Jun 16,2023 06:55

           2023-24 సంవత్సరం ఖరీఫ్‌ సీజనుకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పి)ను మోడీ ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన ప్రకటించింది. రైతులు తాము పండించిన పంటలకు సరైన ప్రోత్సాహక ధరలు అందుకునేలా, పంటల్లో వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అటు న్యాయంగానూ లేవు, ఇటు ప్రోత్సాహకరంగానూ లేవు. రైతుల ఆశలను దెబ్బతీసేలా, వారి ఆదాయాలకు పెద్ద ఎత్తున నష్టం సంభవించేలా వున్నాయి. రైతులు వివిధ రకాల పంటలు వేసేలా వైవిధ్యతను ప్రోత్సహించడం మాట అటుంచి, అసలు వ్యవసాయంలో రైతులు పెట్టుబడులు పెట్టకుండా వుండేలా నిరుత్సాహాన్ని కలగచేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా రైతుల ఆదాయాలు రెట్టింపు కావడానికి బదులుగా పెరుగుతున్న ఉపకరణాల వ్యయానికి తోడు అన్యాయంగా వున్న కనీస మద్దతు ధరలతో పెద్ద సంఖ్యలో రైతాంగం ముఖ్యంగా చిన్న, మధ్య తరగతి రైతులు అలాగే కౌలు రైతులు రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. సి2 ప్లస్‌ 50 శాతం అంటే మొత్తం ఉత్పత్తి వ్యయంలో కనీసం 50 శాతానికి పైగా కనీస మద్దతు ధర ఇవ్వాలని స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సుకు అనుగుణంగా ఎంఎస్‌పిని నిర్ధారిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి ద్రోహం చేసేలా వరుసగా 9వ సంవత్సరం కూడా ప్రకటించిన ఎంఎస్‌పి వుంది.
            గత సీజనులో క్వింటాల్‌ ధాన్యానికి రూ.2040 ఇవ్వగా ఈసారి ఎంఎస్‌పి రూ.2183గా నిర్ధారించారు. అంటే కేవలం 7 శాతాన్ని పెంచారు. ముతక తృణధాన్యాలకు కూడా ఎంఎస్‌పిని 6.3 నుండి 7.8 శాతం మధ్య పెంచారు. దీంతో జొన్నలు క్వింటాల్‌కు గతేడాది రూ.2350 వుండగా, ఈసారి రూ.2500 వుంది. మొక్కజొన్నకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2900 నిర్ణయించారు. ఏడాది క్రితం వీటి ధర రూ.1962 వుంది. అంటే 6.5 శాతం పెరిగింది. కందులు, మినుములు ఎంఎస్‌పి కూడా చాలా స్వల్పంగా వరుసగా 6, 5.3 శాతం పెరిగాయి. అంటే కందులు ధర రూ.400 పెరిగి క్వింటాల్‌ ధర రూ.7 వేలకు చేరగా, మినుముల ధర రూ.350 పెరిగి, క్వింటాల్‌కు రూ.6950కి చేరింది. ఇకపోతే పత్తి కనీస మద్దతు ధర 8.9 శాతం పెరిగింది. అంటే మీడియం గింజ గల (మీడియం స్టేపుల్‌) పత్తికి రూ.540 పెరిగి క్వింటాల్‌ రూ.6080కి చేరింది. పొద్దు తిరుగుడు విత్తనాల ఎంఎస్‌పి 5.6 శాతం పెరిగింది. రూ.60 పెరిగి క్వింటాల్‌ రూ.6760కి చేరింది. పెసరపప్పు కనీస మద్దతు ధర గతేడాదితో పోలిస్తే 10.4 శాతం పెరిగింది. నువ్వులు ధర 10.3 శాతం పెరగగా, వేరుశనగల ధర గతేడాది కన్నా 9 శాతం పెరిగింది. చాలా పంటలకు ఇదే రీతిలో కనీస మద్దతు ధరలు పెరిగాయి. అయితే, 2019-20 నుండి 2021-22 వరకు ఉత్పత్తి వ్యయ అంచనాల ఆధారంగా వ్యయాన్ని అంచనా వేస్తున్నందున 2021-22 నుండి 2023-24కి పెరిగిన వ్యయ పెంపును భర్తీ చేయడంలో ఎంఎస్‌పి విఫలమవుతోంది.
