Sep 14,2022 06:49

ఆహార అభద్రత అంటే ప్రజలు తమకు ఆహారం అందుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో జీవించడం. అందువలన వారు తీసుకునే ఆహారంలో పోషకాహారం లోపించే అవకాశాలు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవ్స్‌, ఇరాన్‌, నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీలంక వంటి దేశాలు తమ గణాంకాలను సమర్పించాయి. భారతదేశం ఈ అంశాలకు సంబంధించి తన దగ్గర ఉన్న గణాంకాలను అందించలేదంటున్నారు గణాంకాలను క్రోడీకరించే ఆర్థికవేత్త.

ప్రపంచ వ్యాప్తంగా ఆకలి పెరుగుతున్నదని 'ఆహార, వ్యవసాయ సంస్థ' (ఎఫ్‌.ఎ.ఓ) సమర్పించిన తాజా నివేదిక తెలియచేస్తోంది. యునిసెఫ్‌, డబ్ల్యు.హెచ్‌.ఓ, డబ్ల్యు.ఎఫ్‌.పి, వ్యవసాయ అభివృద్ధి అంతర్జాతీయ ఆర్థిక సంస్థ కలిసి ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం ఏ మేరకు ఉందో అంచనా వేస్తాయి. 'వివిధ దేశాల ఆహార భద్రత, పోషకాహారం-2022' నివేదికలో ఒక మోస్తరు నుండి తీవ్రమైన ఆహార అభద్రతతో అల్లాడుతున్న దేశాల పేర్లున్నాయి. కానీ అందులో భారతదేశం లేదు. ముఖ్యంగా 2014-2021 మధ్య కాలంలోని గణాంకాలను ప్రచురించడాన్ని మన ప్రభుత్వం అడ్డుకుంది. అయితే, ఆహార భద్రత, పోషకాహారం గురించి వివిధ దేశాలు ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. భారతదేశంలో పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లేకపోవడం, ఆహారం వృధా కావడం, పసి పిల్లలు, పెద్దలు స్థూలకాయులవడం, మహిళల్లో రక్తహీనత వగైరాలకు సంబంధించిన గణాంకాలు ఎఫ్‌.ఎ.ఓ దగ్గర ఉన్నాయి.
    ఆహార అభద్రత అంటే ప్రజలు తమకు ఆహారం అందుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో జీవించడం. అందువలన వారు తీసుకునే ఆహారంలో పోషకాహారం లోపించే అవకాశాలుంటాయి. ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవ్స్‌, ఇరాన్‌, నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీలంక వంటి దేశాలు తమ గణాంకాలను సమర్పించాయి. భారతదేశం ఈ అంశాలకు సంబంధించి తన దగ్గరున్న గణాంకాలను అందించలేదంటున్నారు గణాంకాలను క్రోడీకరించే ఆర్థికవేత్త.
    భారతదేశం తన గణాంకాలను సమర్పించకపోయినా, ఆహార వ్యవసాయ సంస్థ దగ్గరున్న గణాంకాల సాయంతో ఒక చిన్న మెళకువను ఉపయోగించి భారతదేశంలో ఉన్న ఆహార కొరతను అంచనా వేయవచ్చు. భారతదేశాన్ని మినహాయించి (200.7 మిలియన్ల)...మొత్తం దక్షిణ ఆసియాలో (764.3 మిలియన్లు) ఒక మోస్తరు నుంచి తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్టుగా నివేదికలోని గణాంకాలు తెలియచేస్తున్నాయి. అంటే భారతదేశంలో 563.6 మిలియన్ల ప్రజలు ఒక మోస్తరు నుంచి తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని అంచనాకు రావచ్చు. అంటే, 2019-2021 మధ్య కాలంలో 41 శాతం జనాభా ఆహార కొరతను ఎదుర్కొంటున్నారన్నమాట. ఇందులో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న వారు 307.7 మిలియన్లు ఉంటారని అంచనా. అంటే జనాభాలో 22.4 శాతం అన్నమాట. ఈ సంఖ్య 2018-2020లో 278.3 మిలియన్లు. అదే మొత్తం దక్షిణ ఆసియాలో 324 మిలియన్ల అంటే 20.3 శాతం.
    మొత్తం ఆసియాలో 2020లో ఆరోగ్యవంతమైన ఆహారం అందుబాటులో లేని వారి సంఖ్య 1891.4 మిలియన్లు. అందులో దక్షిణ ఆసియాలో సరైన ఆహారం సంపాదించుకోలేనివారు 973.3 మిలియన్లు. ఒక్క భారతదేశం లోనే 563.6 మిలియన్ల ఉన్నారంటే, మంచి పోషకాహారాన్ని పొందలేకపోతున్న వారిలో సగానికి సగం మంది మన దేశంలో ఉన్నారన్న మాట.
 

