Jul 22,2022 06:38

రైతుల ఆందోళన తర్వాత అన్ని మండలాల్లో అవగాహనా సదస్సులు నిర్వహించారు. రైతులు మాత్రం తమకు పరిహారం సంగతి తేల్చే వరకు పనులు చేపట్టవద్దని అధికారులను నిలదీసి నినదించారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రైవేట్‌ మార్కెట్‌ విలువకు అనుగుణంగా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతులకు పరిహారం పెంచి న్యాయం చేయాలి.

    గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పేరుతో చేస్తున్న భూసేకరణ కారణంగా రైతులు సారవంతమైన పచ్చని పంట పొలాలను కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి ఆంధ్రప్రదేశ్‌ లోని దేవరపల్లి వరకు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణం చేస్తున్నారు. హైవే నిర్మాణం కోసం భూములు సేకరిస్తున్నట్లు ప్రభుత్వం 2018లో ప్రకటించింది. అప్పటి నుండి భూసేకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికి 98 శాతం భూ సేకరణను పూర్తి చేశారు. ఏలూరు జిల్లా పరిధి లోని చింతలపూడి, టీ నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో 31 గ్రామాలలో 1500 మంది రైతులకు సంబంధించిన 1100 ఎకరాలు భూ సేకరణ చేశారు. సారవంతమైన భూములు మరియు ఉద్యాన, వ్యాపార పంటలు పండే భూములు కావడంతో ఇక్కడ ఎకరాకు ప్రైవేట్‌ మార్కెట్‌ విలువ రూ.40 లక్షల నుండి రూ.50 లక్షల వరకు ఉంది. అలాంటి భూములకు రూ.14 లక్షల నుండి రూ.22 లక్షల వరకు పరిహారం ఇచ్చారు. ఒక్క దేవరపల్లి మండలంలో బేసిక్‌ రిజిస్ట్రేషన్‌ విలువ ఎక్కువ ఉండడంతో అక్కడ మాత్రమే రూ.37 లక్షల వరకు పరిహారం అందింది.
     భూసేకరణను 2013 భూ సేకరణ చట్టం ప్రకారం చేపట్టాల్సి ఉంది. ఈ చట్టంలో ఉన్న అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని రైతులకు, ప్రజలకు భూసేకరణ అవసరాన్ని తెలియజేసి ప్రభుత్వ అవసరాలకైతే 70 శాతం మంది, ప్రైవేటు అవసరాలకైతే 80 శాతం మంది ప్రజలు, రైతుల ఆమోదం పొందాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత గ్రామాలలో ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించలేదు. 2019లో జంగారెడ్డిగూడెంలో పర్యావరణంపై మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ సభను నిర్వహించారు. ఆ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు తమ గోడు విన్నవించుకున్నా కనీసంగా కూడా పట్టించుకోలేదు. భూసేకరణ అధికారులు మాత్రం-జాతీయ రహదారి నిర్మాణం కోసం రైతులు భూములు ఇవ్వడం అనివార్యం. మీరు భూములు ఇవ్వకపోయినా బలవంతంగా తీసుకుంటాం-అని భయపెట్టి భూములు లాక్కున్నారు. కరోనా సమయంలో అనేక నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి అధికారులు భూసేకరణ చేశారు. రైతులకు భూ సేకరణ అవార్డులో ఉన్న అంశాలను కనీసంగా చెప్పలేదు. ఎంత పరిహారం వస్తుందో చాలామంది రైతులకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన హామీ ఒకటైతే...దాన్ని తుంగలో తొక్కి...తక్కువ పరిహారం ఇచ్చి రైతులకు అధికారులు తీవ్ర అన్యాయం చేశారు.
     భూ సేకరణలో ప్రైవేట్‌ మార్కెట్‌ విలువకు అనుగుణంగా పరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ 2018 నుండి పోరాటం చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతులు ఈ పోరాటం చేయగా అప్పటి ప్రభుత్వం...ప్రజా ప్రతినిధులు, రైతులతో చర్చలు జరిపి చేతులెత్తేసింది. ఆ సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి నాయకులు రైతులు పోరాటానికి మద్దతు ఇచ్చి మేం అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని నమ్మబలికారు. ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేలు-గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణం ఒక అభివృద్ధి కార్యక్రమం. ఇచ్చిన పరిహారం సరిపెట్టుకోండి-అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. అధికారంలో ఉండగా ఒక మాట. ప్రతిపక్షంలో ఉండగా మరొక మాటగా టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి వైఖరి ఉంది. మరోవైపు తెలంగాణలో రైతులకు పరిహారం పెరిగేలా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బేసిక్‌ రిజిస్ట్రేషన్‌ విలువ రూ.2 లక్షలు ఉంటే ఆ విలువను రూ. 7.5 లక్షలు వరకు పెంచి పరిహారం ఇచ్చారు. 2013 భూసేకరణ చట్టం యథావిధిగా అమలు చేయకుండా రాష్ట్రాలకు అధికారం ఇవ్వడంతో పరిహారం ఇచ్చే విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కొక్క విధంగా నిర్ణయించుకుంది. తెలంగాణలో బేసిక్‌ రిజిస్ట్రేషన్‌ విలువకు 1.5 రెట్లు కాగా 100 శాతం సోలాషియం ఇవ్వాల్సి ఉండగా రైతుకు పరిహారం మూడు రెట్లుగా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్‌ లో బేసిక్‌ రిజిస్ట్రేషన్‌ విలువకు 1.25 రెట్లు కాగా 100 శాతం సోలాషియంతో 2.5 రెట్లుగా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులు నష్టపోతున్నారు. అలాగని నేటి వైయస్సార్‌సిపి ప్రభుత్వం భూ నిర్వాసిత రైతులకు చట్టంలో మార్పులు చేసి న్యాయం చేసే చర్యలు చేపట్టడం లేదు. సర్వం కోల్పోతున్న రైతులను గాలికి వదిలేస్తున్నారు. ఇలావుండగా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతుల అకౌంట్లకు పరిహారం జమ చేశారు. తీరా తక్కువ పరిహారం రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఆర్బిట్రేషన్‌ పిటిషన్లు దాఖలు చేసుకోమంటున్నారు. ఆర్బిట్రేషన్‌ పిటిషన్లు దాఖలు చేసినా విచారణ ప్రారంభించడం లేదు. హైవే నిర్మాణ పనులైతే ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులను అన్ని మండలాల్లో రైతులు అడ్డుకున్నారు. తమకు పరిహారం పెంచకపోతే హైవే నిర్మాణం చేయవద్దని రైతులు పోరాడుతున్నారు. జూన్‌ 17న చింతలపూడి మండలం రాఘవాపురంలో గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో కార్యాచరణ రూపొందించుకొని మండల తహసీల్దార్‌ కార్యాలయాలు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి జూన్‌ 29న ఏలూరు చలో కలెక్టరేట్‌ మహా ధర్నా నిర్వహించారు. ఈ పోరాటంతో అధికారులలో కదలిక వచ్చింది. జులై 1న ఏలూరు జిల్లా కలెక్టరేట్‌ లో జిల్లా కలెక్టర్‌ రైతులతో సమావేశం నిర్వహించారు. పరిహారంతో పాటు ఇతర అనేక సమస్యలను రైతులు ఏకరవు పెట్టారు. పంట భూముల మధ్య నుంచి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణం చేయడం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. భూమి ఒకవైపు విద్యుత్‌ మోటార్‌ మరోవైపుకు రావడంతో పంటలకు సాగునీరు అందే పరిస్థితి లేదు. చాలామంది రైతులు వ్యవసాయ పంపుసెట్లను కోల్పోయారు. మిగిలిన భూమికి సాగు నీరు అందే పరిస్థితి లేదు. పొలాలకు వెళ్లే పుంత దారులు మూసివేయబడతాయి. సర్వీస్‌ రోడ్లు లేవు. ఉన్న చోట్ల మాత్రం గ్రావెల్‌ రోడ్లు వేస్తారు. అండర్‌ పాస్‌ల నిర్మాణం అన్ని చోట్లా లేవు. ఈ ప్రాంతంలో ఆయిల్‌ పామ్‌, కొబ్బరి, చెరకు, టేకు, పండ్ల తోటలు తదితర విలువైన పంటలు కోల్పోతున్నారు. వీటికి తగిన పరిహారం కూడా నిర్ణయించలేదు. రైతుల ఆందోళన తర్వాత అన్ని మండలాల్లో అవగాహనా సదస్సులు నిర్వహించారు. రైతులు మాత్రం తమకు పరిహారం సంగతి తేల్చే వరకు పనులు చేపట్టవద్దని అధికారులను నిలదీసి నినదించారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రైవేట్‌ మార్కెట్‌ విలువకు అనుగుణంగా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతులకు పరిహారం పెంచి న్యాయం చేయాలి. లేని పక్షంలో భూ నిర్వాసిత రైతులకు పోరాటమే మార్గం.

/ వ్యాసకర్త : ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి/
కె. శ్రీనివాస్‌

కె. శ్రీనివాస్‌