Mar 03,2023 07:43

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సి.పి.ఎస్‌ రద్దు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాటి పాదయాత్రలో స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు దేశంలో రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను పునరుద్దరించాయి. తమిళనాడూ అదే మార్గంలో ఉంది. కానీ మన రాష్ట్రంలో సిపిఎస్‌ రద్దుకోసం జరుగుతున్న ఉద్యమాలను పట్టించుకోకుండా సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ విధానం ప్రవేశపెడతామని ప్రకటనలిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సమ్మతం కాదు. సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాల్సిందే.

మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో శాసన మండలి పునరుద్ధరించిన తరువాత టీచర్స్‌, గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గాల నుండి గెలుపొందిన ఏడుగురు శాసనమండలి సభ్యులు చుక్కా రామయ్య, ప్రొఫెసర్‌ కె నాగేశ్వర్‌, డి రామిరెడ్డి, వి బాలసుబ్రమణ్యం, ఎంవిఎస్‌ శర్మ, కెఎస్‌ లక్ష్మణరావు, కె జార్జివిక్టర్‌లు ప్రొగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడిఎఫ్‌)గా ఏర్పడ్డారు. ఆ తరువాత వై శ్రీనివాసులురెడ్డి, డాక్టర్‌ గేయానంద్‌, బొడ్డు నాగేశ్వరరావు, రాము సూర్యారావు, ఐ వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జిలు కూడా శాసనమండలిలో పిడిఎఫ్‌ సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్నారు. గత 15 ఏళ్లలో పిడిఎఫ్‌ రాజ్యాంగ విలువలకు కట్టుబడి, ప్రస్తుత కార్పొరేట్‌ రాజకీయాల్లో నిజాయితీగా ఉంటూ, ప్రజల సమస్యలను ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు, రైతులు, కౌలు రైతులు, మహిళలు తదితరుల సమస్యలను శాసనమండలిలో వినిపించడమేకాక, శాసన మండలి వెలుపల జరిగే ఆందోళనలకు మద్దతునిస్తూ, అవసరమైనప్పుడు ప్రాతినిధ్యాలు చేస్తున్నారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ప్రశ్నించే గొంతుకలుగా ఉంటూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 13న ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న 5 శాసనమండలి ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న ఉత్తరాంధ్ర నుండి డాక్టర్‌ కె రమాప్రభ, తూర్పు రాయలసీమ నుండి పి. బాబురెడ్డి, ఎం వెంకటేశ్వరరెడ్డి, పశ్చిమ రాయలసీమ నుండి పిడిఎఫ్‌ బలపరుస్తున్న కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగారాజులను గెలిపించుకోవలసిన అవసరమున్నది.
 

                                                                      విద్యారంగం అస్తవ్యస్తం

గత నాలుగేళ్లుగా ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశపెట్టిన మార్పులు, సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు నష్టపోయాయి. ముఖ్యంగా 3,4,5 తరగతులను ప్రాథమిక పాఠశాలలనుండి ఉన్నత పాఠశాలలకు తరలించడం వల్ల పిల్లలు ఇంటి బడికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. మొత్తం ప్రాథమిక పాఠశాల వ్యవస్థ క్షీణించిపోయే ప్రమాదం ఏర్పడింది. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు శ్రీకాకుళం జిల్లా పలాస నుండి అనంతపురం జిల్లా పెనుగొండ వరకు నిర్వహించిన 'బడికోసం బస్సుయాత్ర'లో తల్లుల ఆక్రోశం, ఆవేదన వెల్లడైంది. పాఠశాల విద్యలో బదిలీలు, ప్రమోషన్లు వంటివి ఒక పద్ధతి లేకుండా ప్రహాసనంగా తయారయ్యాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యావిధానం-2020ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తుండగా, మన రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతున్నది. ఎయిడెడ్‌ పాఠశాలలను, కళాశాలలను రద్దుచేసింది. ఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు చేసిన ఉద్యమాల వల్ల కొన్ని ఎయిడెడ్‌ సంస్థలు కొనసాగుతున్నాయి. వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇంతవరకూ ఒక డిఎస్‌సి కూడా ప్రకటించలేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 5వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా, ఇంతవరకు ఒక పోస్టునూ భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న దాదాపు 1,20,000 మంది ఉపాధ్యాయులకు ఎటువంటి భద్రతా, వేతన రక్షణా లేదు.
           కస్తూరిబా విద్యాలయాల్లో ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేలు ఇస్తామని జీవోలు ఇచ్చి, ఇప్పుడు కంటితుడుపుగా వేతనం పెంచారు. కాంట్రాక్టు ఉద్యోగులను, ఉపాధ్యాయులను, అధ్యాపకులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీి నెరవేరలేదు. ముఖ్యంగా కాంట్రాక్టు అధ్యాపకులకు, 2008 డిఎస్‌సిలో ఎంపికై ఇటీవల ఎంటిఎస్‌లో నియమించబడిన అభ్యర్థులకు 10 రోజుల తేడాతో 12 నెలల జీతంతో పాటు రెగ్యులరైజేషన్‌ చేయాలి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో, ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో, వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్‌టిలను రెగ్యులర్‌ చేయడమే కాక, పనిచేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీ, పార్ట్‌-టైం ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతన పెంపుదలలో న్యాయం జరగలేదు. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు అనేక సమస్యలు యథాతథంగా ఉన్నాయి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వేలాది మందికి అనేక సంవత్సరాలుగా వేతన పెంపుదల జరగలేదు.
 

