May 28,2023 07:53

చిరుధాన్యాలు.. సిరిధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్‌ పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రధాన ఆహారపంటగా ఉండేది. ప్రస్తుతం వరి, గోధుమ, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్‌ జనజీవన సరళితో మమేకమయ్యాయి. కంటికింపుగా పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తున్న ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహార పదార్ధాలు జిహ్వచాపల్యాన్ని తీర్చడం తప్ప ఆరోగ్యహేతువులు కావు. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరం. అన్ని తరగతుల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అగత్యం ఏర్పడింది. వీటన్నింటి దృష్ట్యా మన ప్రభుత్వం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది.

ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి భారత ఉపఖండంలో చిరుధాన్యాలు పండించబడుతున్నాయని సూచించడానికి పాలియోంటలాజికల్‌ ఆధారాలున్నాయి. గడ్డి కుటుంబానికి చెందినవి చిరుధాన్యాలు. ఏడాదంతా ఉష్ణమండల వాతావరణంలో పెరిగే తృణధాన్యాలు. తక్కువ నీటి సౌకర్యంతో, అతి తక్కువ కాలంలోనే పంట కోతకు వచ్చి, దిగుబడిని ఇస్తాయి. సైజులో చిన్నవే కానీ పోషకాలు మెండుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్‌, అమైనో ఆమ్లాలు, వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉంటాయి. రాగులు (ఫింగర్‌ మిల్లెట్‌), జొన్నలు (జోవర్‌), బజ్రా (పెర్ల్‌ మిల్లెట్‌), ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, ప్రోసో (చీనా), కోడో (కొడ్రా, అరికెలు), ఫాక్స్‌ టెయిల్‌ (కంగ్ని/కొర్ర), బార్న్యార్డ్‌ (వరై, సావా), లిటిల్‌ మిల్లెట్‌ (కుట్కి) మనదేశంలో పండించే మిల్లెట్లు.

  • ఆకుపచ్చ విప్లవం..

ఎమ్‌ఎస్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో (1960) వచ్చిన గ్రీన్‌ రివల్యూషన్‌ దశాబ్ద కాలం మనగలిగింది. తద్వారా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి లాంటి రకరకాల విత్తనాలు వ్యవసాయంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గ్రీన్‌ రివల్యూషన్‌ నేపథ్యంలో యాంత్రిక వ్యవసాయ ఉపకరణాలు, నీటి సౌకర్యం, పురుగుమందులు, ఎరువులు అభివృద్ధి రూపంలో వినియోగంలోకి వచ్చాయి. వ్యవసాయం ఆధునిక పారిశ్రామిక వ్యవస్థగా మారింది. ఆహారధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వాణిజ్య, వ్యాపార ధోరణిలో క్రమంగా వరి, గోధుమ ప్రాముఖ్యత పెరిగి, మిల్లెట్స్‌ ఉనికి మరుగున పడిపోయింది.

  • మినుకు మినుకు..

వర్షాధార, సారవంతం కాని భూముల్లో ఆహార పంటలుగా చెలామణి అవుతున్న వరి, గోధుమ, మొక్కజొన్న లాంటివి పండించలేము. దాంతో ఆయా భూముల్లో ఇప్పటికీ మిల్లెట్స్‌ సాగు మినుకు మినుకు మంటోంది. అంటే పాక్షిక ఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. ప్రధాన ఆహార ధాన్యాలలో కంటే వీటిలో పోషకాలు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఆరోగ్య భద్రతనిస్తాయి. అంతేకాక తీవ్రమైన వాతావరణ అననుకూల పరిస్థితులను తట్టుకునే శక్తి ఈ మిల్లెట్స్‌కు ఉంది. పర్యావరణ అభివృద్ధికి తోడ్పడతాయి.

  • ఐరాసకు భారత్‌ ప్రతిపాదన..

దేశీయంగానే కాక ప్రపంచ వ్యాపితంగా ఈ అవగాహనను కల్పించడానికి, ప్రజలకు పోషకాహారాన్ని అందించడానికి, మన ప్రభుత్వం 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. భారతదేశ ప్రతిపాదనకు 72 దేశాలు మద్దతు ఇచ్చాయి. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా ప్రకటించింది. ఈ థీమ్‌ ఆహార భద్రత, పోషకాహార పెంపుదల, స్థిరమైన వ్యవసాయం అనే విషయాలను ప్రముఖంగా తీసుకుంది.

3
  • రిఫైన్డ్‌ డైట్‌ కల్చర్‌కు ప్రత్యామ్నాయంగా..

మారిన జీవనశైలితో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం పెరిగి, 'రిఫైన్డ్‌ డైట్‌ కల్చర్‌'కు ప్రత్యామ్నాయంగా పోషకాలు అధికంగా ఉండే మిల్లెట్స్‌ను స్వీకరించే స్థితిలో ఆలోచిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మిల్లెట్స్‌ వినియోగంపై దృష్టి పెడుతున్నారు. ప్రకృతి ప్రేమికులు ప్రజల్లో మీడియా ద్వారా వీటిపై అవగాహన కల్పిస్తున్నారు.

  • పోషకాలు మెండు..

మిల్లెట్ల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో మన ప్రభుత్వం 2018 ఏప్రిల్‌లో మినుములను న్యూట్రి-తణధాన్యాలుగా ప్రకటించింది. వాటిలో జొన్న (జోవర్‌), పెరల్‌ మిల్లెట్‌ (బజ్రా), ఫింగర్‌ మిల్లెట్‌ (రాగి/మాండువా) మైనర్‌ మిల్లెట్‌బీ ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌ (కంగని/కాకున్‌), ప్రోసో మిల్లెట్‌ (చీనా), కోడో మిల్లెట్‌ (కోడో), బార్న్యార్డ్‌ మిల్లెట్‌ (సావా/సన్వా/ జంగోరా), లిటిల్‌ మిల్లెట్‌ (కుట్కి)లు కూడా ఉన్నాయి.

  • నాబార్డ్‌ ప్రమేయం..

గ్రామీణస్థాయిలో వ్యవసాయం, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో జాతీయ అభివద్ధి బ్యాంకుగా బాధ్యత వహించే నాబార్డ్‌ కూడా ఈ థీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది.