
విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించవద్దని కోరుతూ మహారాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్మికులు, ఇంజనీర్లు చేపట్టిన 72 గంటల సమ్మె విజయవంతం కావడం హర్షణీయం. దాదాపు గడచిన ఏడాది కాలంగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా వాటిని లెక్క చేయకుండా ప్రభుత్వం మొండిగా ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గనందున విద్యుత్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం పరిష్కరించే దిశగా కాకుండా కక్ష సాధింపు వైఖరితో నిరంకుశ ఎస్మా చట్టాన్ని అమలు చేసినా ఉద్యోగులు, కార్మికులు దాన్ని లెక్క చేయకుండా సమ్మెలో పాల్గొనడం వారి పట్టుదలకు నిదర్శనం. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ సంస్థలకు చెందిన సిబ్బంది అందరూ సమ్మె బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ కంపెనీలకు చెందిన 86వేల మంది కార్మికులు, ఇంజనీర్లు, 42 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. కార్మిక పోరాటానికి ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రయివేటీకరణ చేయబోమని, ఉద్యోగుల, కార్మికుల సంక్షేమానికి హాని చేసే ఏ చర్యలూ తీసుకోబోమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. దాంతో ఉద్యోగులు, కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి వెళ్లారు. ఈ సమ్మె డిమాండ్లలో ఏదీ ఆర్థిక పరమైనది కాదు. కేవలం ప్రయివేటీకరణను ప్రతిఘటించడమే! మహారాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం.
డిస్కాములను ప్రయివేటీకరించాలంటే ముందు వాటిని నష్టాల బాట పట్టించాలన్నది విద్యుత్ సంస్కరణల సమర్ధకుల పథకం. దాని ప్రకారమే నవీ ముంబయిలోని భాండూప్ సర్కిల్‌లో ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ సేవలందిస్తుండగా అక్కడ సమాంతరంగా అదానీ గ్రూపునకు చెందిన డిస్కాముకు పంపిణీ లైసెన్సు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ కుట్రకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపిచ్చాయి. ఆ కంపెనీకి విద్యుత్ పంపిణీ సేవల్లో ఎలాంటి అనుభవం లేదని వారు వివరించారు. ప్రజలు, కార్మికులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అదానీ కోరల నుండి మహారాష్ట్ర విద్యుత్ సంస్థను కాపాడుకోవడానికి సమ్మెకు దిగడం తప్ప మరో మార్గం లేదని కార్మికులు, ఉద్యోగులూ ఇంజనీర్లు ఏకగ్రీవంగా నిర్ణయించారు. 32 సంఘాలు ఏకతాటిపైకి రావడం బహుదా అభినందనీయం. సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావంగా మహారాష్ట్రలో అనేక రంగాలకు చెందిన కార్మికులు, ప్రజలు వివిధ కార్యాచరణల్లో పాల్గొన్నారు. భారత పెట్రోలియం, గ్యాస్ కార్మికుల సమాఖ్య సమ్మె చేస్తున్న మహారాష్ట్ర విద్యుత్ సిబ్బందిని అభినందించింది. పెట్రోలియం, గ్యాస్ రంగం కూడా ఇదే రీతిన ప్రైవేటీకరణ దాడులను ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది ఇబ్బందులను తాము అర్ధం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. ఇలా ఎన్నో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగ సంఘాలు సంఘీభావం తెలిపాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ప్రదర్శనలు, సభలు జరిపి మహారాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడం కూడా ఆ సర్కారు వెనక్కు తగ్గడానికి దోహదపడింది.
గతంలో హర్యానా సర్కారు కూడా డిస్కాముల ప్రయివేటీకరణకు పూనుకోగా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించడం, చివరికి సమ్మె చేశాకనే ప్రభుత్వం వెనక్కు తగ్గడం చూశాం. అలాగే ఉత్తర ప్రదేశ్‌వంటి రాష్ట్రాల్లోనూ విద్యుత్ ఉద్యోగుల పోరాటాలు విజయవంతమయ్యాయి. విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగ విధ్వంసం జరుగుతోంది. గతంలో విద్యుదుత్పత్తి (జనరేషన్)లో ప్రయివేటు వాటా అధికంగా వుంది. పంపిణీని ప్రయివేటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ ఒత్తిడి చేస్తోంది. ఆర్‌డిఎస్‌ఎస్ వంటి పథకాల మాటున ఆశ కూడా చూపిస్తోంది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రయివేటు డిస్కాములకు లైసెన్సుల మంజూరు, స్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్ల ఏర్పాటువంటి చర్యలకు పాల్పడుతోంది. చైతన్యవంతమైన కార్మికవర్గం మహారాష్ట్రలో మాదిరిగా ఉద్యమించాలి. విద్యుత్ వినియోగదారులగా యావత్ ప్రజానీకం కూడా ఆయా ఉద్యమాల్లో పాల్గొని సర్కారు కుట్రల్ని తిప్పికొట్టాలి.