Aug 05,2023 07:19

ప్రతిపక్ష పార్టీలు ఏర్పరచుకున్న 'ఇండియా' పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయడం అనేది నిస్సందేహంగా మన నాగరికత సమ్మిళిత విలువలను వ్యతిరేకించడమే. భారతీయ నాగరికత అభివృద్ధి ఫలితంగానే మన రాజ్యాంగం ఏర్పడిందనేది విస్మరించకూడదు. హిమంత శర్మకు ప్రీతిపాత్రమైన విభజన రాజకీయాలపై 'ఇండియా' విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

         భారతీయ జనతా పార్టీ గత తొమ్మిదేళ్ళుగా అధికారంలో ఉంటున్నది. ఈ పార్టీ రాజ్యాంగబద్ధంగా లేదా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆధారంగా ఏర్పడే సమ్మిళిత భారతదేశం కోసం పాలన చేయడం లేదని ప్రతిపక్ష పార్టీలకు క్రమంగా అర్థమైంది. ప్రతిపక్ష పార్టీలను బలహీన పర్చేందుకు అధికార పార్టీ ఇ.డి, సిబిఐ లాంటి ఏజెన్సీలను ప్రధానమైన సాధనాలుగా ఉపయోగించుకుంటున్నది. బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలు ఒకవైపు ఆశ్రిత పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ, మరోవైపు ప్రజాస్వామిక స్వేచ్ఛను బలహీనపరుస్తున్నాయి.
         అస్తిత్వం, రామమందిరం, లవ్‌ జీహాద్‌, ఇతర జీహాద్‌ లు, ఆవు మాంసం, పొరుగు వారికి వ్యతిరేకంగా తీవ్ర జాతీయవాద విన్యాసాలకు సంబంధించిన అంశాలే కేంద్రంగా, అధికార పార్టీ రాజకీయాలు నడుస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, కోవిడ్‌-19 మహమ్మారి వ్యాపించినప్పుడు కేవలం కొద్ది సమయం ముందు ప్రకటించి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌, పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల సమస్యలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీ మతస్థులకు వ్యతిరేకంగా పెరుగుతున్న దారుణమైన అకృత్యాల వంటి అనేక సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు సమాజంలోని సగటు జీవుల, పేద ప్రజల కడగండ్లను మరింతగా పెంచాయి.
          ఎన్నికల బాండ్లతో లెక్కలేనంత డబ్బును కూడబెట్టడం ద్వారా అత్యంత ధనిక జాతీయ పార్టీగా తయారైన బిజెపి తన రాజకీయ ప్రయోజనాల కోసం సెంట్రల్‌ ఏజెన్సీలను ఉపయోగించుకోసాగింది. మన వ్యవస్థను అస్థిరపరచి, సమస్యలకు కారణమైన మరొక యంత్రాంగం 'పీ.ఎం కేర్‌ ఫండ్‌'. అన్నిటికంటే అత్యంత దారుణమైన విషయం ఏమంటే, బిజెపికి ఎన్నికల సమయంలో ఎలాంటి వైఫల్యాలు లేకుండా గట్టిగా పని చేసే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌) అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు బిజెపికి వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఈ విధమైన అంశాలే, బిజెపి యేతర పార్టీలను ఐక్యం చేసి, ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇంక్లూజివ్‌ అలయెన్స్‌ (ఇండియా)ను ఏర్పరచే పరిస్థితులు కల్పించాయి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి, బూత్‌ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తన కోసం పనిచేసే యంత్రాంగం ఉన్న బిజెపిపై పోరాడటానికి ... 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో జరుపుకున్న మలి సమావేశంలో ఈ 'ఇండియా' ను రూపొందించడం జరిగింది.
ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావడంతో బిజెపి మేల్కొని చేసిన మొదటి పని ఏమంటే, ముప్పై ఎనిమిది (అందరికీ తెలిసిన, అందరికీ తెలియని) చిన్నాచితకా పార్టీలను బయటకు తీసుకొచ్చి ఒక్కచోటకి చేర్చడం. బ్యానర్‌ పైన కనిపించే ఒకేఒక్క నాయకుడు చెప్పిన విధంగా నడుచుకుంటామని 38 పార్టీల నాయకులు (తమకు ఇష్టం లేకపోయినా) తలవంచారు. ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటుచేసుకున్న 'ఇండియా' పేరును చూసి బిజెపి వారు తీవ్రంగా కలత చెందారు. ప్రతిపక్ష పార్టీలను అప్రతిష్టపాలు చేయడంతోపాటు కొంతమంది నాయకులు అలాంటి పదాన్ని ఉపయోగించడం సరి కాదన్నారు. ఢిల్లీ లోని బరఖంబా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.
           అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ వివిధ స్థాయిల్లో 'ఇండియా'పై వ్యాఖ్యానించారు. ''మన నాగరికతకు సంబంధించిన వైరుధ్యాలు ఇండియా, భారత్‌లపై ఆధారపడి ఉన్నాయి. బ్రిటీష్‌ వారు మన దేశానికి 'ఇండియా' అని పేరు పెట్టారు. వలసవాద వారసత్వం నుండి మనల్ని మనం విముక్తం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మన పూర్వీకులు భారత్‌ కోసం పోరాటం చేశారు కాబట్టి మనం కూడా భారత్‌ కోసం కృషిని కొనసాగించాలి'' అన్నారు.
           హిమంత శర్మ వ్యాఖ్యలకు స్పందిస్తూ, కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఇలా ట్వీట్‌ చేశారు: ''ఆయన(శర్మ) కొత్త మెంటర్‌ మోడీ మనకు స్కిల్‌ ఇండియా (నైపుణ్య భారత్‌), స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా లాంటి కొత్త పేర్లను పథకాలకు పెట్టారు. ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను 'టీమ్‌ ఇండియా'లా కలిసి పని చేయాలని కోరారు. ఆఖరికి ఆయన ఇండియాకు ఓటు వేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. కానీ 26 ప్రతిపక్ష పార్టీల వారు రూపొందించిన కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టినందుకు ఆయనకు కోపం వచ్చి ఇండియా పదాన్ని ఉపయోగించిన తీరు వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు''.
            దీనితో ఖంగుతిన్న హిమంత తన ట్విట్టర్‌ ఖాతాలో 'ఇండియా కోసం బిజెపి'ని, 'భారత్‌ కోసం బిజెపి'గా మార్చారు.
      భారతీయ నాగరికత గురించి బిజెపి కి చాలా సంకుచితమైన అవగాహన ఉంది. బిజెపి ఎప్పుడూ హిందూ మతం యొక్క బ్రాహ్మణవాద సాంప్రదాయాల గురించి విసుగు పుట్టించే విధంగా మాట్లాడుతుంది. గ్రీకులు, హన్‌ లతో జరిగిన సంపర్కాన్ని విస్మరించి, ఇస్లాం, క్రైస్తవం రాకను, మన నాగరికతపై 'విదేశీయులు' చేసిన దురాక్రమణగా ప్రచారం చేస్తున్నారు.
          బ్రాహ్మణవాద విలువల ఆధారంగా పాలించబడిన గతానికి సంబంధించి... హిమంత శర్మ, అయన సంస్థల ప్రాపంచిక దృష్టి కోణం చాలా అసాధారణమైన రీతిలో ఉంటుంది. ఆఖరికి చార్వాకుడు, బుద్ధుడు, మహావీరుడు, అశోక చక్రవర్తి లాంటి వారు అందించిన గొప్ప భారతీయ సాంప్రదాయాలకు, భక్తి, సూఫీ సంప్రదాయాలు చేసిన తోడ్పాటుకు వారి దృష్టిలో అసలు స్థానమే లేదు. రొమిల్లా థాపర్‌, ఇర్ఫాన్‌ హబీబ్‌, రాంశరణ్‌ శర్మ, హర్బన్స్‌ ముఖియా లాంటి వామపక్ష చరిత్రకారుల పట్ల వారికి తీవ్ర ద్వేషభావం ఉంది. పుట్టుక ఆధారంగా ఏర్పడే కులం చుట్టూ తిరిగే వారి భారతీయ నాగరికత గురించి ఉండే దృష్టి కోణంలో చరిత్రకారుల పట్ల వారి ద్వేషభావం దాగి ఉంది. ఈ వృత్తిపరమైన చరిత్రకారులు సమాజం యొక్క లోతైన గతిశీలతను అత్యంత అద్భుతంగా వెలుగులోకి తీసుకొచ్చారు. వారు 'పాలకుల మతం' గురించి మాత్రమే కాక, దళితులు, మహిళలు, ఆదివాసీల జీవితాలను కూడా వివరించడం ద్వారా నిజమైన భారతీయ నాగరికత లోని భిన్నత్వాన్ని తెలియజేశారు. వలసవాదుల విశ్వాసాల ద్వారా చరిత్రను చూస్తున్న మితవాద స్రవంతి నేడు వలసవాద వారసత్వాన్ని కొనసాగిస్తున్నది. సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించడం వారి లక్ష్యం. కాబట్టే వారు రాజు యొక్క మతం ద్వారా చరిత్రను చూడడాన్ని ప్రవేశపెట్టారు.
          వారు భారత రాజ్యాంగాన్ని ప్రధానమైన అడ్డంకిగా భావిస్తున్నారు. భారత జాతీయవాదం పెరగడం ప్రారంభమవడంతో వారు మనుస్మృతిని, దానిలోని చట్టాలను స్తుతించడం మొదలు పెట్టారు. వారి జాతీయవాదానికి ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు అంతర్గత ప్రమాదకారులనే ముద్ర వేశారు. ఇలాంటి రాజకీయాల ద్వారా, మరీ ముఖ్యంగా ఈ దేశానికి ఈ రాజ్యాంగం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు పూర్వ సర్సంగ్‌ చాలక్‌ కె.సుదర్శన్‌ ద్వారా భారత రాజ్యాంగం పట్ల ఉన్న తమ వ్యతిరేకతను చాలా స్పష్టంగా వ్యక్తీకరించారు.
         ప్రతిపక్ష పార్టీలు ఏర్పరచుకున్న 'ఇండియా' పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయడం అనేది నిస్సందేహంగా మన నాగరికత సమ్మిళిత విలువలను వ్యతిరేకించడమే. భారతీయ నాగరికత అభివృద్ధి ఫలితంగానే మన రాజ్యాంగం ఏర్పడిందనేది విస్మరించకూడదు. హిమంత శర్మకు ప్రీతిపాత్రమైన విభజన రాజకీయాలపై 'ఇండియా' విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

(వ్యాసకర్త ఐఐటీ మాజీ ప్రొఫెసర్‌, సామాజిక కార్యకర్త)
రామ్‌ పునియానీ

రామ్‌ పునియానీ