                                                                    ప్రపంచ ఆకలి పరిస్థితి

ప్రపంచవ్యాప్తంగా 2021లో ఆర్థిక పురోగమనం, ఆదాయాలలో పెరుగుదల ఒకేరకంగా లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య పెరిగింది. తాము సమర్పించే నివేదికల ద్వారా సరైన ఆహారం అందుబాటులో లేని కింది వర్గాలకు ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చే విధానాలను రూపకల్పన చేసే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది-అని ఎఫ్‌.ఏ.ఓ భావిస్తున్నది.
    తీవ్రమైన ఆహార కొరతగల వారి సంఖ్య 2020-2021లలో పెరిగింది. కానీ ఒక మోస్తరు ఆహార కొరత ఎదుర్కొంటున్న వారి సంఖ్య దాదాపు స్థిరంగా ఉంది. దక్షిణ ఆసియాలో కిందటేడు 260.3 మిలియన్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కోగా ఈ ఏడు ఆ సంఖ్య 412.9 మిలియన్లకు చేరింది. ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ఆహార కొరతలో సగం వాటా ఆసియా ఖండానిదే.
     ఆరోగ్యవంతమైన ఆహారం అందుబాటులో ఉండాలంటే, పోషకాహార ధరలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల ఆదాయాలకు అనుగుణంగా ఉండాలి. పోషకాహారం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా అందుబాటులో ఉండాలి. ఆకలిని అదుపు చేయడంలో, ఆహార భద్రత కల్పించడంలో, పోషకాహారాలు అందించడంలో ప్రపంచం వెనకడుగేస్తోందంటున్నాయి యునైటెడ్‌ నేషన్స్‌ సంస్థలు. ఈ సంక్షోభానికి కారణం-ఘర్షణలు, ఆర్థిక ఒడిదుడుకులు, పర్యావరణ సమతుల్యత లోపించడంతో పాటుగా పోషకాహార ధరలు పెరుగుతుండడం. అందువలన అనేక దేశాలు 2030 నాటికి ఆహారంలో స్థిరమైన అభివృద్ధి సాధించాలనే తమ లక్ష్యాన్ని సాధించడం కష్టమవుతుంది-అంటున్నాయి నివేదికలు.
తామిచ్చిన నివేదిక ఆధారం చేసుకుని ప్రభుత్వాలు తమ ఆహార వ్యవసాయ విధానాలలో ఎలా జోక్యం చేసుకుంటాయో తెలుసుకుంటుందీ నివేదిక. ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే తమ బడ్జెట్లలో పోషకాహారాల ధరలు తగ్గించే విధంగా కేటాయింపులు పెంచడం. కరోనా మహమ్మారి వ్యాపించడం వలన తమ ఆర్థిక వనరులలో కోతలు పడినప్పటికీ ఈ కేటాయింపులు పెంచాలని తాత్పర్యం.
    ప్రపంచ ఆహార వ్యవస్థ ఎంత అసమానంగా, బలహీనంగా ఉందో కరోనా కారణంగా బయటపడింది. దీనికి ఉక్రెయిన్‌ యుద్ధం తోడయ్యింది. ఆహార సరఫరాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ధరలు అదుపు తప్పాయి. అయితే, ఈ పరిమితమైన వనరులను ఉపయోగించి కూడా ప్రభుత్వాలు ప్రజలకు ఆహారాన్ని అందించడంలో, వ్యవసాయాన్ని పునరుద్ధరించడంలో సమత్వాన్ని, స్థిరత్వాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ నివేదిక పప్పుధాన్యాలు, గింజలు, పళ్ళు, కూరగాయలు, ఇతర బలవర్ధక ఆహారాలు బదులుగా ధాన్యం పండించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా తెలియచేసింది. ధాన్యాల వినియోగం వలన తీసుకునే క్యాలరీలు పెరగవచ్చు గాని, సమతుల ఆహారం పొందే అవకాశం ఉండదు.
పోషకాహార లోపం 2015 నుంచి 2019 వరకు స్థిరంగా ఉంది. 2019లో నమోదైన 8 శాతం నుంచి 2020లో ఒక్కసారిగా 9.3 శాతానికి పెరిగిపోయింది. 2030 నాటికి ప్రపంచ జనాభాలో 630 మిలియన్ల అంటే దాదాపు 8 శాతం ప్రజలు ఆకలితో అలమటిస్తారని అంచనా.
 

