ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయతను సంతరించుకుంది. కాని రాజ్యం ఇంకా జాతీయ స్వభావాన్నే కొనసాగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అధికారం చెలాయించే రాజకీయ నాయకులకు, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి నడుమ ఏర్పడిన వ్యక్తిగత సాన్నిహిత్యం
ఆ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలనే నెరవేర్చుతుంది తప్ప దేశపు ప్రయోజనాలు పట్టవు. దేశపు ప్రయోజనాలు అంటే ఆ దేశంలో ఉన్న శ్రామిక జనావళి ప్రయోజనాలే. ఆ శ్రామిక జనాన్ని, వాళ్ళ సమస్యల్ని రాజకీయ నాయకులు పట్టించుకోరు.
యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బ తీసే ప్రయత్నాలకు అమెరికా పూనుకుంటోంది. అయినప్పటికీ, యూరప్ లోని రాజకీయ నాయకత్వం ఇందుకు సహకరిస్తోంది. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటన్నది ప్రస్తుతం ఒక ప్రశ్నగా ఉంది.నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్‌ను (రష్యా నుండి యూరప్‌కు రవాణా చేసే) పేల్చివేసింది అమెరికాయేనని ప్రఖ్యాత పరిశోధనాత్మక జర్నలిస్టు సైమోర్ హెర్ష్ (అమెరికాకు చెందినవాడు) అందుకు అవసరమైన సాక్ష్యాధారాలను అందించాడు. ఈ పేల్చివేతకు ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని, అమెరికన్ గ్యాస్ సరఫరాలపై యూరప్ ఆధార పడవలసిన పరిస్థితిని కల్పించడమే బైడెన్ ప్రభుత్వ ఉద్దేశ్యమని హెర్ష్ తాజాగా వెల్లడించాడు. రష్యన్ గ్యాస్ కన్నా అమెరికన్ గ్యాస్ చాలా ఎక్కువ ఖరీదు. ఐనా, రష్యన్ గ్యాస్‌ను కాకుండా అమెరికన్ గ్యాస్ సరఫరాలపై మాత్రమే యూరప్ ఆధారపడాలన్నది అమెరికా ఆలోచన. ఈ చర్య కేవలం యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థల మీద, ప్రత్యేకించి జర్మనీ ఆర్థిక వ్యవస్థ మీద దాడి. రష్యా నుండి గ్యాస్ కొనుగోలు చేసే విధానాన్ని రూపొందించింది జర్మనీయే. ఆ విధంగా చూస్తే అమెరికా నేరుగా జర్మనీ విధానాన్ని దెబ్బ తీసినట్టే ఔతుంది. అమెరికా తలపెట్టిన ఈ ఆర్థిక విద్రోహానికి జర్మనీలోని రాజకీయ నాయకత్వం వైపు నుండి రాజకీయ దౌత్య పరిభాషలోనైనా ఏ మాత్రమూ విమర్శ గాని, అభ్యంతరంగాని వ్యక్తం కాలేదు.
ఇప్పుడు జర్మనీలో అధికంగా ఉన్న గ్యాస్ ధరను అక్కడి పరిశ్రమలు భరించడం కష్టం గనుక జర్మన్ ప్రభుత్వం కొంత కాలం సబ్సిడీ ప్రకటించింది. త్వరలో ఆ సబ్సిడీకి గడువు తీరిపోనుంది. ఆ తర్వాత పెరగబోయే గ్యాస్ ధరల గురించి ముందస్తుగానే ఆంచనాకు వచ్చిన గ్యాస్ ఆధారిత ఉత్పత్తులు ఇప్పుడు జర్మనీ నుండి అమెరికాకు తరలిపోతున్నాయి. ఇంత అడ్డగోలుగా జర్మనీ ఆర్థిక వ్యవస్థను అమెరికా దెబ్బ తీస్తున్నా, జర్మన్ రాజకీయవేత్తల నుండి ఒక్క స్పందన కూడా లేదెందుకని ?
