Jun 11,2023 08:10

బాల్యం ఓ అద్భుతం. ప్రతిఒక్కరికీ అందమైన బాల్య స్మృతులు ఉంటాయి.. ఉండాలి కూడా. అప్పుడే బాల్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించినట్టు. బాల్యం గుర్తుకొస్తే భారమైన వయసు కూడా తేలికవుతుంది. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. కొందరి బాలల జీవితాల్లో మాత్రం చీకట్లే.. బాల్యాన్ని తలుచుకుని భయపడే పౌరులూ లేకపోలేదు.. ఇందుకు కారణం బాలకార్మిక వ్యవస్థ. 'నేటి బాలలే రేపటి పౌరులు' అన్నారు జవహర్‌లాల్‌ నెహ్రూ. కానీ ఆ రేపటి పౌరులైన నేటి బాలల్ని కంటికి రెప్పలా కాపాడుకోకుండా.. ఇంకా ప్రపంచ దేశాల్లో ఏదో ఒక చోట వారితో వెట్టిచాకిరీ చేయిస్తూనే ఉన్నాం. వారి రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎక్కడో లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీనికి కారణాలూ లేకపోలేదు.. తీవ్రమైన పేదరికం కూడా ఓ కారణం కాగా ప్రభుత్వాలు, పాలకుల అసమర్థత కారణంగా పలకా బలపం పట్టాల్సిన చేతులు పలుగులు, పారలూ పడుతున్నాయి. ఫలితంగా అందమైన బాల్యం వారికి అందనంత దూరంలో ఉంటోంది. ఈ నెల 12న ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినం సందర్భంగా దీనిపైనే ప్రత్యేక కథనం...

బాల కార్మికులు అనే పదం రోజువారీ, నిరంతర శ్రామికులుగా పనిచేసే బాలలను సూచిస్తుంది. బాల కార్మికతను అనేక అంతర్జాతీయ సంస్థలు దోపిడీ వ్యవస్థగా పరిగణిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇది చట్టవిరుద్ధం కూడా. చరిత్రవ్యాప్తంగా బాల కార్మికులను వివిధ రకాలుగా ఉపయోగించుకున్నారు. అయితే పారిశ్రామిక విప్లవం అనంతరం శ్రామిక పరిస్థితుల్లో మార్పులు, సార్వత్రిక విద్య ప్రవేశం, శ్రామికులు, బాలల హక్కులు తెరపైకి రావడంతో ఇది ప్రజా సమస్యగా మారింది. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో, నిర్ణీత వయస్సు లోపల (ఐదు నుంచి 14 సంవత్సరాలు) ఉన్న బాలలు (ఇంటి పనులు లేదా పాఠశాల సంబంధ పనులు మినహాయించి) పని చేయడాన్ని అక్రమంగా పరిగణిస్తారు. ఎందుకంటే 'బాల్యాన్ని నాశనం చేసే రీతిలో పిల్లలతో పని చేయించడం' అనేది పిల్లల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి అవరోధమై, వారికి అక్షరాస్యత, వినోదాన్ని పొందే అవకాశాన్ని దూరం చేస్తుంది. అయితే, తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఎందరో బాలలు బాలకార్మికులుగా జీవిస్తున్నారు. అవసరాల కోసమో, అదనపు ఆదాయం కోసమో పేద కుటుంబాలు తమ పిల్లలను పనుల్లోకి పంపించక తప్పడంలేదు.
 

                                                                        పరిపూర్ణం అయ్యేదెప్పటికి...

