
ఇప్పుడు మనం తిరోగమన మార్గంలో ఉన్నట్లు కనపడుతున్నది. దేవాలయాలు, పవిత్ర గోవు వంటి అంశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రాచీన విలువలను (బ్రాహ్మణవాద వివరణలను నాగరిక విలువలుగా) ఉపయోగించడం ద్వారా... ప్రపంచంలోకెల్లా మహత్తరమైన ప్రజా ఉద్యమం (భారత స్వాతంత్య్ర పోరాటం)తో సాధించిన విజయాలను... బలహీనపరచి అసమానతల వైపు నడిపిస్తున్నారు.
డా.వివేక్ దేవరాయ్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి ప్రధానమైన వ్యక్తి. మరో విధంగా చెప్పాలంటే ఆయన అధికార కేంద్రాలకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఆగస్ట్ 15న 'లైవ్ మింట్' పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన, ప్రస్తుత రాజ్యాంగం కొనసాగింపును ప్రశ్నించాడు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆమోదించబడిన రాజ్యాంగాన్ని అనేక పర్యాయాలు సవరించారు కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యాంగం, అప్పటి రాజ్యాంగం ఒకటి కాదనేది ఆయన ఉద్దేశ్యం. కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్) రాజ్యాంగం మౌలిక నిర్మాణాన్ని మార్చకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి, ఈ రాజ్యాంగం కాలం కూడా మించిపోయింది కాబట్టి మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా, ఈ రాజ్యాంగం వలసవాద వారసత్వాన్ని కలిగి ఉందనీ, ఈ రాజ్యాంగంలోని అనేక నిబంధనల్ని, ముఖ్యంగా సామ్యవాదం, లౌకికవాదం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ విలువల్ని ఆయన ప్రశ్నిస్తారు. అయితే ఆర్థిక సలహా మండలి, దేవరారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో అధికారికంగా విభేదించింది.
ఈ రాజ్యాంగం వలస వారసత్వం కలిగి ఉందని, దీన్ని బ్రిటీష్ వారు తీసుకొచ్చిన '1935 భారత ప్రభుత్వ చట్టం' ఆధారంగా ఏర్పాటు చేశారని, ఇది భారతీయ విలువలను ప్రతిబింబించడం లేదని, ఇప్పటికీ హిందూ మితవాద నాయకులు, సిద్ధాంతకర్తలు చెప్తుంటారు. ఈ రాజ్యాంగంతో మితవాద హిందూ జాతీయవాదులు ఏ మాత్రం సౌకర్యవంతంగా లేరు. అయితే ఇది వారనుకున్నట్లుగా '1935 భారత ప్రభుత్వ చట్టం' యొక్క కొనసాగింపు కాదు. మూడు సంవత్సరాల పాటు ఎంతో జాగ్రత్తగా, సమగ్రంగా, లోతైన అవగాహనతో, సంపూర్ణంగా చర్చించి తయారు చేసిన తరువాతనే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు బి.ఆర్.అంబేద్కర్ దీనిని ముందుకు తీసుకొని వచ్చారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఇంకా అనేకమంది సభ్యులు, భారత ప్రజలు పాల్గొన్న వలసవాద వ్యతిరేక పోరాటంలో గుర్తింపు పొందినవారే. 'భారతదేశం ఒక దేశం'గా రూపొందడంలో ఈ వలసవాద వ్యతిరేక పోరాటం అత్యంత కీలకమైనది. బహుళత్వం, సమ్మిళిత భారత జాతీయవాదం కోసం నిలబడిన వారికి పూర్తి భిన్నంగా...మతతత్వ జాతీయవాదులు ఈ మహత్తర పోరాటానికి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా, ఈ ప్రజా ఉద్యమం నుంచి ఉద్భవించిన విలువలను కూడా వ్యతిరేకించారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార పత్రిక 'ఆర్గనైజర్' రాజ్యాంగాన్ని తిరస్కరించి, మనుస్మతిని రాజ్యాంగంగా అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది. 1949 నవంబర్ 30వ తేదీ ఆర్గనైజర్ పత్రిక సంపాదకీయం ఇలా ఉంది: ''మన రాజ్యాంగంలో ప్రాచీన భారతదేశంలోని ప్రత్యేక రాజ్యాంగాభివృద్ధి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. పర్షియాకు చెందిన సోలోన్ లేదా స్పరాటాకు చెందిన లైకర్గస్ కంటే చాలా ముందుగానే మనువు చట్టాలను రచించారు. నేటికి కూడా మనుస్మృతిలో రచించబడిన చట్టాలు, ప్రపంచంలో ప్రశంసలు పొందుతూ, సహజమైన విధేయత, సమాజంలో అంగీకారమైన నిబంధనల అనుగుణ్యతలను బయటకు తీస్తున్నాయి. కానీ మన రాజ్యాంగ పండితుల దృష్టిలో ఇవేవీ లేవు''.