దీనికి సమాధానం పూర్తిగా రావాలంటే ఇంకా కొంత లోతుల్లోకి పోవలసి వుంటుంది. ప్రస్తుతానికి ఒక విషయం మాత్రం స్పష్టం. చాలామంది యూరోపియన్ రాజకీయవేత్తలకు అమెరికన్ బహుళజాతి దిగ్గజ కంపెనీల నుండి సొమ్ము ముడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మీద ఆధిపత్యం చెలాయించే ఆ కంపెనీలకు జాతీయ ప్రయోజనాల పట్ల ఏ మాత్రమూ ఖాతరు లేదు. ద్రవ్య పెట్టుబడి అనే గ్రంథాన్ని రచించిన రుడాల్ఫ్ హిల్ఫర్‌డింగ్ బడా బ్యాంకుల అధిపతులకు, బడా పరిశ్రమల అధిపతులకు నడుమ ఏర్పడిన వ్యక్తిగత సంబంధాలే ద్రవ్య పెట్టుబడి మీద వారికి ఆధిపత్యాన్ని చెలాయించే శక్తినిస్తాయని వివరించాడు. ద్రవ్య పెట్టుబడి మీద పెత్తనం చేసే శక్తులకు, రాజకీయ అధికారాన్ని చెలాయించే వ్యక్తులకు నడుమ కూడా ఈ మాదిరిగానే వ్యక్తిగత సంబంధాలు ఉంటాయని తెలిపాడు. ఈ సంబంధాల కారణంగానే ఆ వ్యక్తులు రాజకీయాల నుండి పరిశ్రమల్లోకి, మళ్ళీ పరిశ్రమల నుండి రాజకీయాల్లోకి, లేదా బ్యాంకుల్లోకి చాలా సులువుగా మారుతూ వుంటారు. అందువలన ప్రభుత్వం అమలు చేసే విధానం ఎప్పుడూ ద్రవ్య పెట్టుబడిని అదుపు చేసే ముఠా ప్రయోజనాలను నెరవేర్చేదిగానే ఉంటుంది.
ద్రవ్య పెట్టుబడి ఇంకా జాతీయ స్వభావాన్ని కలిగివున్న కాలంలో హిల్ఫర్‌డింగ్ తన గ్రంథాన్ని రచించాడు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయతను సంతరించుకుంది. కాని రాజ్యం ఇంకా జాతీయ స్వభావాన్నే కొనసాగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అధికారం చెలాయించే రాజకీయ నాయకులకు, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి నడుమ ఏర్పడిన వ్యక్తిగత సాన్నిహిత్యం ఆ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలనే నెరవేర్చుతుంది తప్ప దేశపు ప్రయోజనాలు పట్టవు. దేశపు ప్రయోజనాలు అంటే ఆ దేశంలో ఉన్న శ్రామిక జనావళి ప్రయోజనాలే. ఆ శ్రామిక జనాన్ని, వాళ్ళ సమస్యల్ని రాజకీయ నాయకులు పట్టించుకోరు.
గ్లోబల్ కార్పొరేట్లకు, యూరోపియన్ రాజకీయవేత్తలకు మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యానికి సంబంధించి కొట్టొచ్చినట్టు కనిపించే ఉదాహరణలు చాలానే ఉన్నాయి. జర్మనీలో క్రిస్టియన్ డెమొక్రాట్ల నాయకుడు ఫ్రెడరిక్ మెర్జ్. ఆ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నాడు. ఇతగాడు ఒక శతకోటీశ్వరుడు. అమెరికాలో ఇతడికి చాలా వ్యాపార లావాదేవీలున్నాయి. అమెరికన్ బ్లాక్ రాక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీతో సహా చాలా అమెరికన్ కంపెనీల బోర్డుల్లో డైరక్టర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశాధ్యక్షుడిగా ఉన్న ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ అంతకు మునుపు ఒక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. రాథ్‌షైల్డ్ ఫైనాన్షియల్ గ్రూప్‌లో భాగస్వామి. నెస్లే, ఫైజర్ (ఈ రెండూ బహళజాతి దిగ్గజాలు)ల మధ్య ఒక డీల్ కుదరడానికి మధ్యవర్తిగా వ్యవహరించి ఫైజర్‌కు చెందిన బేబీ ఫుడ్స్ విభాగాన్ని నెస్లే స్వాధీనం చేసుకోడానికి తోడ్పడ్డాడు మాక్రాన్.
