Oct 20,2023 08:36

ఆయన ప్రజలను భయపెట్టే రోగాలకు ఎదురెళ్లారు. వాటిని సులభంగా ఎదిరించే ధైర్యాన్ని, మెలకువనీ అందరికీ అందించారు. సాంక్రమిత వ్యాధుల ఆనుపానులను అంచనా వేసి, వాటిని అప్రమత్తంగా అణగదొక్కే ఉపాయాలను కనిపెట్టారు. రోగులకు, బాధితులకు సులభ చికిత్స హస్తం అందించారు. ఆయన ప్రముఖ సాంక్రమిత వ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ. కాకినాడ కేంద్రం వైద్యం అందిస్తూ, అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

covid

           పీడ, గత్తర, మహమ్మారి... ఇలా పేరేదైనా ఒక్కసారిగా జనం మీద విరుచుకుపడి వేలాది లక్షలాది ప్రాణాలను తీసే రోగాలు చరిత్ర నిండా విషాదం నింపాయి. ఆధునిక కాలంలోనూ వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో కోవిడ్‌, ఎయిడ్స్‌. ఒకటి సునామీలా ఒకదానిని మించి ఒకటి ప్రజల్లో భయాందోళలు, భ్రాంతులు, విషాదాలను ప్రపంచ మానవుల్లో నింపాయి. డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ తన పరిశోధనలు, పరిశీలనలతో ఈ పీడలకు నాణ్యమైన అతి చౌకైన వైద్యాన్ని కనిపెట్టారు. ప్రజలను నిరంతరం చైతన్య పరుస్తూ జ్ఞాన సంపన్నులను చేశారు. రెండు ప్రపంచ పీడల నుండి లక్షలాదిమందికి భరోసా కల్పించారు.
          23 ఏళ్లక్రితం కాకినాడ కేంద్రంగా వైద్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన డాక్టర్‌ మురళీకష్ణ ఎంబిబిఎస్‌, ఎండి హెచ్‌ఐవి చికిత్సలో దిట్ట. రాష్ట్రంలో మొదటి సాంక్రమిక వ్యాధుల నిపుణునిగా ఆయన ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. 6 వేల మంది హెచ్‌ఐవి బాధితులకు చికిత్సలు అందజేశారు. వారి జీవిత కాలాన్ని వృద్ధి చేసి, జీవన ప్రమాణాలను మెరుగు పర్చారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో మైక్రోబయాలజీలో ఎండి చేసిన మురళీకృష్ణ 1997 నుంచి హెచ్‌ఐవిపై పోరులో విశేషమైన కషి చేస్తున్నారు. హెచ్‌ఐవి రోగుల్లో వ్యాధి తీవ్రత అంచనాకు సీడీ4 లింఫోసైట్‌ కణాల సంఖ్య, హెచ్‌ఐవి వైరల్‌ లోడ్‌ పరీక్షలు చేస్తారు. ఇవి బాగా ఖరీదైనవి. అన్నీ చోట్లా లభ్యం కావు. ఎయిడ్స్‌ జబ్బులో అధికంగా ప్రాణాలు తీసేది క్షయ వ్యాధి. దీని బారిన పడిన రోగుల్లో ఖరీదైన పరీక్షల స్థానంలో చౌకగా దొరికే 'మాంటూ' (ట్యుబర్‌ క్యులిన్‌) పరీక్షను ఉపయోగించొచ్చునని డాక్టర్‌ మురళీకృష్ణ ప్రతిపాదించారు.
 

