గాజా : గాజా ఆస్పత్రుల దాడులపై ప్రపంచం ఇకపై మోనం వహించబోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) సోమవారం తెలిపింది. ఇజ్రాయిల్ జరుపుతున్న అమానవీయ దాడులతో గాజాలోని ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గాజాలోని మొత్తం 36 ఆస్పత్రుల్లో 20 ఇప్పుడు పనిచేయడం లేదని ఐక్యరాజ్యసమితి మావనతా విభాగం తెలిపింది.
'' గాజాలోని అల్ షరీఫ్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులతో సంప్రదింపులు జరపగలిగాం.. ఆస్పత్రి ఇకపై ఆస్పత్రిగా పనిచేయదు'' అని డబ్ల్యుహెచ్‌ఒ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ''సురక్షిత స్వర్గధామంగా ఉండాల్సిన ఆస్పత్రులు మృతులు, విధ్వంసం, నిరాశలకు నిలయంగా రూపాంతరం చెందుతున్నప్పుడు ప్రపంచం మౌనంగా చూస్తూ ఉండదు '' అని పేర్కొన్నారు.
సుమారు 3,000 మంది రోగులు మరియు సిబ్బంది ఆస్పత్రి కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయిన వారికి తగినంత నీరు, ఆహారం ఆందకపోవడంతో అత్యవసర సేవలపై తీవ్ర ప్రభావం పడిందని టెడ్రోస్ పేర్కొన్నారు. తమ సైనికులు 300 లీటర్ల ఇంధనాన్ని ఆస్పత్రికి అందించారన్న ఇజ్రాయిల్ వ్యాఖ్యలను అల్ షిపా డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియా తిరస్కరించారు. 300 లీటర్లతో పావుగంట కన్నా ఎక్కువ సేపు జనరేటర్లు పనిచేయలేవని అన్నారు.
ఉత్తర గాజాలో పరిస్థితి భయంకరంగా ఉందని, ఇక్కడి ఆస్పత్రులకు ఇజ్రాయిల్ దళాలు దిగ్బంధించాయని, లోపల ఉన్న వారికి సంరక్షణ అందించలేకపోతున్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. విద్యుత్ అంతరాయం కారణంగా ఆస్పత్రిలో ఇద్దరు నవజాత శిశువులు సహా ఓ వ్యక్తి మరణించారు. పలువురు రోగులు ప్రమాదకరస్థితిలో ఉన్నారని వెల్లడించిన సంగతి తెలిసిందే. చుట్టుపక్కల ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతున్నందున వేలాది మంది అల్‌షిపా ఆస్పత్రిలో ఆశ్రయం పొందారు. గాజా నగరంలోని అల్ -ఖుద్స్ ఆస్పత్రిలో కూడా ఇంధనం లేకపోవడంతో జనరేటర్ పనిచేయడం లేదని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపింది. గాజాలోని ఆస్పత్రులను హమాస్ తమ ఆపరేషన్ల కోసం వినియోగిసున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.