హిందూ మితవాదుల పెరుగుదలతో రాజ్యాంగం పట్ల వ్యతిరేకత కూడా పెరగసాగింది. 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడినప్పుడు, రాజ్యాంగాన్ని సమీక్షించాడానికి వెంకటాచలయ్య కమిషన్‌ను నియమించింది. కమిషన్ ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వెలువడింది. అయినప్పటికీ దానిని అమలు చేయడంలో బిజెపి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది.
ఆర్.ఎస్.ఎస్ - రాజ్యాంగం పట్ల వ్యతిరేకత
ఆర్.ఎస్.ఎస్ సర్సంగ్ చాలక్‌గా కె.సుదర్శన్ నియమించబడినపుడు...భారత రాజ్యాంగం పాశ్చాత్య విలువలపై ఆధారపడిందని, దాని స్థానంలో భారతీయ పవిత్ర గ్రంథాల (మనుస్మృతిని సూచిస్తూ)పై ఆధారపడిన రాజ్యాంగం రావాలని బహిరంగంగానే ప్రకటన చేశాడు.
''మన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేయడానికి ఏ మాత్రం సిగ్గుపడాల్సిన పని లేదు. ఇప్పటికే దానిని వంద సార్లు మార్చారు'' అంటాడాయన. ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని నాలుగు సార్లు సవరించిందన్నాడు. దీనికి పవిత్రత అంటూ ఏమీ లేదనీ, అసలు దేశంలో అనేక రుగ్మతలకు మూల కారణం ప్రస్తుత రాజ్యాంగమేనని ఆయన అంటాడు.
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వివిధ స్థాయి నాయకులు ఇలాంటి ప్రకటనలు అదేపనిగా చేస్తూనే వున్నారు. ఇటీవలి కాలంలో ప్రతిపక్ష పార్టీలు 'ఇండియా'గా ఏర్పడినప్పుడు, అనేకమంది మితవాదులు, 'ఇండియా' అనే పదాన్ని బ్రిటీష్ వారు సృష్టించారనే సాకుతో దానిని వ్యతిరేకించారు. ఈ 'ఇండియా' అనే పదం బానిసత్వానికి చిహ్నం కాబట్టి, రాజ్యాంగంలో ఆ పదం యొక్క స్థానం ఎక్కడ అంటాడు బిజెపి రాజ్యసభ ఎం.పి, నరేష్ బన్సాల్.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఇలా వ్యాఖ్యానించాడు. ''యూరో సెంట్రిక్ భావాలు, విధానాలు, ఆచారాలు ఇంకా దశాబ్దాలుగా మనల్ని పాలిస్తూనే ఉన్నాయి. స్వతంత్ర భారత దేశం వాటిని పూర్తిగా వదిలించుకోలేదు'' అన్నాడు.
