Jul 03,2022 08:13

ఆరోజు స్వాతంత్య్ర దినోత్సవం. పాఠశాల వేదికపై వివిధ వేషధారణల్లో ముద్దులొలికే చిన్నారులు. తెల్లని గావంచా, చేతిన కర్ర, అద్దాలు లేని కళ్లజోడు - గాంధీ! తెల్లని కోటు, దానిపై ఎర్రని గులాబీ, తలకు ఖద్దరు టోపీ - నెహ్రూ. సన్నని మీసం, గుండ్రని టోపీ, చేతిలో పిస్తోలు - భగత్‌సింగ్‌. నీలం కోటు, ఓ చేతిలో పుస్తకం, దిశానిర్దేశం చేస్తున్న చూపుడు వేలు - అంబేద్కర్‌. చేతిలో కత్తీ డాలు, బిగువైన చీరకట్టు - ఝాన్సీ రాణి. అదే వరసలో పొడవైన గడ్డం, చేతిలో ఎక్కుపెట్టిన బాణం - అల్లూరి సీతారామరాజు. ప్రాంతాలను బట్టి ఇందులో కొన్ని వేషాలు మారొచ్చు. సందర్భాలను బట్టి మరికొందరు చేరొచ్చు. తెలుగు నాట చిన్నారులు ధరించే స్వాతంత్య్ర సమరవీరుల పాత్రల్లో అల్లూరి సీతారామరాజు తప్పనిసరిగా కనిపిస్తాడు. ఆ రూపం వీరత్వానికి ప్రతీకగా ఉంటుంది. విప్లవానికి పతాకగా రెపరెపలాడుతుంది.
బ్రిటీషు వాడి కర్కశత్వానికి 1924 మే 7వ తేదీన రామరాజు బలయ్యాడు. ఎలాంటి విచారణా లేకుండానే చెట్టుకు కట్టేసిన యోధుడిని మేజర్‌ గుడాల్‌ కాల్చి చంపేశాడు. రామరాజు అమరత్వం తెలుగు నాట సుప్రసిద్ధం! సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన ఆ యోధుడి స్మరణలో.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సాంస్కృతిక ఉత్సవాలు 1930 దశకం నుంచీ ప్రారంభమయ్యాయి. రామరాజు సహాధ్యాయి మద్దూరి అన్నపూర్ణయ్య, ఉద్దంరాజు రామం వంటివారు తొలుత గోదావరి జిల్లాలో అల్లూరి పేరిట యువజనోత్సవాలు ప్రారంభించారు. అప్పటి కాంగ్రెస్‌ పార్టీకి అది ఇష్టం లేదు. బ్రిటీషు వాళ్ల దృష్టిలో అది తీవ్రమైన నేరం. అయినా, ప్రతిఏటా ఉత్సవాలు నడిపారు. అలా నిర్వహించిన యువకులే తరువాతి కాలంలో కమ్యూనిస్టులుగా మారారు. మన్యం పోరాటానికి ముందు అల్లూరికి ఆశ్రయం ఇచ్చిన ఊరు విశాఖ జిల్లాలోని కృష్ణాదేవి పేట. వీరమరణం తరువాత అల్లూరికి అంత్యక్రియలు జరిపిందీ, తరువాతి కాలంలో స్మారక మందిరం నిర్మించిందీ ఆ ఊళ్లోనే. అక్కడ కమ్యూనిస్టులు, గ్రామ పెద్దలూ ఏటా మే నెలలో అల్లూరి యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు.
విశాఖ, తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాల మన్య ప్రాంతంలో ఇప్పటికీ ఏదొక రూపాన అల్లూరి స్మరణ చేయని ఊరు ఉండదు. చాలా గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు పేరిట యువజన సంఘాలు ఏర్పడి, పనిచేశాయి. చాలా ఊళ్లలో అల్లూరి విగ్రహాలు స్ఫూర్తిదాయకంగా కనిపిస్తాయి. గ్రామదేవతల పండగల్లో వేసే బండ్ల వేషాల్లో ఏదొక బండి మీద బాణం ఎక్కుపెట్టిన రామరాజు రూపం మనకు దర్శనమిస్తుంది. రామరాజు, సీతారామరాజు వంటి పేర్లు కొందరు తమ పిల్లలకు పెట్టుకోవడమూ కనిపిస్తుంది. మన్య పోరాటం సాగిన ప్రాంతాల్లో అల్లూరి చూపిన ప్రభావానికి ఇవన్నీ నిలువెత్తు నిదర్శనాలు.

