Oct 07,2022 06:50

ఫీల్డు లోకి వెళ్లకుండా ఆన్‌లైన్‌లో క్లాసులు వినడం ద్వారా పని అనుభవం ఎలా వస్తుందో పాలకులే చెప్పాలి. ఒకవేళ ప్రభుత్వం ఇంటర్న్‌షిప్‌ చేయించాలనుకుంటే దానికి తగ్గట్టుగా సౌకర్యాలను ముందుగానే కల్పించాలి. నూతన విద్యా విధానం అమలు చేస్తూ తరగతుల విలీనం, ఇంటర్న్‌షిప్‌ అంటూ సంస్కరణలు చేస్తుంది కానీ దానికి తగ్గట్టు సౌకర్యాలు కల్పించడంలేదు. దీని వలన విద్యార్ధులకు ప్రపంచ స్థాయి విద్య, ఉపాధి పక్కన పెడితే అసలు విద్యే లేకుండా పోతుంది.

ఇంగ్లాండ్‌ ప్రభుత్వం 1973లో...10 నుండి 11 మరియు 14 నుండి 16 సంవత్సరాల పిల్లలకు విద్యలో భాగంగా ఇంటర్న్‌షిప్‌ (పని అనుభవం) తప్పనిసరిగా ఉండేలా చట్టం చేసింది. ఎందుకంటే ఆ వయస్సు పిల్లలను ఇంటర్న్‌షిప్‌కు పంపించడం వలన వారికి పని ప్రపంచంపై సరైన అవగాహన లేకపోవడంతో పని నేర్పించడం సాధ్యం కాదని తర్వాత వచ్చిన కన్జర్వేటివ్‌ లిబరల్‌ సంకీర్ణ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. కానీ బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో 3,5,8 తరగతులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత కాని వారికి వృత్తి విద్యా కోర్సుల వైపు మళ్లించాలని నిర్దేశించింది. ఆ వయస్సులో వారికి పని ప్రపంచంపై సరైన అవగాహన లేకపోవడంతో అటు పనికి ఇటు చదువుకి రెండింటికి దూరమైపోతారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానం అమలు చేయనప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. అందులో భాగంగా ఈ ఇంటర్న్‌షిప్‌ను ఇప్పటికే డిగ్రీలో ప్రారంభించింది.
 

                                                                         పెట్టుబడిదారులకు వరం

నేటివరకు విజయనగరం జిల్లాలో రెడ్డీస్‌ వంటి కంపెనీలు ఇంటర్మీడియట్‌ పూర్తి అయిన తరువాత కొంతమంది విద్యార్థులను ఒకవైపు డిగ్రీ చదివిస్తూ మరోవైపు ఇంటర్న్‌షిప్‌ చేయించేవి. దీనితో కంపెనీ యజమాని తన ఇంటర్న్‌లలో బాగా పని చేయగలిగే వారిని గుర్తించి ఆ కంపెనీలో ఉద్యోగులుగా తీసుకునేవారు. తద్వారా డబ్బు, సమయాన్ని ఆదా చేసుకునేవారు. అయినప్పటికీ బాగా పని చేయలేని ఇంటర్న్‌లపై (కొద్ది మందే అయినా) వారి చదువుకోసం పెట్టే పెట్టుబడి వృధా అవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కి పంపించడంతో కంపెనీలకు విద్యార్థులపై పెట్టే ఖర్చు ఆదా అవుతుంది. సాధారణంగా పెట్టుబడిదారుడు లాభం వస్తుందనుకుంటేనే ఏదైనా పని చేస్తాడు. లేదంటే ఆ పని ఎప్పటికీ చెయ్యడు. అందుకే విజయనగరం జిల్లాలో మహారాజ(ఎ) కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు చాలా మందికి రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కి ఫార్మా కంపెనీలకు సెలక్ట్‌ అయినప్పటికీ...6 నెలలు ఇంటర్న్‌షిప్‌కి అవకాశం కల్పిస్తాం గాని రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఇవ్వబోమని తిరిగి పంపించివేయడం జరిగింది. ఎందుకంటే రెండు నెలల్లో విద్యార్థికి పనిపై కొంత అనుభవం వస్తుంది. కానీ తరువాత ఆ విద్యార్థి ఆ కంపెనీలో పని చేయడానికి సమయం ఉండదు. దీనితో ఆ కంపెనీ యజమాని నష్టపోతాడు. ఇంటర్న్‌షిప్‌ అంటే వయోజన పని వాతావరణంలో ఎక్కువ లేదా తక్కువ ఉద్యోగిలా పనిచేయడం. ఇంటర్న్‌షిప్‌ ద్వారా పెట్టుబడిదారుడు తక్కువ స్టైఫండ్‌తో ఎక్కువ పని చేయించుకోవాలని భావిస్తాడు. రెండు నెలల్లో అది సాధ్యం కాదు. అందుకే ఒక్క ఫార్మసీ కంపెనీ కూడా రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కి అంగీకరించలేదు. వేలల్లో విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేయడం వలన కంపెనీలు వీరితో దిగువ స్థాయిలో పని చేయించుకోవడానికి దానికి అవసరమైన కార్మికులను నియమించకుండానే పని జరుగుతుంది.
 