                                                                పరిశోధనలతో అంతర్జాతీయ గుర్తింపు

2000లో దక్షిణాఫ్రికాలోని దర్బన్‌లో జరిగిన 13వ అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధనా పత్రాలను మురళీకృష్ణ సమర్పించారు. ఆ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 5000 పైగా పరిశోధనల్లో 25 అత్యుత్తమ పరిశోధనలను ఎంపిక చేసి అతిపెద్ద మెడికల్‌ వెబ్‌సైట్‌ 'మెడ్‌ స్కేప్‌' ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్‌ నుండి అంతర్జాతీయ ఎయిడ్స్‌ సదస్సుకు మొదటి, ఏకైక పరిశోధన సారాంశం డాక్టర్‌ మురళీకృష్ణదే కావటం, ఆ పరిశోధనకు మెడ్‌ స్కేప్‌ ఎంపిక చేసిన అత్యుత్తమ పరిశోధనల్లో చోటు దక్కడం తెలుగు వారికి గర్వ కారణం. హెచ్‌ఐవిపై వివిధ పత్రికల్లో 40 వరకు పరిశోధనాత్మక వ్యాసాల ద్వారా మురళీకృష్ణ ప్రజల్లో అవగాహన కల్పనకు కృషిచేశారు. అనేక అవగాహన వ్యాసాలను రాశారు. 2000లో మొదటిసారి ఆయన ప్రచురించిన 'ఎయిడ్స్‌' పుస్తకం గొప్ప జనాదరణ పొందింది.
 

                                                             అపోహల తొలగింపు, వివక్షకు వ్యతిరేకంగా కృషి

2000 ప్రాంతంలో హెచ్‌ఐవి సోకిన వారిని సమాజంలో హీనంగా చూసేవారు. హెచ్‌ఐవి-ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు మిగతా అందరితోనూ సమానం అని, వారిని ఆదరించాలని వివక్షకు వ్యతిరేకంగా జన బహుళ్యాన్ని చైతన్య పరచడానికి డాక్టర్‌ మురళీకృష్ణ అనేక విధాలుగా కృషి చేశారు. గ్లౌజులు లేకుండా నేరుగా పరీక్ష చేసింది డాక్టర్‌ మురళీకృష్ణనే అని పేషెంట్లు ఇప్పటికీ అబ్బురంగా చెప్తుంటారు. బహిరంగ సభల నుంచి వైద్యుల సమావేశాల వరకు అన్ని స్థాయిల్లో ప్రసంగించి ఆయా సమూహాల్లో ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అపోహలను పోగొట్టారు. హెచ్‌ఐవి గురించి సలహాలు ఇవ్వటం, మానసిక ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే విషయంపై ఆయన అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
 

                                                                      సేవలకు ప్రతిభా పురస్కారం

ఏటేటా దేశవ్యాప్తంగా వివిధ సూపర్‌ స్పెషాలిటీల్లో ప్రజారోగ్య పరిరక్షణ కోసం విశేష కషిచేసిన వైద్య నిపుణులను గుర్తించి బ్రాండ్స్‌ ఇంపాక్ట్‌ సంస్థ హెల్త్‌ కేర్‌ ఎక్సలెన్స్‌ అవార్డులను అందిస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏడుగురిని ఎంపికచేయగా, వారిలో డాక్టర్‌ మురళీకష్ణ ఒకరు. దేశ రాజధాని ఢిల్లీలో ఆరోగ్యరంగ ప్రతిభా పురస్కారం-2023ను ఇటీవల ఆయన తన సతీమణి గీతతో కలిసి అందుకున్నారు.
 

                                                             రెండు రకాల యాంటీరెట్రో వైరల్‌ కాంబినేషన్‌

అందుబాటులో వున్న మందులపై పూర్తి అవగాహనతో హెచ్‌ఐవి చికిత్స తీసుకోని (యాంటీ రెట్రో వైరల్‌ నైవ్‌) పేషెంట్లలో రెండు ఔషధాల కాంబినేషన్‌ చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తుందని పేర్కొంటున్నారు. 2022 నుండి ఈ రెండు ఔషధాల కాంబినేషన్‌ చికిత్సను అన్ని అంతర్జాతీయ చికిత్స మార్గదర్శకాలలో చేర్చారు. కొత్తగా హెచ్‌ఐవి నిర్ధారించబడిన వారికి రెండు ఔషధాల యాంటీ రెట్రో వైరల్‌ కాంబినేషన్‌ చికిత్స విధానాన్ని గుర్తించారు.
 