                                                             దక్షిణ ఆసియాలో పోషకాహార లోపం

ఆసియాలో 424.5 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతుండగా ఒక్క దక్షిణ ఆసియాలో 331.6 మిలియన్ల మంది ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక పోషకాహార లోపం గల ప్రాంతం. 2019లో 13.2 శాతం ఉండగా 2020కి 15.9 శాతానికి, 2021కి మరింతగా పెరిగి 16.9 శాతానికి చేరింది. వాయువ్య ఆసియాలో అత్యల్పంగా 6.3 శాతం నమోదైంది. ప్రపంచ జనాభాలో సగానికి సగం ఆకలితో అలమటించేవారు ఆసియాలో ఉండగా, మూడో వంతు మంది ఆఫ్రికాలో ఉన్నారు.
    వివక్షకు గురవుతున్న మహిళలు, యువత, నైపుణ్యం లేని కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు కరోనా వలన మరింత ఎక్కువగా బాధపడ్డారు. ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం 2020లో ఆదాయాలు పోగొట్టుకున్న 20 శాతం పైతరగతుల వారు 2021లో తిరిగి సమకూర్చుకోగలిగారు. కానీ కింది 40 శాతం మంది పోగొట్టుకున్న ఆదాయాలను తిరిగి పొందలేదు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ప్రపంచంలో అసమానతలు పెరిగాయి. ఈ కాలంలో 40 శాతం ప్రభుత్వాలు సామాజిక రక్షణ చర్యలను ఒకే ఒక్కసారి చేపట్టి చేతులు దులుపుకున్నాయి. మూడు వంతుల సంక్షేమ పథకాలు మూడు నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం అమలయ్యాయి.
 

