Jun 07,2023 07:52

          ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా గుర్తించిన తొలి రాష్ట్రంగా కేరళ రికార్డులకెక్కింది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ పాలనలో...విద్య, ఆరోగ్యం, మానవాభివృద్ధి, లింగ సమానత్వం, సామాజిక అభివృద్ధి, పర్యావరణం... ఇలా అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిచిన ఆ రాష్ట్రం డిజిటల్‌ రంగాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేయడం శ్లాఘనీయం. పేద, గొప్ప తారతమ్యాలు లేకుండా అందరికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో కె-ఫోన్‌ (కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌) ప్రాజెక్టును ఆ రాష్ట్ర సి.ఎం పినరయి విజయన్‌ తాజాగా ప్రారంభించారు. రోజురోజుకూ ఇంటర్నెట్‌ ధరలను పెంచేస్తూ, సామాన్యుడిని పీల్చిపిప్పి చేసి లాభాలను దండుకుంటున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌లు, సర్వీస్‌ ప్రొవైడర్లకు ప్రత్యామ్నాయంగా కేరళ ప్రభుత్వం కె-ఫోన్‌ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 20 లక్షలకుపైగా కుటుంబాలకు ఉచితంగా, మిగిలిన వారికి సబ్సిడీ రేట్లకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడంతోపాటు అవసరమైన డిజిటల్‌ సాధనాలతో, అవకాశాలతో వారికి సాధికారత కల్పించడమే ఈ బృహత్తర ప్రాజెక్టు లక్ష్యం.
        కంప్యూటర్‌ లిటరసీ, డిజిటల్‌ డివైడ్‌ వంటి మాటలు ఎక్కువగా వింటున్నాం. ఎటువంటి అసమానతలు లేకుండా అందరికీ అందుబాటులో ముఖ్యంగా సామాన్యులకు అంతర్జాలాన్ని అందుబాటులోకి తేవడం బహుప్రశంసనీయం. ఐ.టి రంగంలో ప్రపంచం శరవేగంగా దూసుకెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో 20 లక్షల బిపిఎల్‌ కుటుంబాలను ఆ పోటీలోకి తీసుకొచ్చేందుకు లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ముదావహం. ఇప్పటికే 17,412 ప్రభుత్వ కార్యాలయాలకు, 2,105 నివాసాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించారు. రెండు వేల బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫై సదుపాయం కూడా అందిస్తుంది. 30 వేల కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇది సాధ్యమైంది.
       సమగ్ర సామాజిక ప్రగతికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం 2017లో ప్రారంభించిన ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చుతోంది. భారీ వరదలు, కోవిడ్‌ విజృంభణ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి ఆటంకం కలిగించినప్పటికీ, ప్రాజెక్ట్‌ను అమలులోకి తీసుకురావడం 'నూతన కేరళ ఆవిర్భావం' దిశగా ప్రభుత్వ సంకల్పాన్ని చూపుతుంది. యూనివర్సల్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ నాలెడ్జ్‌ ఎకానమీ వృద్ధికి తోడ్పడుతుంది. కె-ఫోన్‌ ప్రాజెక్టు మారుమూల గ్రామాల్లో సైతం స్టార్టప్‌లు, ఇతర చిన్న పరిశ్రమలను ప్రేరేపించే పథకం, తద్వారా ఉపాధి అవకాశాలు వెల్లువెత్తించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఆన్‌లైన్‌లో ఇప్పటికే ఉన్న ఎనిమిది వందల ప్రభుత్వ సర్వీసులను కె-ఫోన్‌తో అనుసంధానమై ఒకే సైట్‌ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు.
          కె-ఫోన్‌ ఇప్పటికే ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా, కార్పొరేట్‌ ఆధిపత్య టెలికాం రంగానికి ఓ ప్రత్యామ్నాయం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేక ఏ ఒక్కరూ వెనకడుగు వేయకూడదన్నదే ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ నిర్ణయం. ప్రజల కనీస అవసరాలైన ఆహారం, దుస్తులు, నివాసం, జీవిత ప్రగతికి ప్రాథమిక అవసరంగా మారిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి వాటిపై శ్రద్ధ వహించే ప్రభుత్వం వాస్తవంగా మారింది.
           ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వరంగంలో హైస్పీడ్‌ బ్రాడ్‌ బాండ్‌ నెట్‌వర్క్‌లు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో సేవలందించడంలో వెనుకబాటు ఉంది. కేరళ ప్రభుత్వం మాదిరిగా బిపిఎల్‌ కుటుంబాలన్నింటికీ ఉచితంగా కనెక్షన్లు అందించే ప్రణాళికేదీ ఈ ప్రభుత్వాల వద్ద లేదు. అన్నింటా ఐ.టి రంగం విస్తరిస్తున్న ఈ తరుణంలో కార్పొరేట్‌, ప్రైవేట్‌ దోపిడీ నుంచి సామాన్యుడికి ఊరట కలిగించే ప్రణాళికలను చేపట్టడం బాధ్యతగా మిగిలిన ప్రభుత్వాలు కూడా తీసుకుని, కేరళ బాటలో నడవాలి.