                                                                       కోవిడ్‌ నుంచి రక్షణకు 'హోమ్‌కేర్‌'

కోవిడ్‌-19 ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో ఫేస్‌బుక్‌ వేదికగా డాక్టర్‌ మురళీకృష్ణ ప్రజలకు శాస్త్రీయ పద్ధతుల్లో అవగాహన కల్పించారు. డెల్టా వేవ్‌ ఉధతంగా ఉన్న సమయంలో తేలికపాటి కోవిడ్‌కు మూడు ఔషధాలతో ఇంటి వైద్యం (హోమ్‌కేర్‌) విధానంపై ప్రచారం చేశారు. ఏస్పిరిన్‌ - ప్రెడ్నిసొలొన్‌ - ఎజిత్రోమైసిన్‌ లతో తేలికపాటి కోవిడ్‌ జబ్బుకి ఇంటి వద్దనే చికిత్స తీసుకోవడానికి రూపొందొంచిన హోమ్‌ కేర్‌ కిట్టు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మందికి భరోసాను ఇచ్చింది.
           'కోవిడ్‌-ఎయిడ్స్‌-నేను' పేరుతో 2022 జనవరిలో ఆయన ప్రచురించిన ఆత్మ కథాత్మక వైద్య ఆరోగ్య గ్రంథం మేధావులు, సామాన్యుల నుంచి ఆదరణ చూరగొంది. కోవిడ్‌ తర్వాత పెరిగి పోతున్న గుండెపోటు మరణాలను చాలా ముందు గానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు డాక్టర్‌ మురళీకృష్ణ. గుండెపోటుకి గురయ్యే ప్రమాదం ఉన్న వారికి అనగా స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్‌, గుండె నొప్పి వంటి రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ ఉన్నవారిలో గుండెపోటు నిరోధానికి దశా బ్దాలుగా ఏస్పిరిన్‌ వాడుతున్నారు. గుండెపోటును అరికట్టడంలో ఏస్పిరిన్‌ గొప్పగా పనిచేస్తుందని రుజువైంది. కోవిడ్‌ భారిన పడటాన్ని కూడా గుండె పోటుకి దారితీసే రిస్క్‌గా భావించాలి. అందుకే ఒక మోస్తరు నుండి తీవ్రమైన కోవిడ్‌ జబ్బు బారిన పడ్డ వారు కనీసం రెండేళ్ల పాటు ఏస్పిరిన్‌ తీసుకోవడం మంచిదని డాక్టర్‌ మురళీకష్ణ చెబుతున్నారు.
                                                                                                                                       - యడవల్లి శ్రీనివాసరావు

                                                         

11

                                                         కోవిడ్‌, ఎయిడ్స్‌ చికిత్సలకు ప్రపంచస్థాయి ప్రాచుర్యం

రెండు ఔషధాల కాంబినేషన్‌తోనే హెచ్‌ఐవిని అన్‌ డిటెక్టబుల్‌ లోడ్‌కు చేర్చొచ్చునని 23 ఏళ్ల క్రితమే ప్రయోగాత్మకంగా నిరూపించాను. 2004 ఫ్రాన్స్‌లో జరిగిన సదస్సులో దీనిపై పరిశోధనా పత్రాన్ని సమర్పించాను. కాలపరీక్షలో నెగ్గిన నా చికిత్సా విధానం ఇప్పుడు ప్రపంచానికి ప్రామాణికంగా ఉంది. 1996 నుంచి ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవి చికిత్సలో మూడు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాల కాంబినేషన్‌ను అమలు చేస్తున్నారు. హెచ్‌ఐవి వైరల్‌ లోడును కనిష్టంగా (అందు బాటులో ఉన్న వైద్య పరికరాలు గుర్తించలేనంత) తక్కువస్థాయి (అన్‌ డిటెక్టబుల్‌)కి తీసుకురావడమనేది హెచ్‌ఐవి ట్రీట్మెంట్‌ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఈ చికిత్స కోసం అందుబాటులోకి వచ్చిన ఔషధాల సంఖ్య 25కుపైగానే ఉన్నాయి. 2000 ప్రారంభం నుంచి నేను ఎక్కువ మందికి రెండు ఔషధాల కాంబినేషన్‌ వైద్యాన్ని అందిస్తున్నాను. 2022 సెప్టెంబర్‌లో అమెరికా ప్రభుత్వ హెచ్‌ఐవి చికిత్సా మార్గదర్శకాలు, అక్టోబర్‌లో యూరోపియన్‌ ఎయిడ్స్‌ క్లినికల్‌ సొసైటీ మార్గదర్శకాల్లోనూ ఈ రెండు ఔషధాల కాంబినేషన్‌ చికిత్సను చేర్చారు. - డాక్టర్‌ యనమదల మురళీకష్ణ