                                                                         విద్యార్థులకు భారంగా...

సాధారణంగా ఇంటర్న్‌షిప్‌ అంటే ఇంటర్న్‌ మరియు సంస్థ మధ్య అనుభవం కోసం సేవల మార్పిడి అని పెట్టుబడిదారులు చెప్పే మాట. కానీ అది వాస్తవం కాదు. ఇంటర్న్‌షిప్‌ ద్వారా ఇంటర్న్‌ కంటే పెట్టుబడిదారులే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ప్రయోజననం లేదనుకుంటే దానికి వారు అంగీకరించరు. అందుకే విజయనగరం జిల్లాలో అధికారులు పరిశ్రమల్లో, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో రెండు నెలలు పాటు ఇంటర్న్‌షిప్‌కి సహకరించాలని చెబుతున్నప్పటికీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థల యజమానులు అంగీకరించే పరిస్థితి లేదు. ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఉంటే గానీ డిగ్రీ పాస్‌ కారనడంతో విద్యార్థులకు వేరే మార్గం లేక వ్యాపార సంస్థలకు డబ్బులు కడుతున్నారు. విద్యార్థుల అవసరాన్ని వ్యాపార సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. మహారాజ(ఎ) కళాశాల సమీపంలోని ఆల్ఫా కంప్యూటర్‌ కోచింగ్‌ సెంటర్లో ఒక్కొక్క విద్యార్థి నుండి రూ.800 వసూలు చేస్తున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ లో రూ.1000 కట్టమనడంతో, విద్యుత్‌ రంగంలో కుదరదు అనడంతో ఆ విద్యార్థులను కూడా ఆల్ఫా కంప్యూటర్‌ కోచింగ్‌ సెంటర్‌కు పంపించడం జరిగింది. సుమారు 150 మందికి పైగా ఉన్న విద్యార్థులకు కేవలం 5 కంప్యూటర్లు ఉండటంతో డబ్బులు ఖర్చు తప్ప ఎటువంటి అనుభవం రావడంలేదు. బిజెడ్‌సి చదువుతున్న విద్యార్థులకు పుట్టగొడుగుల పెంపకానికి మూడు రోజులు క్లాసులు, మూడు రోజులు ప్రాక్టికల్స్‌కు గాను రూ.1500 వసూలు చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు జిల్లాలో వేలల్లో ఉంటారు. వారందరికీ సరిపడా పరిశ్రమలు గాని, సంస్థలు గాని విజయనగరం జిల్లాలో లేవు గనక ఇతర జిల్లాలకు వెళ్లవలసి వస్తుంది. దానికి రానుపోను చార్జీలు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. దీనితో విద్యార్థులు పూర్తిగా వెళ్లకుండా కొద్దిరోజుల మాత్రమే వెళ్తున్నారు. చాలా మంది ఆన్‌లైన్‌లో క్లాసులు వింటున్నారు. ఫీల్డు లోకి వెళ్లకుండా ఆన్‌లైన్‌లో క్లాసులు వినడం ద్వారా పని అనుభవం ఎలా వస్తుందో పాలకులే చెప్పాలి. ఒక వేళ ప్రభుత్వం ఇంటర్న్‌ షిప్‌ చేయించాలనుకుంటే దానికి తగ్గట్టుగా సౌకర్యాలను ముందుగానే కల్పించాలి. నూతన విద్యా విధానం అమలు చేస్తూ తరగతుల విలీనం, ఇంటర్న్‌షిప్‌ అంటూ సంస్కరణలు చేస్తుంది కానీ దానికి తగ్గట్టు సౌకర్యాలు కల్పించడంలేదు. దీని వలన విద్యార్ధులకు ప్రపంచ స్థాయి విద్య, ఉపాధి పక్కన పెడితే అసలు విద్యే లేకుండా పోతుంది. దేశంలో ఉన్న ఉక్కు పరిశ్రమతో సహా ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నది మోడీ ప్రభుత్వం. భవిష్యత్తులో అసలు ప్రభుత్వ రంగమే లేకుండా చేసి మొత్తం ప్రైవేటీకరించడం బిజెపి లక్ష్యం. ఆ ప్రైవేటు కంపెనీల్లో పని చెయ్యడానికి చౌక కూలితో స్కిల్‌ ఉన్న లేబర్‌ కావాలి. అందుకే ఈ నూతన విద్యా విధానం తీసుకు వచ్చింది. అయినప్పటీకీ అందరికీ సరిపడా ఉపాధి కల్పించలేదు. ఎందుకంటే బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్క కొత్త పరిశ్రమ కూడా వచ్చింది లేదు. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు దీన్ని గమనించి...నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి.

(వ్యాసకర్త: ఎస్‌ఎఫ్‌ఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి, సెల్‌ : 9705545164 )
డి. రాము

డి. రాము