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు, పాలకులు, స్వచ్ఛంద సంస్థలు, కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, సమాజంపై బాధ్యత కలిగిన కొంతమంది పౌరులు పాటుపడుతూనే ఉన్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నా.. ఈ ప్రయత్నాలు, వాటి ఫలితాలు నేటికీ పరిపూర్ణం కాలేదు. ఫలితంగా బాలలు బాలకార్మికులుగా మారి అక్షరాస్యతకు దూరమవుతున్నారు. తల్లిదండ్రుల ఆలనపాలనకు, పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు బాలలు అవాంఛనీయశక్తులుగానూ, మరికొంతమంది సంఘ విద్రోహశక్తులుగా వక్రమార్గం పడుతున్నారు. దీనివల్ల వారి జీవితాలు దారితప్పుతున్నాయి. ఫలితంగా కొంతమంది జీవితాలు మధ్యలోనే ముగిసిపోతున్నాయి.
 

                                                                          ఫలితం ఇవ్వని పథకాలు..

ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు బాలకార్మికులుగానే ఉండిపోతున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ఆచరణలో ఫలితాలు కానరావడం లేదు. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు లేక కొందరు, అవి ఉన్నా వివిధ కారణాల రీత్యా బడికి వెళ్లలేక మరికొందరు తమ ఉజ్వల భవిష్యత్తును అంథకారం చేసుకుంటున్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలతో ముడిపడిన సంక్షేమ పథకాలకు నోచుకోక, చదువు చెప్పించే స్థోమత లేక ఎందరో పేద తల్లిదండ్రులు గత్యంతరం లేని స్థితిలో చిన్నారులపై భారాన్ని మోపుతున్నారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు, ఫ్యాక్టరీలు, మిల్లులు, క్వారీలు, గనులకు తమ పిల్లలను పనికి పంపుతున్నారు. ఇక ప్రధానంగా కుటుంబ ఆదాయం కోసం వ్యవసాయ పనులకు వెళుతున్నారు. మరికొందరు అనాథలైన బాలలను చేరదీసినట్లు నటించి, వారిని యాచక వృత్తిలోకి బలవంతంగా నెడుతున్నారు.
 

                                                                     పేదరికమే ప్రధాన కారణం..

మన దేశంలో ప్రధానంగా పేదరికం కారణంగా బాలలు కార్మికులుగా మారుతున్నారు. అయితే ప్రాథమిక హక్కులను పేర్కొన్న రాజాంగంలోని 3వ ప్రకరణంలోని 15(8)వ అంశం బాలల కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారం ప్రభుత్వాలకు కలుగజేస్తోంది. 28వ అధికరణం ప్రకారం బాలలను వ్యాపార వస్తువుగా మార్చడం, నిర్బంధ సేవలను చేయించుకోవడం అపరాధంగానే పరిగణించాలి. అయితే ప్రభుత్వాలు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కొసమెరపు. ముఖ్యంగా పాలకుల్లో ఎక్కువ శాతం మంది పారిశ్రామిక వేత్తలు ఉండడం.. గడచిన కొంత కాలంగా వస్తున్న పరిస్థితులు. దీంతో చట్టాలను వారికి అనుకూలంగా చేసుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. పైపైకి పటిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ.. ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహారశైలి ఉంటోంది. బాల కార్మికవ్యవస్థను నిర్మూలించాలనే సంకల్పం పట్ల చిత్తశుద్ధి ఉంటే.. ముందుగా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి. అందుకు తగ్గ వేతనాలపై చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని వారికి తెలియదా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఎప్పుడైతే కుటుంబవ్యవస్థలో ఆదాయం బలంగా ఉంటుందో.. అప్పుడు బాలలకు పనిచేయాల్సిన పరిస్థితి ఏంటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
 

                                                                    చెప్పిందొకటి.. చేసిందింకొకటి...

