Feb 24,2023 07:13

           దేశీయ బీమా రంగ ప్రయోజనాల కోసం బీమా ప్రీమియంపై జిఎస్‌టి భారాన్ని తగ్గించమని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ (మొత్తం దేశీయ జీవిత బీమా కంపెనీల సమాఖ్య) గత కొన్నేళ్లుగా మొర పెట్టుకుంటున్నా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఏమాత్రం కరుణించలేదు. తాజా జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశాల్లో పెన్సిల్‌ షార్ప్‌నర్లపై మాత్రం జిఎస్‌టిని 18 శాతం నుండి 12 శాతానికి తగ్గించారు. ఏడాదికి లక్షల కోట్ల రూపాయలు బీమా రంగం నుండి ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో అందుతున్నా, బీమా రంగ విన్నపాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.
          విలాస వస్తువులైన బంగారంపై 3 శాతం, నగిషీ చెక్కిన డైమండ్లపై 0.25 శాతం పన్ను విధిస్తూ, ప్రాణాధార మందులు, ప్రాణవాయువుపై 12 నుండి 18 శాతం జిఎస్‌టి భారమా!! ప్రజలకు సామాజిక భద్రత, ఆరోగ్య బీమా సేవలు అందిస్తున్న బీమా రంగంపై 18 శాతం జిఎస్‌టినా!! ప్రపంచంలో ఏ దేశంలో కూడా సామాజిక భద్రతపై 18 శాతం పన్ను లేదు. ప్రజల పొదుపుపై పన్ను, మందులు, సామాన్యులు వాడే ఆహార పదార్థాలు, వస్తువులపై అధిక జిఎస్‌టి విధించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి !!
          2021-22లో జీవిత బీమా పరిశ్రమ నుండి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు రూ.49,52,187 కోట్లు కాగా, అందులో ఒక్క ఎల్‌ఐసి (రూ.36,79,475కోట్లు) వాటా 74.3 శాతం ఉంది. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో మొత్తం బీమా పరిశ్రమ రూ.18,94,074 కోట్లు పెట్టుబడులు పెట్టగా, అందులో ఎల్‌ఐసి వాటా రూ.15,40,381 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రాజెక్టులలో మొత్తం బీమా పరిశ్రమ రూ.10,79,100 కోట్లు పెట్టుబడులు పెట్టగా, అందులో ఎల్‌ఐసి వాటా రూ.10,04,957 కోట్లు ఉంది.
           ఎల్‌ఐసి ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ. లక్షల కోట్ల పెట్టుబడులు అందుతున్నాయి. ప్రభుత్వ అంతర్గత నిధుల సమీకరణలో ఎల్‌ఐసి వాటా 25 శాతం పైబడి ఉంది. 31 మార్చి 2022 నాటికి ఎల్‌ఐసి రూ.36 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రజా సంక్షేమానికి అందించింది. ఇందులో రూ.26.86 లక్షల కోట్ల పైబడి నిధులను కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలలో, హౌసింగ్‌, నీటిపారుదల సౌకర్యాల కల్పన కోసం ఎల్‌.ఐ.సి కేటాయించింది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (1 ఏప్రిల్‌ 2012 నుండి 31 మార్చి 2017 వరకు) రూ.14,23,055 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌.ఐ.సి సమకూర్చింది. 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (1 ఏప్రిల్‌, 2017 నుండి 31 మార్చి 2022) దాదాపు రూ.28 లక్షల కోట్ల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసి అందించింది. దేశ అంతర్గత వనరుల సమీకరణలో ఎల్‌.ఐ.సి వాటా 25 శాతం పైమాటే. 99 శాతం పైబడి క్లెయిమ్‌లను పరిష్కరించడం ద్వారా ఎల్‌ఐసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి 2 కోట్ల పైబడి క్లెయిమ్స్‌ చెల్లించి ప్రపంచంలోనే క్లెయిమ్‌ పరిష్కారంలో అత్యుత్తమ బీమా సంస్థగా పేరొందింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశీయ జీవిత బీమా పరిశ్రమ 15.87 లక్షల డెత్‌ క్లయిములు పరిష్కరిస్తే, అందులో ఒక్క ఎల్‌ఐసి సంస్థనే 13.49 లక్షల డెత్‌ క్లైములను (రూ.28,408 కోట్ల మొత్తాన్ని) పరిష్కరించింది.
        బీమా ప్రీమియమ్‌లపై పన్ను భారాన్ని తగ్గిస్తే ఎల్‌ఐసి సంస్థ పాలసీదారులకి ఇంకా మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు అందించగలదు. పాలసీదారులు కూడా మరింత ఉత్సాహంతో పాలసీలు తీసుకునే అవకాశం ఉంది. 'స్విస్‌ రే' అనే సంస్థ అంచనాల ప్రకారం 2032 కల్లా భారత్‌ ప్రపంచంలో 6వ అతి పెద్ద బీమా మార్కెట్‌గా ఎదగనుంది. 2021లో కోవిడ్‌ మహమ్మారి దెబ్బకు మన దేశంలో 22.5 శాతం ఆరోగ్య బీమా ప్రీమియమ్‌లు పెరిగాయి. 2022లో ఆర్థిక వ్యవస్థ కోవిడ్‌ తదనంతర పరిస్థితుల నుంచి కోలుకున్నాక, మోటార్‌ ప్రీమియమ్‌లు సైతం దాదాపు 2.9 శాతం పైబడి పెరిగాయి. మరి ఆరోగ్య బీమాపై, థర్డ్‌ పార్టీ ప్రీమియంపై 18 శాతం పన్ను భారం మోపడం, ప్రజలు తమకు తాము కల్పించుకునే సామాజిక భద్రతపై భారం వేయడం కాదా!!
         2047 కల్లా ప్రతీ పౌరునికి బీమా సౌకర్యం కల్పించాలనే నినాదాన్ని బీమా నియంత్రణ సంస్థ (ఐఅర్‌డిఏ) ఇచ్చింది. ఇది సాకారం కావాలంటే దేశంలో ఉన్న 44 కోట్ల మిల్లెన్నియల్స్‌ (యువ ఉద్యోగులు)ను జీవిత బీమా పరిశ్రమ ఆకర్షించాలి. మరి అలా జరగాలంటే, బీమా ద్వారా చేసే పొదుపు ఆకర్షణీయంగా ఉండాలి. బీమా పొదుపుపై ఇంతంత భారాలు మోపితే అది సంస్థకూ, పాలసీదారులకు భారం కాదా? సహేతుకమైన అంశంపై ఎవరినైనా ప్రశ్నించే సంస్కృతి మనది. దేశీయ బీమా రంగం నుంచి దేశ సర్వతోముఖాభివృద్ధి పేరుతో ఏడాదికి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులను జుర్రుకుంటున్న ప్రభుత్వాన్ని 40 కోట్ల పాలసీదారులు నిలదీయాల్సిన అవసరం ఉందా? లేదా? ఎఐఐఇఎ, ఏజెంట్ల సంఘాలు ఇప్పటికే అనేక ఉద్యమాల, పోరాటాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. బీమా ప్రీమియంపై అన్యాయంగా మోపుతోన్న జిఎస్‌టి భారం తగ్గించాలని బీమా రంగ ఉద్యోగులు, ఏజెంట్లు, పాలసీదారుల సహకారంతో సమరశీల పోరాటాలు భవిష్యత్‌లో కూడా కొనసాగించవలసి ఉంది.

/వ్యాసకర్త : ఎఐఐఇఎ ఉపాధ్యక్షులు, సెల్‌: 9441797900 /
పి. సతీష్‌

పి. సతీష్‌