Jul 19,2023 07:54

న్యూఢిల్లీ : డిఫ్తీరియా, పెర్టుసిస్‌, టెటానస్‌ వ్యాక్సిన్ల మూడో డోసు (డిపిటి 3) వ్యాక్సినేషన్‌లో భారత్‌ కొత్త రికార్డు నమోదు చేసింది. గత ఏడాది 2022లో ఈ వ్యాక్సినేషన్‌ కవరేజ్‌ 93 శాతానికి పెరిగింది. 2019లో నమోదు చేసిన రికార్డు 91 శాతం కవరేజ్‌ను ఇది అధిగమించింది. 2022 జాతీయ ఇమ్యునైజేషన్‌ కవరేజీని మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ), యూనిసెఫ్‌ విడుదల చేశాయి. మొత్తంగా ఆగేసియా ప్రాంతంలో డిపిటి3 కవరేజ్‌ రేటు 91 శాతంగా నమోదయింది. వ్యాక్సినేషన్‌ కవరేజ్‌ కరోనా మహమ్మారి ముందు స్థాయికి చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా భారత్‌, ఇండోనేషియాలకు అభినందనలు తెలిపింది. ఈ ప్రాంతంలో డిపిడి డోసు ఒక్కటి కూడా తీసుకొని చిన్నారుల సంఖ్య 2021లో 4.6 మిలియన్లగా ఉండగా, 2022లో ఈ సంఖ్య సగానికి అంటే 2.3 మిలియన్లకు తగ్గడంపై భారత్‌, ఇండోనేషియాల కృషి ఎంతో ఉందని డబ్ల్యూహెచ్‌ఒ తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఒ ఆగేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ ఈ విషయంపై మాట్లాడుతూ భూమి మీదకు వచ్చే ప్రతీ బిడ్డ సాధారణ రోగనిరోధకతతో ఉండి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించబడాలని అన్నారు. ఇండోనేషియాలో డిపిడి3 వ్యాక్సినేషన్‌ కవరేజ్‌ 2022లో 85 శాతంగా నమోదయిందని చెప్పారు.