Jun 12,2022 15:27

ఫల, పుష్ప, ఔషధ, ఆర్నమెంటల్‌ మొక్కల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన కడియం నర్సరీలో సరికొత్త మొక్కలు కొలువుదీరాయి. తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ పూలు పండ్లు ఉత్పత్తిచేసే మేలు రకాలైన ఈ నవతరం మొక్కలు విదేశాల్లో ఊపిరి పోసుకొని, రెక్కలు కట్టుకుని కడియంలో వాలిపోయాయి. స్థానిక రైతాంగం శ్రమ జీవన సౌందర్యంతో ఇక్కడ వాతావరణాన్ని తట్టుకునేట్టు మలుచుకుని, కడియం వనసిగలో కొంగొత్త మొక్కలై, వన ప్రియులను అలరిస్తున్నాయి.
ఔషధాల గని..
అంజురాను అంజీరా, అత్తి, ఫిగ్‌ఫ్రూట్‌ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఫికస్‌ కారికా. ఇది పుష్పించే మొక్కల కుటుంబం మొరేసిలోని చిన్నచెట్టు. మధ్యధరా, పశ్చిమ ఆసియాకు చెందినది. ఇది పురాతనకాలం నుండి సాగు చేయబడుతోంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. అంజీరాలో జింక్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఐరన్‌ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇది శరీర పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ డ్రై ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమం వంటి సమస్యల ఉపసంహ రణకు ఈ పండు ఉదాత్త ఔషధం.
గమ్మత్తయిన రుచి..
పోషక విలువలు ఉన్న అంజూర విదేశాల్లో ఎక్కడి నుంచో విరివిగా వాడుతున్నారు. మన దేశంలో ఔషధాల్లో ఉపయోగిస్తున్నప్పటికీ, ఫ్రూట్‌గా ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వస్తోంది. దీని రుచి భలే గమ్మత్తుగా ఉంటుంది. పండిన తర్వాత తింటే దీని గుజ్జు తియ్యగా, కాస్త కండ్రగా ఉంటుంది. గసగసాలు లాంటి చిన్న చిన్న గింజలు గుజ్జులో ఉంటాయి. పండ్లని ఎండబెట్టి, ఆరబెట్టి డైలో వేసి, డ్రై ఫ్రూట్‌గా మారుస్తారు. ఇవి ఎండుద్రాక్షల్లా మధురమైన రుచి ఉండటమే కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అంజూర డ్రైఫ్రూట్స్‌ ధర కూడా కాస్త ప్రియమే. ఎర్రమట్టి నేలల్లోనూ అంజూర మొక్కలు బాగా పెరుగుతాయి. రైతులు ఈ మొక్కలను తోటలుగా వేసి సాగు చేస్తే రైతులు మంచి ఫలసాయంతో లాభాలు పొందొచ్చు.
సాగు విధానం..
నాటిన మూడేళ్ల నుంచి కాపు మొదలవుతుంది. మొదట్లో నాలుగు, ఐదు కాయలు కాసినా.. ఆ తర్వాత చెట్టు నిండుగా పదుల సంఖ్యలో కాయలు కాస్తుంది. కాయలు మరీ చిన్నగా, మరీ పెద్దగా కాకుండా సమాన సైజులో ఉంటాయి. చెట్టు మరీ ఎత్తుగా గానీ గుబురుగా గానీ పెరగదు. కాస్తంత జాగా ఉంటే ఇళ్లల్లోనూ పెంచుకోవచ్చు. పది రోజులకు ఒకసారి కాస్త నీళ్లు పోస్తే సరిపోతుంది. ఎలాంటి మట్టిలోనైనా ఎలాంటి వాతావరణంలోనైనా సరే ఈ మొక్క పెరుగు తుంది. వేసవిలో ఫలసాయం ఇస్తుంది.
టర్కీ బ్రౌన్‌ అంజూర..