burrakatha


సాంస్కృతిక ప్రదర్శనల్లో, సాహిత్యంలో అల్లూరి ప్రాభవాన్ని మనం గమనించవచ్చు. బుర్రకథకు వీరరసం తలమానికం వంటిది. ప్రజల్లో చైతన్యాన్ని రగిలించటానికి కమ్యూనిస్టు ఉద్యమం దాన్నొక బలమైన ఆయుధంగా వినియోగించింది. ప్రజానాట్యమండలికి చెందిన సుంకర సత్యనారాయణ అల్లూరి బుర్రకథను రాస్తే- నాజర్‌ బృందం దానిని ఊరూరా ఉత్తేజకరంగా ప్రదర్శించింది. ఆ తరువాత ఇంకెన్నో బృందాలు అల్లూరి బుర్రకథను తెలుగు నాట విస్తారంగా ప్రచారం చేశాయి. రామరాజు ప్రజలను కదిలించటం, ముందుగానే సమాచారం ఇచ్చి పోలీస్‌ స్టేషన్లపై దాడులు చేయడం, ఉద్యమాన్ని అణచివేయటానికి వచ్చిన బ్రిటీషు పోలీసు బలగాలపై వీరోచితంగా పోరాడటం వంటి ఘట్టాలు.. బుర్రకథాగానంలో ఒళ్లు పులకించేలా సాగుతాయి. అల్లూరి ప్రాణత్యాగం చేసిన ఘట్టం కూడా అత్యంత కరుణాత్మకంగా, వీరోచితంగా, చైతన్యం రగిలించేలా ఉంటుంది. అందుకనే ఇంటింటా టీవీలు రాకముందు అల్లూరి సీతారామరాజు బుర్రకథకు అత్యంత ఆదరణ లభించేది. అలాగే అల్లూరి ఏకపాత్రాభినయం అత్యంత ప్రాచుర్యం పొందింది. విద్యాసంస్థల వార్షికోత్సవాల్లో, గ్రామాల్లోని సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పనిసరి ప్రదర్శనగా ఉండేది.
విశాఖ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే క్రమంలోనే అక్కడి పోరాట వారసత్వాన్ని వెలికితీసే ప్రయత్నం జరిగింది. పడాల రామారావు తదితరులు తమ సమయాన్ని అల్లూరి పోరాట చరిత్రను నవలగా, నాటకంగా, బుర్రకథగా రూపొందించటానికి, విస్తృతంగా ప్రచారం చేయటానికి వినియోగించారు. 1925 మొదలుకొని ఇప్పటివరకూ అల్లూరిపై అనేక పుస్తకాలు వచ్చాయి. పొన్నలూరి రాధాకృష్ణమూర్తి రాసిన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై 1938 మే నెలలో బ్రిటీషు ప్రభుత్వం నిషేధం విధిóంచింది. స్వాతంత్య్రం వచ్చాక ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. తరువాతి కాలంలో ప్రజాశక్తి బుకహేౌస్‌ ఆ పుస్తకాన్ని అచ్చు వేసింది. ఇప్పుడు అల్లూరి మన్య పోరాటం మీద దాదాపు 20 పుస్తకాలు వరకూ ప్రచురితమయ్యాయి. డాక్టర్‌ అట్లూరి మురళి తన పరిశోధనా వ్యాసంగా వెలువరించిన పుస్తకం అల్లూరి కాలం నాటి సామాజిక, ఆర్థిక, పాలనాపరమైన అనేక అంశాలను సాధికారికంగా వివరించింది. 1993లో అల్లూరి జీవిత చరిత్ర తెలుగు వెలుగు పేరిట ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు తెలుగు ఉపవాచకంగా ఉండేది. 1974లో కృష్ణ నిర్మించిన సినిమా అత్యంత ఆదరణ పొందింది. ఆ సినిమా కోసం మహాకవి శ్రీశ్రీ రాసిన 'తెలుగు వీర లేవరా .. దీక్షబూని సాగరా' ఎంతో ప్రసిద్ధమైన యుద్ధగీతం. జాతీయ పురస్కారం పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రగీతం అదే కావడం గమనార్హం. రామరాజు సాగించిన పోరాటం అనేక భావోద్వేగాల సమ్మిళితంగా ఉండటం వల్ల, చారిత్రికంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉండటం వల్లా - అనేక సాహిత్య ప్రక్రియల్లోకి అది తర్జుమా అయింది. జీవిత చరిత్ర, నవల, కథ, నాటకం, నాటిక, బుర్రకథ, ఏకాంకిక, రూపకం, శతకం, వీరకథా కావ్యం, సినిమా వంటి రూపాల్లో వెలువడి, తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో సరికొత్త చైతన్యాన్ని నెలకొల్పింది.
రామరాజు నడయాడిన ప్రాంతాలన్నీ ఇప్పటికీ ఆయన పోరాట పంథాని గుర్తు చేసుకునే స్మారక కేంద్రాలుగా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మంపలో, రాజేంద్రపాలెంలో (రామరాజు కాల్చి చంపిన ప్రాంతం. ఆ తరువాత రాజు జ్ఞాపకార్థం రాజేంద్రపాలెంగా మారింది), కృష్ణాదేవి పేటలో రామరాజు గురుతులు మనకు పోరాటపు వారసత్వాన్ని ప్రసరిస్తూనే ఉంటాయి. గ్రామాల్లో రాజు, అతడి అనుచరులు కూర్చున్న రచ్చబండలు, స్నానపానాలు సాగించిన వాగులూ.. ఇప్పటికీ మన్నెం వీరుల చైతన్య గీతాలను గానం చేస్తూనే ఉన్నాయి. మన్యప్రాంతపు హక్కుల పోరాటంలో పిడికిలి బిగించమని ప్రేరేపిస్తూనే ఉంటాయి.

- శాంతిమిత్ర