ఇటీవల ఈ సాన్నిహిత్యం గ్రీస్‌లో బట్టబయలైంది. అక్కడ సిరిజా పార్టీ గతంలో అధికారంలోకి వచ్చింది. వామపక్ష పార్టీగా దానికి పేరు. ప్రస్తుతం అది గ్రీస్‌లో అతి పెద్ద ప్రతిపక్షం. గోల్డ్‌మాన్ సాక్స్ ఒక పెద్ద అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్. దానిలో అధికారిగా పని చేసిన స్టెఫానోస్ కాస్సెలెకిస్ ఇప్పుడు సిరిజా పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యాడు. ఈ కాస్సెలెకిస్‌కి గతంలో ఎటువంటి రాజకీయ అనుభవమూ లేదు. గ్రీస్ దేశపు సమస్యలేవీ అతగాడికి తెలియవు. వామపక్ష సిద్ధాంత భావజాలంతో అతడికేమాత్రమూ పరిచయం లేదు. ఎన్నిక సమయంలో అతడు ఏ సమస్యనూ ముట్టుకోలేదు. ఇతగాడిని ఎన్నుకోడానికి వీలుగా సిరిజా పార్టీ నిబంధనావళినే సవరించారు. స్వల్పకాల వ్యవధిలోనే ఎవరైనా సిరిజా పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చునని, ఏ పదవికైనా పోటీ చేయవచ్చునన్నది ఆ సవరణ సారాంశం. ఇక కాస్సెలెకిస్ గ్రీస్ దేశానికి ఎప్పుడైనా ప్రధాని అయ్యే వీలుంది. అసలు ఆ పాయింటు మీదే సిరిజా పార్టీ నాయకత్వ ఎన్నికలు జరిగాయి.
యూరోపియన్ రాజకీయవేత్తలుగా ముందుకొస్తున్న కొత్త తరహా నాయకులు అమెరికన్ కంపెనీలలో కార్యనిర్వాహక బాధ్యతలను నిర్వహించినవారు కావడం, తమ మాతృసంస్థల ప్రయోజనాలను కాపాడడం కోసం వాళ్ళు తమ రాజకీయ పదవులను ఉపయోగించడం, ఆ క్రమంలో తమ దేశ ప్రయోజనాలను సైతం బలి చేయడం కనిపిస్తోంది. అంతకన్నా కీలకం ఏమంటే, వాళ్ళకి అసలు జాతీయ ప్రయోజనాలు అన్నవే పట్టకపోవడం. జాతీయ ప్రయోజనాల గురించి ఏ మాత్రమూ పట్టించుకోకుండా, కేవలం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలను నెరవేర్చడమే తమ పనిగా వాళ్ళు భావిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనాన్ని రాజకీయంగా సమర్ధించే పనిలో వాళ్ళున్నారు. ఆ పెత్తనం కొనసాగాలంటే సామ్రాజ్యవాద దేశాల నడుమ ఐక్యత కొనసాగడం ముఖ్యం అని వాళ్ళు భావిస్తున్నారు. అందుచేత తమ తమ దేశాల ప్రయోజనాల కన్నా అట్లాంటిక్ మహా సముద్రానికి రెండువైపులా ఉన్న దేశాల మధ్య (సామ్రాజ్యవాద దేశాల మధ్య) ఐక్యతకు వాళ్ళిస్తున్న ప్రాధాన్యత అంతకు ముందటి తరం యూరోపియన్ దేశాల నాయకులిచ్చిన ప్రాధాన్యతకన్నా చాలా ఎక్కువ.
ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాలలో కొత్త రకం రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు. వీళ్ళు ఫాసిస్టు శక్తుల పరిధికి వెలుపలే ఉంటారు. ఈ తరహా నాయకులలో టోనీ బ్లెయిర్ తొలి తరం వాడు. ఇలాంటివాళ్ళు అటు కార్పొరేట్ ప్రపంచానికి, ఇటు రాజకీయ ప్రపంచానికి మధ్య అటు, ఇటు మారుతూంటారు. నయా ఉదారవాదానికి పూర్తిగా కట్టుబడి వుండడం, శ్రామికవర్గం పట్ల తీవ్ర శత్రుత్వం ప్రదర్శించడం-ఇదే వీళ్ళ సిద్ధాంతం. వాళ్ళు వామపక్ష పార్టీలో ఉన్నా, వామపక్ష-మధ్యేవాద పార్టీలో ఉన్నా, వాళ్ళ తీరు అదే. టోనీ బ్లెయిర్ ''లేబర్ పార్టీ'' ప్రధానమంత్రి. ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఒక ''సోషలిస్టు'' ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా గతంలో పని చేశాడు. ఇప్పుడు కాస్సెలెక్కిస్ ఒక వామపక్ష పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యాడు. వీళ్ళెవరికీ, తమ తమ దేశాల ప్రయోజనాలు ఏ మాత్రమూ పట్టవు.