                                                                  వేతన జీవుల ఆర్ధిక వెతలు

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. 11వ పి.ఆర్‌.సి వల్ల ఎటువంటి ఉపయోగమూ జరగలేదు. 2018 జూలైనుండి డి.ఏలు ఇవ్వలేదు. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించడం లేదు. రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పి.ఎఫ్‌, ఎ.పి.జి.ఎల్‌.ఐ వంటివి దాదాపు 3 వేల కోట్ల రూపాయలు చెల్లించవలసిన పరిస్థితి ఉంది. 2022 ఫిబ్రవరి 3న బి.ఆర్‌.టి.ఎస్‌ రోడ్డులో వేలాదిమందితో ఉద్యమం జరిగిన తరువాత ఉద్యోగులు, ఉపాధ్యాయులపై వేధింపులు పెరిగాయి. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను భయ, భ్రాంతులకు గురిచేస్తున్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
 

                                                                        రద్దుకాని సిపిఎస్‌

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సి.పి.ఎస్‌ రద్దు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాటి పాదయాత్రలో స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు దేశంలో రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను పునరుద్దరించాయి. తమిళనాడూ అదే మార్గంలో ఉంది. కానీ మన రాష్ట్రంలో సిపిఎస్‌ రద్దుకోసం జరుగుతున్న ఉద్యమాలను పట్టించుకోకుండా సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ విధానం ప్రవేశపెడతామని ప్రకటనలిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సమ్మతం కాదు. సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాల్సిందే.
 

                                                                    జాడలేని జాబ్‌ క్యాలెండర్‌

అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంతవరకు ఒకసారి 10వేల పోస్టులతో మాత్రమే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించారు. అవి కూడా ఎక్కువగా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ పోస్టులు మాత్రమే. లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 2 లక్షలపైగా పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్‌ 1,2,3,4 కేటగిరీల పోస్టులు పెద్దసంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ఒక డిఎస్‌సి కూడా ప్రకటించలేదు. పోలీస్‌ ఉద్యోగాల ఖాళీల్లో 20శాతం మాత్రమే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పనితీరును మెరుగు పరచి, ఉద్యోగాలకు వయోపరిమితిని కూడా పెంచాలి.
 

                                                               కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

రాష్ట్రంలో వేలాదిమంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, స్కీమ్‌ వర్కర్లు పని చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని హామీలిచ్చినప్పటికీ అమలు జరగలేదు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగలేదు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపుదల క్రమపద్దతిలో జరగడం లేదు. అంగన్వాడీలు, ఆశాలు పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ డిమాండ్లు నెరవేరలేదు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఈ ఉద్యమాలన్నింటికీ అండదండలుగా ఉంటున్నారు.
 