                                                                   ఆరోగ్యకరమైన ఆహారం అవసరం

ఆకలి, ఆహార అభద్రత, పోషకాహార లోపం వంటి వాటిని అధిగమించే విధానాలు ఎంత మాత్రం అమలవడం లేదు. ప్రభుత్వాలు, సబ్సిడీ ధాన్యాలను ప్రజలకు అందుబాటులో తేగలుగుతున్నాయిగాని పళ్ళు, కూరగాయలు, వంటి పోషకాలు అందించే ఆహార పదార్థాలు అందించడం లేదు. అల్పాదాయ వర్గాలకు, వీటి ధరలు అందుబాటులో లేకపోవడం వలన వినియోగం సాధ్యపడడం లేదు. దాంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడం పెద్ద సవాలుగా ఉంది.
    ప్రపంచవ్యాప్తంగా 3.1 బిలియన్‌ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. ఆహారం, వ్యవసాయ విధానాలకి ప్రభుత్వ మద్దతు ఏ మేరకు ఇవ్వాలో నిర్ణయిస్తున్నది మార్కెట్‌ ఒడిదుడుకులే గాని ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలనే లక్ష్యం కాదు.
    అందువలన 2030 నాటికి ఆకలిని అంతం చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. సామాజిక భద్రతా వలయం ప్రపంచవ్యాప్తంగా కుంచించుకుపోయింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా మరో 46 మిలియన్ల ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకున్నారు. 702-828 మిలియన్ల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇందులో అత్యధిక భాగం ఆఫ్రికాలో ఉన్నారన్న విషయం గమనించాలి. ఆఫ్రికాలో 26 శాతం ప్రజలు ఆకలితో ఉండగా ఆసియాలో 9.1 శాతం, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాలలో 8.6 శాతం, ఒసీనియా లో 5.8 శాతం, ఉత్తర అమెరికా, యూరప్‌ లో 2.5 శాతం కంటే తక్కువ మంది ఆకలితో బాధపడుతున్నారు.
      కోవిడ్‌ మహమ్మారి, పర్యావరణంలో మార్పులు దేశం లోపల, వివిధ దేశాల మధ్య అంతరాలను పెంచుతుండగా...మనం దృష్టి పెట్టాల్సిన మరో ప్రధానమైన అంశం ఆహార ధాన్యాలు. వ్యవసాయ పంటలంటే ధాన్యాలు మాత్రమే కాదని గమనించాలి. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ధాన్యాల ఉత్పత్తిపై ఉంటుందనేది ఒక వాస్తవం. దాని ప్రభావం ఒక్క ధ్యాన్యం పైనే కాదు. ఎరువులు, విద్యుత్‌ శక్తి సరఫరాలపై కూడా ఉంటుంది. ఉక్రెయిన్‌, రష్యాలు ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయ, ధాన్యం ఉత్పత్తి, సరఫరా కేంద్రాలు.
    ఎక్కువ క్యాలరీలు ఉండడం, తక్కువ ఉత్పత్తి ఖర్చు అవ్వడం వల్ల ధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహించే విధానాలు ప్రభుత్వాలు అవలంభిస్తున్నాయని వాదించవచ్చు. వీటి వినియోగం వలన పోషకాహారం అందుబాటులో లేకపోయినా, కనీసం ఆకలి తీరే అవకాశం ఉంటుంది. వరి ధాన్యం ఉత్పత్తి, అత్యధిక కర్బన వాయు కాలుష్యానికి కారణం అవుతుంది. క్యాలరీలు అధికంగా పొందగలిగినా, పోషకాలు ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దీనిని అధికంగా వినియోగిస్తున్నారు.
    ప్రభుత్వాలు అనుసరించే ఆహార, వ్యవసాయ విధానాల ప్రభావం ఎలా వుంటుందనే అంశాన్ని ఈ నివేదిక ప్రధానంగా పరిశీలించింది. నిజానికి, ప్రభుత్వాలు మద్దతిస్తున్న ఆహార వ్యవసాయ విధానాల వలన పోషకాహార ధరలు బాగా పెరుగుతున్నాయని, పోషక విలువలు లేని అనారోగ్యకరమైన ఆహారం ప్రజలకు అందుబాటులోకి వస్తున్నదని ఆ నివేదిక అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయ విధానం ఎలా ఉండాలనేది సూచించింది. ఆహార-వ్యవసాయ విధానాలు సమర్ధవంతంగా, స్థిరంగా, సమానత్వం సాధించే దిశగా ఉండాలని...వాణిజ్య ప్రయోజనాలు తీర్చే విధంగా ఉండకూడదని సూచించింది.
    ప్రపంచ ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనలో ఎఫ్‌ఏఓ నివేదికకు ఎంతో ప్రాధాన్యత వుంది. భారత ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాలి. అలాగే, తన దగ్గరున్న గణాంకాలను ఎఫ్‌ఏఓ తో పంచుకోడానికి నిరాకరించడం వల్ల ఆహార భద్రతకు ఎంత నష్టం కలుగుతుందనేది కూడా ఆలోచించాలి.

/'ఫ్రంట్‌లైన్‌' సౌజన్యంతో/
టి.కె. రాజాలక్ష్మి

టి.కె. రాజాలక్ష్మి