయి.. అవేంటో ఓ సారి చూద్దాం..!
సాధారణంగా మిర్చి నారును వర్షాకాలం చివరలో వేసి, వేసవికాలం నాటికి పంట పూర్తిచేస్తారు. ఇప్పుడొచ్చే హైబ్రీడ్ వంగడాలతో సంవత్సరం పొడుగునా ఇంట్లోనే పచ్చిమిర్చి ఫలసాయాన్ని పొందవచ్చు.
పోషకాలు: విటమిన్ ఎ, సి, కాపర్, ఐరన్, ప్రొటీన్, పొటాషియం, బీటా కెరోటిన్, ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. జీర్ణ ప్రక్రియకు, శక్తిని పెంచడానికి, శరీర రసాయనక్రియలు జరగడానికి పచ్చిమిర్చి ఎంతో ఉపయోగపడుతుంది.
రకాలు: సన్న, సీమ, పొడుగు, పొట్టి ,దేశవాళీ, రబ్బరు, క్యాప్సికం, నల్ల వంటి ఎన్నో రకాలు పచ్చిమిర్చిలో ఉన్నాయి.
సాగు విధానం: ఎరుపు, ఇసుకపర్రు, ఒండ్రు, నీరు నిలవని మెట్ట ప్రాంతాల్లో సాధారణంగా మిర్చి నారు వేస్తారు. విత్తిన 40 రోజులకు నారు తయారవుతుంది. మడుల్లో నాటిన తర్వాత పొడిపొడిగా నీటి తడి పెట్టాలి. నీళ్లు నిలువ ఉండకూడదు. నాటిన 40 రోజులకి రెండు నుంచి మూడడుగుల వరకూ పెరిగి, పూత పూస్తుంది. పూత వచ్చిన పది రోజులకి పిందెలు, కాయలుగా మారతాయి. ఇలా మూడు నెలల పాటు కాపు కాస్తూ ఉంటుంది. ఒకవేళ ఎండుమిర్చి కోసం పంట వేస్తే! కాయలు ముదిరి, పండిపోయే వరకూ చెట్టునే ఉంచాలి.
మిరప పంట తెగుళ్లు: తెగులు ఆశించిన మొక్కలు వడలిపోయి, ఎండిపోయి, పూత, పిందె ఆకులు రాలిపోతాయి. దీన్ని ముడత తెగులు, రాలు లేదా గిడస తెగులు అంటారు. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి. 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోలు వేపపిండి, రెండు కిలోల ట్రైకోడర్మా విరిడి కలిపి వృద్ధి చేసుకొని, మిరప సాళ్లలో వేసుకోవాలి. సేంద్రీయ ఎరువులు వాడాలి.
దేశవాళి మిర్చి
తోటలుగా సాగు చేసే మిర్చి. చెట్టుకి 100 నుంచి 150 వరకూ కాయల కాస్తుంది. మూడు నెలల వరకూ కాపు ఉంటుంది. మొక్క మొదట్లో ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు నిలువ ఉండకూడదు. కుండీల్లోనూ, ఇంటి కాళీ జాగాల్లోనూ పెంచుకోవచ్చు.
హైబ్రిడ్ సీమ పచ్చిమిర్చి
హైబ్రీడ్ చీమ పచ్చిమిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ హైబ్రీడ్ మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు నలుపు, తెలుపు, లేత గోధుమ, పసుపు, కాషాయం, ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి రెడీమేడ్‌గా నర్సరీల్లో దొరుకుతాయి. ఈ మొక్క చాలా అందంగా డెకరేటివ్‌గా ఉంటాయి.
సన్నమిర్చి
సన్నమిర్చి.. దీన్నే గుంటూరు మిర్చి అని కూడా అంటారు. ఇది చాలా కారంగా ఉంటుంది. కుండీల్లో కూడా పెరుగుతాయి. జాగ్రత్తగా పెంచితే మూడు నెలలపాటు పంట ఉంటుంది. లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగాను ముదిరితే పండు ఎరుపు రంగులోకి మారతాయి.
రబ్బరు మిర్చి
రబ్బరు మిర్చి పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. ఆకుపచ్చగా నిగినిగిలాడుతుంటాయి. గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. కానీ ఘాటు తక్కువగా ఉంటుంది. అందుకే వీటిని బజ్జీలకి వాడతారు. వీటిని మార్కెట్లో బజ్జీ మిర్చి, బొంత మిర్చి అని కూడా అంటారు. వీటిని కూడా కుండీల్లో పెంచుకోవచ్చు. వీటికి కాస్త ఎండ ఎక్కువగా తగలాలి.
పొట్టి మిర్చి
మిర్చి చాలా పొట్టిగా అంగుళం లోపు ఉంటుంది. దీనిలో గింజలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో రకరకాల రంగులు ఉన్నాయి. సైజును బట్టి పది రకాల వరకూ ఉన్నాయి. కొన్ని పొట్టిమిర్చిని ఆవకాయ పచ్చడి కారానికి వాడుతారు. వీటి ధర ఎక్కువే. ఎండిన తర్వాత కాయలు గొట్రు కూడా ఎక్కువగానే ఉంటుంది.
క్యాప్సికం మిర్చి
లావుగా పొట్టిగా పెద్ద పరిమాణంలో ఉండే మిర్చిని క్యాప్సికం లేదా ఎలిఫెంట్ మిర్చి అంటాము. ఇది ఘాటు కాస్త తక్కువైనప్పటికీ పోషకాలు మెండుగా ఉంటాయి. చాలా రకాల వంటల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. ఇది కుండీల్లో కూడా పెరుగుతుంది. దీన్ని కాస్త నీడ ఉండే షేడ్‌నెట్‌లో పెంచుకోవాలి. చల్లటి వాతావరణంలో కాయలు మిలమిల మెరుస్తూ, పెద్ద పరిమాణంలో పెరుగుతాయి. వీటిలో పదుల సంఖ్యలో రకాలు, రంగులు ఉన్నాయి.
నల్లమిర్చి
ఇది థాయిలాండ్ రకం మిర్చి. కాయలు నల్లగా ఉంటాయి. కిందవైపు కాకుండా ఊర్ద ముఖంగా కాయలు కాస్తుందీ మొక్క. కాయలు సమానమైన ఘాటు ఉంటాయి. కాస్త నీడలో పెంచాలి వీటిని. నీటి తడి తక్కువగా ఇవ్వాలి.
సిహెచ్‌ఎస్ రావు
8985945506