                                                                ప్రత్యేక హోదా, విభజన హామీలు

2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టహామీలను అమలు చేస్తామని కేంద్రం హామీ యిచ్చింది. గత 9 ఏళ్లుగా నరేంద్రమోడీ ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రులను మోసం చేసింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వైఫల్యం చెందాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన చట్టంలోని పోలవరం నిర్మాణం, రాజధానికి నిధులు, కడపలో ఉక్కు కర్మాగారం, రామాయపట్నం ఓడరేవు, విశాఖలో రైల్వేజోన్‌, జాతీయ విద్యాసంస్థల నిర్మాణం, 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్‌ తదితర అంశాల్లో ఏదీ అమలు జరగలేదు. అంతేకాక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం, కృష్ణపట్నం-గంగవరం ఓడరేవులను అదానీకి అప్పగించడం తదితర చర్యలను చేపట్టారు. వీటికి సంబంధించిన అన్ని అంశాల్లో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నారు. ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించడమే కాకుండా, విభజన హామీలు అమలు కోసం జరిగే ఉద్యమాలన్నింటికీ మద్దతు ప్రకటించటమే కాక, ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి పట్ల స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నారు.
 

                                                                       సామాజిక తరగతులు

సామాజిక తరగతులైన ఎస్‌సి.,ఎస్‌టి., బిసి., మైనారిటీల అభివృద్ధి గురించి శాసనమండలిలో ప్రస్తావించడమే కాకుండా అనేకమార్లు ప్రాతినిధ్యం చేశారు. చేస్తూనే ఉన్నారు. పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు ప్రభుత్వ స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేయాలి. ఎస్‌సి.,ఎస్‌టి సబ్‌ప్లాన్‌ను స్పష్టంగా అమలు చేయాలి. జ్యోతిరావ్‌పూలే పేరుతో బిసి స్టడీసర్కిల్స్‌ ఏర్పాటుచేయాలి. మహిళా హక్కులను పరిరక్షించాలి. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి.
 

                                                           రాష్ట్రంలో నిరసన ఉద్యమాలు - ప్రభుత్వం

భారత రాజ్యాంగంలో 19వ నిబంధన... సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కుతో పాటు భావ ప్రకటనా స్వేచ్ఛను, నిరసన హక్కులను కల్పించింది. కానీ రాష్ట్రంలో నిరసనలకు అవకాశం ఇవ్వడం లేదు. ప్రజా ఉద్యమాలను అణిచివేస్తూ అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు. జి.వో. నెం.1 ద్వారా ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఉద్యమాలను కూడా జరగనివ్వబోమని ప్రభుత్వం చెబుతున్నది. వివిధ డిమాండ్లపై శాంతియుతంగా నిరసన తెలపడానికి ప్రజాస్వామ్యంలో వ్యక్తులకు, సంస్థలకు, సంఘాలకు రాజ్యాంగ పరమైన హక్కులు ఉన్నాయి. వాటిని కాపాడు కోవలసిన బాధ్యత అందరిపై ఉన్నది. రైతులు, కూలీలు, కార్మికులు, అసంఘటితరంగ కార్మికులు చేసే ఉద్యమాలను, హక్కులను కాపాడుకోవాలి.
 

                                                             పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించండి

2023 మార్చి 13న జరగబోతున్న 5 టీచర్స్‌, గ్రాడ్యుయేట్స్‌ శాసనమండలి ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతి పక్ష పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ ఓటర్ల నమోదు ప్రక్రియ నుండే అక్రమాలకు తెరలేపింది. అనర్హుల ను ఓటర్లుగా చేర్చింది. అధికారులను ఇష్టానుసారం బదిలీ చేసి, అనుకూలరను నియమించుకున్నది. దౌర్జన్యాలు, ప్రలో భాలతో గెలవాలని చూస్తున్నది. అధికార పార్టీ ఆగడాలకు చెక్‌పెట్టే విధంగా ఓటర్లు పిడిఎఫ్‌ అభ్యర్థులకు మద్దతు తెలపాలి. ఈ ఎన్నికల్లో పిడిఎఫ్‌ పనితీరును, నిబద్ధతను గుర్తించి ఓటర్లు తమ మొదటి ప్రాధాన్యతా ఓటును పిడిఎఫ్‌ అభ్యర్థులు, బలపరచిన అభ్యర్థులకు వేసి గెలిపించాలని పిడిఎఫ్‌ తరపున వినయపూర్వకంగా కోరుతున్నాము.

(వ్యాస రచయిత శాసనమండలి సభ్యులు)
కెఎస్‌ లక్ష్మణరావు

కెఎస్‌ లక్ష్మణరావు