              సాగుకు అయ్యే మొత్తం వ్యయాన్ని లెక్కించే సి2 వ్యయం నుండి స్వంత భూమి అద్దె విలువను, నిర్దిష్ట మొత్తంపై వడ్డీని కలపని ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ వ్యయానికి మారిపోయేలా బిజెపి ప్రభుత్వం తన నియమ నిబంధనలను మార్చేసింది. పైగా, ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ సూత్రం ప్రకారం లెక్కించిన ధరల్లో కూడా కొంత సంక్లిష్టత లేదా తేడా వుంది. వ్యవసాయ వ్యయం ధరల కమిషన్‌ (సిఎసిపి) వివిధ రాష్ట్రాల్లో వ్యయాన్ని తక్కువగా అంచనా వేస్తోంది. ఇలా తక్కువగా అంచనా వేసిన వ్యయాల దేశ సగటును ఉపయోగించి ఎంఎస్‌పిని లెక్కిస్తున్నారు. ఖరీఫ్‌ పంటలకు ధరల విధానాన్ని సిఎసిపి రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో వరి ఉత్పత్తి వ్యయం అంచనాలు సిఎసిపి అంచనాల కన్నా అధికంగా వున్నాయని 2023-24 సంవత్సరం మార్కెటింగ్‌ సీజన్‌ అంగీకరించింది. సిఎసిపి రొటీన్‌గా జరిపే ఈ అంచనాలు, పెరుగుతున్న ఉపకరణాల వ్యయాన్ని లేదా ద్రవ్యోల్బణ కారణాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాలు చేసిన సిఫార్సులను కూడా కనీసం కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
            వరికి సంబంధించినంత వరకు, కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ వేసిన వ్యయ అంచనా క్వింటాల్‌కు రూ.2847గా వుంది. కానీ సిఎసిపి అంచనా క్వింటాల్‌కు కేవలం 2338 గానే వుంది. పంజాబ్‌ రాష్ట్రం వేసిన సి2 వ్యయ అంచనా క్వింటాల్‌కు రూ.2089గా వుండగా, సిఎసిపి అంచనాల్లో కేవలం క్వింటాల్‌కు రూ.1462గా మాత్రమే వుంది. చాలా పంటల్లో, సిఎసిసి అంచనాల కన్నా రాష్ట్ర ప్రభుత్వాల అంచనాలు చాలా అధికంగా వుంటున్నాయి. కేరళలో ఉత్పత్తి వ్యయం అధికంగా వుందని, కేంద్రం నిర్ధారించిన ఎంఎస్‌పి ఏ రకంగానూ ఖర్చులన్నింటినీ తట్టుకునేలా లేదని పూర్తిగా తెలిసి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.800 చొప్పున వరికి బోనస్‌ను ఇస్తూ, క్వింటాల్‌కు రూ.2850 చొప్పున ధాన్యాన్ని సేకరిస్తోంది. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలు తీసుకునే ఇటువంటి చొరవలను నిరుత్సాహ పరుస్తోంది. మార్కెట్‌ను వక్రీకరించడమేనని విమర్శిస్తోంది.
           సిఎసిపి లెక్కించిన సి2 వ్యయాలు (క్వింటాల్‌కు రూ.1911)ను పరిగణనలోకి తీసుకుని, దానికి సి2 ప్లస్‌ 50 సూత్రాన్ని వర్తింపచేసినట్లైతే వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2866 వుండాలి. కానీ ప్రకటించిన ఎంఎస్‌పి కేవలం క్వింటాల్‌కు రూ.2183 గానే వుంది. రాష్ట్ర వ్యవసాయ విభాగాలు అందచేసిన సగటు సి2 వ్యయాన్ని (క్వింటాల్‌కు రూ.2139) పరిగణనలోకి తీసుకుంటే సి2 ప్లస్‌ 50 శాతం అంటే క్వింటాల్‌కు రూ.3208 అవ్వాలి. రెండు కేసుల్లోనూ ప్రకటించిన ఎంఎస్‌పి చాలా తక్కువగానే వుంది. రైతులు వరుసగా క్వింటాల్‌కు రూ.683.5, రూ.1025.5 చొప్పున నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారు సాగులో ఆరు టన్నుల దిగుబడి సాధించే రైతు ఈ వ్యయ లెక్కలతో వరుసగా హెక్టార్‌కు రూ.41,010, రూ.61,530 చొప్పున నష్టపోతాడు. అంటే రాష్ట్రంలో రైతులకు ఒక సీజనుకు రూ.9020 కోట్లు నుండి రూ.13,540 కోట్ల వరకు నష్టం జరుగుతుంది (ఆంధ్రప్రదేశ్‌లో 22 లక్షలకు పైగా హెక్టార్లలో వరి సాగు జరుగుతుంది).