గతంలో దేశాధినేతలుగా వ్యవహరించిన డిగాల్, విల్లీ బ్రాండ్ట్ వంటి వారికి, వీళ్ళకి ఏ మాత్రమూ పోలిక లేదు. గతకాలపు నేతలు వారి వారి సైద్ధాంతిక భావజాలం ఏమైనప్పటికీ, అమెరికాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, తమ దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యతనిచ్చారు. వాళ్ళు పూర్తిగా రాజకీయ నేపథ్యం నుండి వచ్చినవాళ్ళు. వాళ్ళున్న కాలంలో ద్రవ్య పెట్టుబడి ఇంకా అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకోలేదు.
ప్రస్తుతం నయా ఉదారవాద విధానాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అందుచేత సామ్రాజ్యవాద శక్తుల నడుమ ఐక్యత బలంగా ఉండడం కొత్త తరహా నాయకులకి అత్యవసరంగా మారింది. సంపన్న పెట్టుబడిదారీ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేసే బహుళధృవ స్వభావం ఎక్కడ వ్యక్తం అయినా అది వీళ్ళకి పెను ముప్పుగానే కనిపిస్తుంది. దానినుండి తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. తమ తమ దేశాల్లో కాని, మూడవ ప్రపంచ దేశాల్లో కాని కార్మికవర్గ ఉద్యమాల నుండి ఎదురయ్యే సవాలు వారి దృష్టిలో ఎంత ప్రమాదకరమో, ఈ సంక్షోభ కాలంలో సామ్రాజ్యవాద దేశాల నడుమ ఏ పొరపొచ్చాలూ లేకుండా చూసుకోవడం కూడా వాళ్ళకి అంతే ముఖ్యం.
ఈ తరహా నాయకులు ఆ యా దేశాల ప్రయోజనాలను పట్టించుకోకపోవడం వలన ఆ సంపన్న దేశాలలో ఫాసిస్టు శక్తులు బలపడడానికి అవకాశాలు పెరుగుతాయి. ఫాసిస్టు శక్తులు ఇప్పుడు కూడా ''జాతీయ ప్రయోజనాలు'' అంటూనే మాట్లాడతాయి. ఆ మాటల ముసుగులో కార్మిక వర్గాన్ని ఆకర్షిస్తాయి. ఒకసారి అధికారంలోకి వచ్చాక వాళ్ళు అనుసరించే ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానాలు జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్లకు అనుగుణంగానే ఉంటాయి. ఇప్పుడు ఇటలీలో మెలొనీ చేస్తున్నదిదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పెద్దగా గోల చేస్తూ తామే దేశ రక్షకులమన్నట్టు పోజు పెడతారు.
ఈ పరిస్థితి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఎటునుంచి చూసినా, అనుకూలమే అయింది. అటు ఉదారవాద బూర్జువా పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఇటు ఫాసిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఢోకా ఏమీ ఉండదు. జాతీయ ప్రయోజనాలను పట్టించుకోకుండా వదిలేసే ఉదారవాద బూర్జువా పార్టీలనో, లేకపోతే, ఫాసిస్టు పార్టీలనో-ఈ రెండు కూటములలో ఏదో ఒకదానిని ఎంచుకోవడం వినా ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇప్పుడు యూరప్ లో ఫాసిస్టు పార్టీలు తమ తమ దేశాల్లోకి వలసలు వస్తున్న ఇతర దేశాల శరణార్ధుల్ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దురభిమానాన్ని రెచ్చగొడుతున్నారు. ఆ దేశాల్లోని శ్రామిక ప్రజలు తమ కష్టాలకు కారణం ఆ శరణార్ధులే అని భావించేలా ప్రచారం సాగిస్తున్నారు.
అటు కార్పొరేట్-రాజకీయ నేతల నుండి, ఇటు ఫాసిస్టు పార్టీల నుండి తమ దేశ ప్రయోజనాలను, శ్రామిక వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని సవాలు చేయడం ఇప్పుడు సిసలైన వామపక్ష పార్టీల ముందున్న కర్తవ్యం.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్