రాజ్యాంగం పట్ల వ్యతిరేకత విషయంలో దేవరారు, ఆర్.ఎస్.ఎస్ ఆలోచనలు కలిశాయి. ఆర్‌ఎస్‌ఎస్ గణాలు రాజ్యాంగం యొక్క పాశ్చాత్య స్వభావం పైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తుండగా, స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాదం లాంటి అంశాల విలువలపై ప్రశ్నిస్తూ, దేవరారు అసలు విషయాన్ని బయట పెట్టాడు. వలసవాద వారసత్వ వాదన, పాశ్చాత్య ఆసియా దేశాలకు చెందిన 'ముస్లిం బ్రదర్‌హుడ్' లాంటి సంస్థలకు సమానంగా ఉంటుంది. ఇవి పాశ్చాత్యమైనవనే కారణంతో స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను వారు వ్యతిరేకిస్తారు. దేవరారు ప్రస్తుత పాలక వర్గానికి చెందిన వారు. భిన్న లింగ, మతాలు, కులాల మధ్య సమానత్వం ఉండాలనే భావనతో ఆయనకు ఏమాత్రం అంగీకారం లేదు.
రాజ్యాంగం - ప్రజాగ్రహం
వలస కాలంలో సమాజంలో కులం, లింగ వ్యవస్థలు కేంద్ర బిందువుగా ఉండడం వల్ల, ఆర్‌ఎస్‌ఎస్ గణాలు మనుస్మృతిని ఒక స్వర్ణ యుగంగా వర్ణిస్తున్నాయి. కానీ వలస కాలంలోనే లింగ, కుల వ్యవస్థలు వాటి పట్టును కోల్పోవడం మొదలైంది. ఈ కాలంలోనే కార్మికులు తమ సంఘాలను (నారాయణ్ మేఘాజీ లోఖాందే, కామ్రేడ్ సింగార్వేలు) ఏర్పరచుకోగలిగారు. ఈ కాలంలోనే పాలక వర్గాలు చేస్తున్న దోపిడీ గురించి, వాటిని వదిలించుకోవాల్సిన అవసరం గురించి భగత్ సింగ్ స్పష్టంగా వివరించాడు. వీటిలో చాలా పోరాటాలకు (వలస పాలన కింద ఉంటూ, వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ) భారతీయులే నాయకత్వం వహించారు. వలస కాలాన్ని మంచి లేదా చెడు జరిగిన కాలంగా చూడలేం, కానీ ఈ కాలంలో విచారకరమైన పరిస్థితులు ఉన్నాయి. వలస అధికారం మన సంపదను దోచుకొని పోవడంతో, వారు కూడా ''మనుషులంతా (మహిళలు కూడా) సమానం'' అని పేర్కొనే సంస్థలను ప్రారంభించాల్సి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ గణాలు, ప్రధానమంత్రి సలహాదారు, రాజ్యాంగాన్ని వదిలించుకోడానికి భిన్నమైన వాదనలను వినిపించవచ్చు. సారంలో వారు, భగత్ సింగ్ ప్రతిపాదించిన విలువలకు, సమానత్వానికి, అంబేద్కర్ ప్రారంభించిన పోరాటాలకు, ముఖ్యంగా జాతీయోద్యమానికి వ్యతిరేకంగా ఉంటారు.
1990ల వరకు భారత రాజ్యాంగం ఆధారంగా, నెహ్రూ ఆధునీకరణ విధానాలతో దేశం సమానత్వ మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనం తిరోగమన మార్గంలో ఉన్నట్లు కనపడుతున్నది. దేవాలయాలు, పవిత్ర గోవు వంటి అంశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రాచీన విలువలను (బ్రాహ్మణవాద వివరణలను నాగరిక విలువలుగా) ఉపయోగించడం ద్వారా...ప్రపంచంలోకెల్లా మహత్తరమైన ప్రజా ఉద్యమం (భారత స్వాతంత్య్ర పోరాటం)తో సాధించిన విజయాలను...బలహీనపరచి అసమానతల వైపు నడిపిస్తున్నారు.
భారత రాజ్యాంగానికి వ్యతిరేకత అంటే...మతం (బ్రాహ్మణవాదం) ద్వారా పవిత్రమైనదిగా పరిగణించబడిన అసమానతల (కులం, వర్గం, లింగ) యుగానికి దేశాన్ని నెట్టివేయడానికే ఈ వ్యతిరేకతను ఉపయోగించడం అవుతుంది.
(వ్యాస రచయిత మానవ హక్కుల కార్యకర్త,
ఐఐటీ బాంబేలో విశ్రాంత ప్రొఫెసర్)
('ద వైర్' సౌజన్యంతో)
రామ్ పునియానీ