- అప్పటి వరకూ చంద్రబాబును అరెస్టు చేయొద్దు : సుప్రీంకోర్టు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:ఫైబర్‌నెట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను నవంబరు 8వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే వ్యక్తిగత అవసరాల రీత్యా 9వ తేదీన విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరిన నేపథ్యంలో రెండు రోజుల్లో ఏదో ఒకరోజు విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. మేరకు చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. చంద్రబాబు తరపున లూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం తరపున రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, ఒకదానికి సంబంధించి తీర్పు రిజర్వు అయిందని, ఫైబర్‌నెట్ కేసులో అరెస్టు చేయొద్దని ఇప్పటికే చెప్పారని లూథ్రా తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరపున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదిస్తూ.. కస్టడీలో ఉండగా మరలా అరెస్టు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు నవంబరు 8వ తేదీకి కేసును వాయిదా వేసింది. అయితే తన వ్యక్తిగత ఇబ్బంది రీత్యా 9వ తేదీన విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. అలాగే ముందుగా స్కిల్ డెవలప్‌మెంటు కేసులో తీర్పు వెలువరిస్తామని, తర్వాత ఫైబర్‌నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. అప్పటి వరకూ ఫైబర్‌నెట్ కేసులో ఎటువంటి అరెస్టులు చేయొద్దని ఆదేశించింది. ఇదే కేసులో తన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
- ములాఖత్ పెంపు పిటిషన్ తిరస్కరణ
చంద్రబాబును కలిసేందుకు రోజుకు మూడు ములాఖత్‌లు, అదీ 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకూ ఇప్పించాలని ఎసిబి కోర్టులో ఆయన తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎసిబి కోర్టు తిరస్కరించింది. న్యాయవాదులకు రోజుకు రెండుసార్లు ఇచ్చే ములాఖత్‌ను జైలు అధికారులు ఒకటికి కుదించారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎసిబి కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో రోజుకు మూడు ములాఖత్‌లు ఇప్పించాలని అందులో కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
- 26కు కాల్ కేటా కేసు వాయిదా
విచారణ అధికారుల కాల్ డేటా, రికార్డులు ఇవ్వాలని చంద్రబాబు తరపున దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఎసిబి కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే సిఐడిని కోర్టు ఆదేశించింది. వారు సమయం కావాలని కోరడంతో ఈ నెల 26కు వాయిదా వేసింది.