Sep 24,2022 06:56

        భారతదేశమంటే ఆ ఇద్దరు కార్పొరేట్‌ మిత్రులనేన్న రీతిలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న వినాశకర విధానాల వల్ల అసమానతలు హద్దేలేకుండా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగియున్న వ్యక్తుల జాబితాలో అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్‌ అదానీ రెండో స్థానంలోకి చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడిగా పేరుగాంచిన అదానీ 155.7 బిలియన్‌ డాలర్ల నికర సంపదను పోగేసుకొని ఈ స్థానానికి చేరుకున్నారు. కళాశాల చదువును మధ్యలోనే ఆపేసిన ఆయన తొలుత వజ్రాల ట్రేడింగ్‌ చేశారని, ఆ తర్వాత అంతై ఇంతై.. అన్న చందంగా అదానీ ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయాడంటూ కార్పొరేట్‌ మీడియా కీర్తిస్తున్నా.. ఆయన ఆస్తులు అమాంతం పెరిగింది బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతేనన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. 2020 నుంచే ఆయనకు చెందిన షేర్లు 1000 శాతానికి పైగా లాభాలు ఆర్జించాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అవతరించిన అదానీ, ఏప్రిల్‌ కల్లా తన సంపద 100 బిలియన్‌ డాలర్లకు చేరిపోవడంతో మైక్రోసాఫ్ట్‌ అధిపతి బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానానికి చేరారు. ఇప్పుడు జెఫ్‌ బెజోస్‌, బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ను అధిగమించి రెండో స్థానం చేరారు. ఇక రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కూడా ప్రపంచ కుబేరుల జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు. వీరద్దరి ఆస్తులు కలిపి దేశంలోని అగ్రశ్రేణి కుబేరుల మొత్తం ఆస్తుల్లో 59 శాతం ఉన్నట్లు తేలింది. దేశంలో సంపద కేంద్రీకరణ ఎంత తీవ్రంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 141 కోట్ల జనాభాలో దేశ సంపదంతా కొద్ది మంది వ్యక్తుల చేతిల్లోనే కేంద్రీకృతమైపోతే మిగిలిన జనాభాకు మిగిలేదేముంటుంది? ఆకలి చావులు..ఆర్థిక భారాలు భరించలేక అసువులు బాస్తున్న అభాగ్యుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోదంటే దానికి అసలు కారణం సంపద కేంద్రీకరణే.
        ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావాలతో అప్పటికే కొట్టుమిట్లాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ కోవిడ్‌ నేనథ్యంలో మరింతగా చితికిపోయింది. లక్షలాది పరిశ్రములు మూతపడి, చిరువ్యాపారాలు అతలాకుతలమై, వ్యవసాయం అగమ్యగోచరమై కోట్లాది మంది ప్రజానీకం ఉపాధి లేక పెను సంక్షోభంలోకి కూరుకుపోయారు. కోవిడ్‌ ఆంక్షలు తొలగి బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న సామాన్య జనావళిని ఆర్థిక భారాలు అడుగు ముందుకేయనీయడం లేదు. ద్రవ్యోల్బణం కోరలు చాచడంతో అమాంతం పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు ప్రజలను బలవంతంగా పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. దేశంలోని 99 శాతం ప్రజలది ఇదే దుస్థితి. మిగిలిన ఒక శాతంగా ఉన్న అదానీ, అంబానీ, బిర్లాల వంటి శతకోటీశ్వర్లు మాత్రం కోవిడ్‌ సంక్షోభంలోనూ కోటానుకోట్లకు పడగలెత్తడం..అనునిత్యం మోడీ సర్కార్‌ ఎవరి ప్రయోజనం కోసం 'పని' చేస్తుందో తేటతెల్లం అవుతోంది. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో బ్రిటన్‌ను తలదన్నేసి భారత్‌ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని బ్లూమ్‌బర్గ్‌ సంస్థ ఈ నెలారంభంలో ఒక నివేదిక విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో భారత్‌..బ్రిటన్‌ను అధిగమించినా..ప్రజల ఆర్థిక పరిస్థితిలో మార్పు లేనంత కాలం ఆ వృద్ధి వల్ల ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. ఏడాదిలో బ్రిటన్‌ తలసరి ఆదాయం 45 వేల డాలర్లుండగా..భారత తలసరి ఆదాయం 2 వేల డాలర్లు మాత్రమే. జిడిపిలో అదానీ, అంబానీల వాటా కొన్ని దేశాల జాతీయ సగటు జిడిపిలను మించిపోయిందంటే దేశంలో సామాన్యుల జిడిపి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తోంది. పొట్ట నింపే వేతనాలు కూడా అందకపోవడం, అప్పులు ఇచ్చే నాథుడూ కరువైపోవడంతో మాయదారి రుణ యాప్‌లకు సామాన్యులు బలైపోతున్నారు. వ్యక్తిగత అవసరాలు కోసమే చిన్నచిన్న రుణాలు తీసుకొని వాటిని కూడా కట్టలేక జనం ప్రాణాలు తీసుకునే దుస్థితి నెలకొందంటే దానికి ప్రధాన కారణం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలే. శ్రమజీవుల సంపదను మొత్తం కొల్లగొట్టి కార్పొరేట్‌ మిత్రులకు పంచిపెడుతున్నందునే ఈ దుస్థితి. మౌలిక సదుపాయాలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధానంగా పోర్టులను, విమానశ్రయాలను, భారీ పరిశ్రమలను అదానీలకు, అంబానీలకు, దేశ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నందునే అసమానతలు ఇంతలా పెరిగిపోవడానికి కారణం. మోడీ సర్కార్‌ అవలంబిస్తున్న ఈ దుర్మార్గపు విధానాలను అడ్డుకుంటేనే దేశానికి రక్షణ.