Oct 28,2023 21:57

న్యూఢిల్లీ : గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండను ఆపాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరు కావడం దిగ్భ్రాంతికి గురిచేసందని సిపిఎం, సిపిఐ విమర్శించాయి. ఈ మేరకు ఆ రెండు పార్టీల ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి రాజా శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదలజేశారు. గాజాలో 'పౌరుల రక్షణ, చట్టపరమైన, మానవనతాపరమైన బాధ్యతలను పరిరక్షించడం' అన్న శీర్షికతో మానవతా ఒప్పందం కోసం పిలుపునిస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించిందని, ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరవడం భారత విదేశాంగ విధానాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా మలచడమేనని ఆ ప్రకటన పేర్కొంది. మోడీ ప్రభుత్వ చర్యలు అమెరికా-ఇజ్రాయిల్‌-భారత్‌ మధ్య అపవిత్ర పొత్తును మరింత సంఘటితపరిచేలా వున్నాయని పేర్కొంది. పాలస్తీనా ప్రయోజనాలకు భారత్‌ చిరకాలంగా కొనసాగిస్తూ వస్తున్న మద్దతును ఇది విస్మరించిందని ఆ ప్రకటనలో వారు విమర్శించారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీనీ తీర్మానం చేసిన తరువాత ఇజ్రాయిల్‌, గాజా స్ట్రిప్‌లో వైమానిక, భూతల దాడులను మరింత ఉధృతం చేసింది. దాదాపు 22లక్షల మంది పాలస్తీనియన్లు వున్న గాజాకు అన్ని రకాల కమ్యూనికేషన్లను నిలిపివేసింది. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో ఆమోదించిన తీర్మానాన్ని గౌరవిస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సిపిఎం, సిపిఐ డిమాండ్‌ చేశాయి. 1967కి ముందునాటి సరిహద్దులతో, పాలస్తీనా దేశానికి తూర్పు జెరూసలెం రాజధానిగా రెండు దేశాల ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కారం అని భద్రతా మండలి గతంలో చేసిన తీర్మానాన్ని అమలు చేసేందుకు, అలాగే తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చూసేందుకు ఐక్యరాజ్య సమితి తన శక్తియుక్తులనన్నిటినీ ఉపయోగించాలని సిపిఎం, సిపిఐ కోరాయి.