               ఇక పత్తి విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర సి2 వ్యయ అంచనాలు క్వింటాల్‌కు రూ.11,031గా వున్నాయి. సిఎసిపి అంచనాలు మాత్రం చాలా తక్కువగా క్వింటాల్‌కు రూ.6264గా వున్నాయి. అంటే క్వింటాల్‌కు రూ.4767 తగ్గుతోంది. ఎంఎస్‌పి (క్వింటాల్‌కు రూ.6620)ని, పత్తికి సిఎసిపి సి2 వ్యయ అంచనాలు (క్వింటాల్‌కు రూ.5786)ను పరిగణనలోకి తీసుకుంటే సి2 ప్లస్‌ 50 శాతం ధర అంటే క్వింటాల్‌కు రూ.8679 వుండాలి. క్వింటాల్‌కు రూ.2059 నష్టం. హెక్టార్‌కు 15 క్వింటాళ్ళ సగటు ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుంటే హెక్టారుకు నష్టం రూ.30,885 వుంటుంది. రాష్ట్ర లెక్కల ప్రకారం సూచించిన ఎంఎస్‌పి సి2 ప్లస్‌ 50 -క్వింటాల్‌కు రూ.16,547 అంటే కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పి కన్నా క్వింటాల్‌కు రూ.9927 ఎక్కువ. అంటే హెక్టారుకు రూ.1,48,905 మేరకు నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో 10 లక్షల హెక్టార్లలో సాగు జరుగుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే కేంద్ర ఎంఎస్‌పి, రాష్ట్రం ప్రతిపాదించిన ఎంఎస్‌పిల వద్ద నష్టాలు వరుసగా రూ.5868 కోట్లు, రూ.28291 కోట్లు వుండనున్నాయి. రైతులకు కలిగే నష్టాన్ని, వారిని నిరాశపరచడాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే పత్తి పండించే ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయో బోధపడుతుంది. కందిపప్పుకు కర్ణాటక రాష్ట్రం వేసిన సి2 వ్యయ అంచనాలు క్వింటాల్‌కు రూ.9588గా వున్నాయి. అదే సమయంలో సిఎసిపి అంచనాలు క్వింటాల్‌కు కేవలం రూ.5744గా వున్నాయి. అంటే ఇక్కడ క్వింటాల్‌కు రూ.3844 తగ్గిందన్నమాట. సిఎసిపి సి2 రేట్లతో అంచనా వేసినా కందులు, పెసలు, మినుములు, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఒడిశలు (నైజర్‌ సీడ్స్‌), పత్తికి సంభవించే నష్టాలు దాదాపు క్వింటాల్‌కు రూ.2 వేలు నుండి రూ.3 వేలు వరకు వుంటాయి. కేంద్రం హామీ ఇచ్చిన రీతిలో ఉత్పత్తి సేకరణ జరగని పక్షంలో రైతులకు ఈ ఎంఎస్‌పి కింద వచ్చే మొత్తం కూడా రాదు. ఈ నేపథ్యంలో రైతులకు సంభవించే నష్టం ఇలా వేలాది కోట్లరూపాయిల్లోనే వుంటుందన్నది ఎవరైనా ఊహించే విషయమే. పత్తి, పప్పుధాన్యాలు, నూనె విత్తనాల విషయంలో కార్పొరేట్ల ఆదేశాల మేరకు తప్పుడు వాణిజ్య విధానాలను అనుసరించడం, జీరో సుంకాలకు దిగుమతి చేసుకోవడం వంటి చర్యలతో రైతన్నలు మరింత సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు.
