Aug 12,2023 07:24

           మణిపూర్‌ మారణకాండపై నోరు మెదపని కేంద్ర ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదంటూ ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం..మూడు రోజుల చర్చ అనంతరం గురువారం మూజువాణి ఓటుతో వీగిపోయింది. మోడీ సర్కార్‌ వ్యూహాత్మక 'మౌనవ్రతం' భగమైంది. ఇది అందరూ ఊహించిందే. మణిపూర్‌లో శాంతిభద్రతలు పునరుద్ధరించడంలో బిజెపి 'డబుల్‌ ఇంజిన్‌' ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవ్వడం, మానవ హక్కుల హననంపై అంతర్జాతీయ సమాజం సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీని సభకు రప్పించి, జవాబులు రాబట్టాలనే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో సాంకేతికంగా బిజెపి విజయం సాధించినా.. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం.. మోడీని సభకు రప్పించి మణిపూర్‌పై ఆయన మౌనవ్రతాన్ని భగం చేసిన ప్రతిపక్షాల కూటమిదే అసలుసిసలైన విజయం.
         దేశ, ప్రజా ప్రయోజనాలకు మప్పు తెచ్చే విధానాలతో ప్రభుత్వం దారితప్పి నడుస్తున్నప్పుడు కళ్లెం వేసి దారికి తెచ్చేందుకు ప్రతిపక్షాలకున్న గొప్ప ఆయుధమే అవిశ్వాసం. రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం గురించి నేరుగా ప్రస్తావించలేదు. కానీ అధికరణ 75(3) ప్రకారం.. కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా దిగువసభ (ది హౌస్‌ ఆఫ్‌ పీపుల్‌ - ప్రజల సభ)కు బాధ్యత వహించాల్సి వుంటుంది. దీని అర్థం అధికారపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రజల సభలోని ప్రతి సభ్యునికీ మంత్రి మండలి బాధ్యత వహించాల్సిందే. ఈ బాధ్యత ఆధారంగానే అవిశ్వాస తీర్మానం రూపంలో ప్రతిపక్షాలకు ఒక బలమైన ఆయుధం దక్కింది. గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు దానిని ఆయన 'అవమానాన్ని మించిన భారం'గా అభివర్ణించారు. ఒక ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించారంటే అది సదరు ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాల్సిన స్థితి అని వాజ్‌పేయి మాటలను బట్టి అర్థం అవుతుంది. కానీ మూడురోజుల పాటు చర్చ జరిగితే రెండు రోజులు ముఖం చాటేసి చివరి రోజు ప్రసంగించిన మోడీ చెప్పిందేమిటీ? అవిశ్వాసం తీర్మానం తమ ప్రభుత్వానికి 'దేవుడు ఇచ్చిన వరం'గా అభివర్ణించారు. సిగ్గుఎగ్గూ అన్నీ వదిలేశారన్నమాట! దాదాపు గంటన్నర పాటు ప్రసంగించిన ఆయన మూడు నిమిషాలు మినహా సాంతం ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయడంతోనే సంబరపడ్డారు. మణిపూర్‌లో జరగరాని ఘటనలు జరిగాయని, గాయాన్ని పూడ్చి శాంతి నెలకొల్పుతామని ముక్తసరిగా ముగించారు.
           స్వీయ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించినప్పుడు సభాధినేతగా సభకు హాజరై చర్చలో సభ్యులు లేవనెత్తే అంశాలను ఆలకించి వారిని సమాధానపర్చి అటు సభ్యుల్లోనూ, ఇటు దేశ ప్రజానీకంలోనూ విశ్వాసం నింపడం నిజాయితీగల ప్రభుత్వాధినేత చేసే పని. ప్రజలకు తాము చేసిన మేలును వివరించి..భరోసానివ్వడం నైతిక ధర్మం. కానీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి నిరంకుశ చర్యలతో ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, కార్పొరేట్‌ కంపెనీలకు దేశ వనరులను దోచిపెడుతూ వినాశకర పాలన సాగిస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్‌కు రాజ్యాంగ నిబంధనలను గౌరవించే సోయి లేకపోవడం ఆశ్చర్యమేమీ కాదు. భారత రాజ్యాంగ పీఠికలోని మౌలిక సూత్రాలైన సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర భావనలు పరాయి దేశాలవని అవహేళన చేస్తూ సంఫ్‌ు పరివార్‌ కనుసన్నల్లో నడుచుకునే నరేంద్ర మోడీ సర్కార్‌ భారత ప్రజాస్వామ్యంపైనా, పార్లమెంటరీ పాలనావ్యవస్థపైనా, సుప్రీంకోర్టుపైనా దాడికి తెగబడుతోంది. అవిశ్వాస తీర్మానానికి సరైన జవాబుదారీగా నిలబడటంలో ఘోరంగా విఫలమైన బిజెపి ప్రభుత్వం గందరగోళ పరిస్థితుల్లోనే ఢిల్లీ ఆర్డినెన్స్‌, ఎన్నికల సంఘం నిబంధనలు, అటవీ సంరక్షణ సవరణ చట్టం వంటి వినాశకరమైన బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలిచ్చిన తీర్పులను సైతం తుంగలో తొక్కిందంటే దాని బరితెగింపును అర్థం చేసుకోవచ్చు. ఇంతటి అరాచకాల ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తే ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు నిలదీయాల్సిన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు బిజెపి గట్టున నిల్చోవడం దుర్మార్గం. ఏదేమైనా ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' అధికార బిజెపి వెన్నులో వణుకు పుట్టిస్తోందన్న సంగతి ఈ అవిశ్వాసం తీర్మానంపై చర్చలో పాల్గొన్న మోడీ సహా అధికార పక్ష సభ్యుల ప్రసంగాల్లో ప్రతిధ్వనించింది. ప్రజల మధ్య విద్వేషాగ్ని రాజేసి సంఫ్‌ు పరివారం సాగిస్తున్న అరాచకాలను ఎండగట్టేందుకు 'అవిశ్వాసం తీర్మానం' ద్వారా లభించిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంలో ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' సఫలీకృతమైందనే చెప్పాలి.