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు 1979లో గురుపాదస్వామి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ అనేక ప్రాంతాల్లో పర్యటించి, బాల కార్మికులు వారి కుటుంబ సభ్యులతో సంప్రదించి, మెరుగైన సూచనలు చేసింది. బాల కార్మికుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచకుండా, పునరావాస సౌకర్యాలు కల్పించకుండా, వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకుండా వ్యవస్థను మార్చడం సాధ్యం కాదని కమిటీ పేర్కొన్నది. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలంటే ప్రణాళిక విధానంలోనూ ఆర్థిక పరిస్థితుల్లోనూ బడ్జెట్‌ రూపకల్పనలోనూ కొన్ని మార్పులు చేయడం ద్వారా ఆయా వర్గాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని సూచన చేసింది. కానీ ప్రస్తుత పాలకులు చేస్తున్నదేమిటి? ఆదాయ మార్గాలను పెంచకుండా ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ప్రయోజనం ఏమిటి? అనేది విశ్లేషకుల మాట.
 

                                                                             ప్రపంచ వ్యాప్తంగా..

బాల కార్మికులు ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. వారి సంఖ్యలోనే తేడా తప్ప ప్రతి దేశమూ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న, వెనుకబడిన దేశాల్లోనూ బాలకార్మికులు ఉన్నారు. అగ్రరాజ్యమైన అమెరికా నుంచి చీకటి ఖండంగా పేరుగాంచిన ఆఫ్రికాలోనూ బాల కార్మికులు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. స్థూలంగా చూస్తే ప్రతి పదిమంది బాలల్లో ఒకరు బాలకార్మికుడిగా మిగిలిపోతున్నారు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలో అత్యధికంగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గల బాలకార్మికుల్లో ఐదో వంతు ఇక్కడే ఉండటం గమనార్హం. ఆఫ్రికా తరవాత ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 218 మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నట్లు అంచనా. ఇక ప్రపంచ బాలకార్మి కుల్లో మూడో వంతు మన దేశంలోనే ఉన్నారనేదీ ఒక అంచనా.
           ఏ ఒక్క వ్యక్తి, సంస్థ, ప్రభుత్వం, పాలకుడూ బాలకార్మిక వ్యవస్థను మార్చలేరు. రాత్రికి రాత్రి ఈ సమస్యను పరిష్కరించడం అసాధ్యం. దీనికి కలసి కట్టుగా ప్రయత్నం చేయడం అవసరం. సామాజిక, రాజకీయ సంస్కరణలు తప్పనిసరి. అయితే ప్రభుత్వాల పాత్ర అన్నింటికన్నా కీలకం. 2023 సంవత్సరపు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాలను 'అందరికీ సామాజిక న్యాయం. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడం సాధ్యం!' అన్న అంశం ప్రధాన ఇతివృత్తాన్ని ఐక్యరాజ్య సమితి ఎంచుకుంది. 2025 నాటికి బాల కార్మికవ్యవస్థను తుదముట్టించాలన్న లక్ష్యం ప్రపంచం ముందున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ముందుకు సాగేందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాలకార్మిక వ్యవస్థను పునాది వేళ్లతో సహా పెకిలించి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలిసికట్టుగా కృషి చేస్తే ప్రపంచం తద్వారా ఆయా దేశాలు బాల కార్మికవ్యవస్థ నుంచి విముక్తి పొందగలవు.

                                                                       కార్మిక శాఖ వైఫల్యమేనా..!

వివిధ రంగాల్లో బాలకార్మికులు అవస్థలు పడుతూ అనుక్షణం శ్రమిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్దలు చేయాల్సిన పనులను సైతం వీరే చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలి, బాలల చేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్నా, వారికి విముక్తి కలిగించాలన్న ధ్యాస సంబంధిత అధికారుల్లో లేకపోవడం బాధాకరం. ఇక్కడ యజమానులు చెప్పిందే చట్టంగా, వారు చేసేదే సంక్షేమంగా తయారైంది. మొక్కుబడిగా అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా దోషులకు ఎలాంటి శిక్షలూ పడడం లేదు. 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ.. ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని భారత రాజ్యాంగంలోని 24వ నిబంధన స్పష్టం చేస్తున్నా అది కాగితాలకే పరిమితమవడం శోచనీయం.

ఉదయ్ శంకర్‌ ఆకుల
7989726815