           క్షేత్ర స్థాయిలో వాస్తవికంగా నెలకొన్నదాని కంటే చాలా తక్కువగా వ్యయాన్ని తక్కువ అంచనా వేయడం ద్వారా రైతులు మొదటగా మోసపోతున్నారు. దేశ సగటు వ్యయ అంచనాలు వాటి వాస్తవిక వ్యయాల కన్నా తక్కువగానే వుండడం వల్ల అధిక ఉత్పత్తి వ్యయం గల రాష్ట్రాల్లో రైతులు రెండోసారి మోసపోతున్నారు. ఇక చాలా కేసుల్లో హామీ ఇచ్చిన రీతిలో ప్రభుత్వం సేకరించదు గనుక ఈ ఎంఎస్‌పి చాలావరకు కేవలం కాగితాలకే పరిమితమవు తుండడంతో మూడోసారి రైతులు మోసపోతున్నారు. 2021-22లో మొత్తం రైతులు ఉత్పత్తి చేసిన దాంట్లో కేంద్రం సేకరించింది, తుర్‌ దాల్‌కు సంబంధించి 1.14 శాతం వుండగా, పెసలకు 5.07శాతంగా వుంది. మినుములను కేవలం 0.21శాతమే సేకరించారు, వేరుశనగలను 2.05 శాతం సేకరించగా, సోయాబీన్‌ ఉత్పత్తులను అసలు సేకరించనే లేదు. 2022-23 సంవత్సరానికి చూసినట్లైతే ఫిబ్రవరి 28నాటికి వున్న లెక్కల ప్రకారం, కందులు, మినుములు, సోయాబీన్‌లను అసలు సేకరించలేదు. కేవలం పెసలను రూ.6.39 శాతం సేకరించారు.
ఇలా రైతులు ఒకపక్క వారి ఉత్పత్తులకు సరైన ధరలు రాకపోవడం, మరోపక్క ప్రభుత్వ నియంత్రణ లేకుండానే ధరలను నిర్ణయించడంలో కార్పొరేట్‌ కంపెనీలకు స్వేచ్ఛ ఇచ్చిన కారణంగా ఉపకరణాల వ్యయం పెరుగుతూ పోవడం తో అడ కత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు. ఎంఎస్‌పిని పెంచితే వినియోగదారులకు ధరలు పెరుగుతాయనేది తరచుగా చెప్పే ప్రభుత్వం చెప్పే సాకుగా వుంటుంది. కానీ, రైతులు, వినియోగదారులను పణంగా పెట్టి లాభాలు దండుకోవడాన్ని నిలువరించేందుకు ఏమీ జరగడం లేదు.
             మరింత మెరుగైన, ఆర్థికంగా లాభసాటిగా వుండే వ్యవసాయ పద్ధతులు, విధానాలతో ఉత్పాదకతను పెంచుకో వాలని, అధిక దిగుబడినిచ్చే రకాలను ఉపయోగించాలని, అందుబాటు ధరల్లో, సబ్సిడీ రేట్లకు నాణ్యత గల ఉపకరణాలు అందించాల్సిన అవసరం వుందన్నది తిరుగులేని వాస్తవం. అందులో ఎలాంటి సందేహం లేదు. రైతులకు శాస్త్రీయ అభివృద్ధి ఫలాలను చేరవేసేందుకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల విస్తరణ, వ్యాప్తి జరగాల్సిన అవసరం కూడా వుంది. అయితే, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది ప్రాధాన్యంగా లేదు. రైతులకు నష్టాలను కలిగిస్తూ, వారిని రుణాల ఊబిలోకి ఉద్దేశ్యపూర్వకంగా నెట్టివేసే, మరింత పేదలను చేసే, వారి భూమికి వారిని దూరం చేసే పద్దతులకు, విధానాలకు పాల్పడుతూ ఆ దిశగా బిజెపి ప్రభుత్వం పయనిస్తోంది. మరోపక్క కార్పొరేట్‌ కంపెనీల ఖజానాలు నింపుతూ వారికి గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించి పెడుతోంది. గతంలో కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ చట్టానికి సవరణలు ఇవన్నీ కూడా రైతులను సాగు నుండి దూరంగా నెట్టివేసే ఎత్తుగడలో భాగమే. ఈ నేపథ్యంలో, చట్టబద్ధమైన కనీస మద్దతు ధరలతో పాటూ సేకరణ హామీ కల్పించేలా సమైక్య పోరాటాలు జరపడమన్నది అత్యంత కాలానుగుణ్యమైన అంశం. ఈ పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)