brown


ఔషధాల గని అంజూర. టర్కీ దేశం నుంచి తెచ్చినదీ సరికొత్త బ్రౌన్‌ అంజూర. సాధారణ అంజూర కంటే ఈ రకం ఎన్నో మేలైన లక్షణాలు కలిగి ఉంది. నాటిన ఆరునెలలకే కాపు కాస్తుంది. మొక్క ఒకటి రెండు అడుగుల ఎత్తులోనే కాపు కాస్తోంది. వాతావరణం కాస్త పొడిగాను, సాయంకాలం తొందరగా చల్లబడే ప్రాంతాల్లోనూ ఎక్కువగా కాపు ఉంటుంది. మన రాష్ట్రంలో కర్నూలు, కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని బళ్లారి, బెంగళూరు తదితర ప్రాంతాల వాతావరణం ఈ మొక్కలకు అనువు. అక్కడ తోటలుగా వేసి, మంచి ఫలసాయాన్ని పొందొచ్చు అంటున్నారు నర్సరీ రైతులు. ఇళ్లల్లో కుండీల్లోనూ నేల మీద కూడా పెంచుకోవచ్చు. కాయలు వెల్లుల్లిపాయల సైజులో ఉంటాయి. మగ్గిన తర్వాత వీటిని డ్రైప్రూట్‌గా మలచుకుని తింటారు. వీటికి సమాన పాళ్ళలో నీరు అందిస్తే సరిపోతుంది. ఏప్రిల్‌ నుంచి జులై వరకు కాయలు కాస్తూ ఉంటాయి. ఈ టర్కీ బ్రౌన్‌ మొక్క పదుల సంఖ్యలో..
మొక్క నిండుగా కాపు కాస్తుంది. కాయలు కాస్త పెద్ద పరిమాణంలో ఉండి, మధురమైన రుచిని కలిగి ఉన్నాయి. కడియం సప్తగిరి నర్సరీలో ఇలాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయి.

ఆరెంజ్‌ పనస..

panasa


ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఆధునిక పనస ఆరెంజ్‌ పనస. దీని రంగు, రూపు, రుచి, కాపు అన్నీ వినూత్నమే. నాటిన మూడేళ్లకే కాపు కాస్తుంది. చెట్టు నిండా కాయలు రగకాస్తాయి. దీని శాస్త్రీయ నామం గ్యాంగ్‌ సూరి. ఇది థాయిలాండ్‌ చెందిన రకం. దేశవాళి చెట్టులాగా భారీగా పెరగదు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు కాయలు కాస్తుంది. కాయల గుజ్జు ఆరెంజ్‌ రంగులో ఉంటుంది. చూడ్డానికి భలే ఆకర్షణగా ఉంటుంది. పండు ఎక్కువ రోజులు ఉంచినా పాడవకుండా ఉంటుంది. ఈ పనస పనసతొనలే కాకుండా చుట్టూ ఉండే పీచు, అడుగున ఉండే తొక్క, బెరడు కూడా చాలా తియ్యగా ఉంటుంది. అందుకే ఈ పనస తొక్క కూడా తినేయొచ్చు. సాధారణంగా పనసపండు కోస్తే బోలెడంత జిగురు ఉంటుంది. ఈ సరికొత్త ఆరంజ్‌ పనస పండులో మాత్రం జిగురు ఉండదు. పీచు పదార్థం మెండుగా ఉంటుంది. ఈ ఆరెంజ్‌ పనస తింటే తియ్యదనం ఓ రేంజ్‌ లో ఉంటుంది.
థాయిలాండ్‌ వాక్కాయ..

vagu


చిన్ని మొక్కే. గుబురుగా ఉండి గుత్తులు గుత్తులుగా వాక్కాయలు కాస్తాయి. ఈ సరికొత్త థాయిలాండ్‌ వెరైటీ మొక్క నాటిన మొదటి ఏడాది నుంచే కాపు అందుకుంటుంది. నేల మీదా, కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఎర్రమట్టి నేలల్లో శ్రీఘ్రమైన కాపు ఉంటుంది. వారానికి ఒకరోజు నీటివనరులు అందిస్తే సరిపోతుంది. సాధారణంగా వాక్కాయ మొక్క అక్కడక్కడా ముళ్ళుండే పొద జాతి, కంప మొక్క. ఈ విదేశీ రకం వాక్కాయ ముళ్ళు లేకుండా సాఫ్ట్‌గా ఉంటుంది. వాక్కాయలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, ఫైబర్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, అంథోసైనిన్స్‌, ఫినోలిక్‌ యాసిడ్స్‌, అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ పాలిఫినల్స్‌ వలన కణాలు దెబ్బతినకుండా, ఇన్ఫెక్షన్లకు రాకుండా రక్షిస్తుంది. తినుబండారాలలో వాడే చెర్రీ పండ్లను ఈ పండ్ల నుంచే తయారుచేస్తారు.