Jul 14,2022 07:30
  •  డబ్ల్యూఇఎఫ్‌ ర్యాంకుల్లో 135వ స్థానం
  •  ఆరోగ్య, మనుగడ రంగాల్లోనూ దారుణమే

న్యూఢిల్లీ : స్త్రీ, పురుష సమానత్వ అంశంలో భారత్‌ అట్టడుగున నిలిచింది. ఆరోగ్యం, మనుగడ వంటి అంశాల్లోనూ భారత్‌ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. స్త్రీ, పురుషుల మధ్య అంతరాలకు సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్‌) రూపొందించిన వార్షిక నివేదిక-2022ను బుధవారం జెనీవాలో విడుదల చేశారు. ఈ నివేదిక సోషలిస్టు దేశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఎంపిక చేసిన 146 దేశాల్లో స్త్రీ, పురుషుల మధ్య అంతరాలపై అధ్యయనం చేసి ర్యాంకింగ్స్‌ను ప్రకటించగా భారత్‌ 135వ స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, కాంగో, ఇరాన్‌, చాద్‌ వంటి దేశాలు సైతం ఈ విషయంలో మన కన్నా మెరుగ్గా ఉన్నాయి. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు అంశాల్లో అంతకుముందు ఏడాదితో పోల్చితే కొంచెం మెరుగుపడింది. స్త్రీ, పురుష అంతరాలు తక్కువగా ఉన్న దేశంగా ఐస్‌లాండ్‌ తన నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను తిరిగి నిలబెట్టుకున్నట్లు డబ్ల్యుఇఎఫ్‌ నివేదిక తెలిపింది. ఆ తరువాతి స్థానాల్లో ఫిన్లాండ్‌, నార్వే, న్యూజిలాండ్‌, స్వీడన్‌ నిలిచాయి. శ్రామిక శక్తిలో పెరుగుతున్న లింగ వ్యత్యాసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవన వ్యయ సంక్షోభం మహిళలను తీవ్రంగా దెబ్బతీస్తుందని డబ్ల్యూఇఎఫ్‌ హెచ్చరించింది. లింగ వ్యత్యాసాన్ని పూడ్చటానికి మరో 132 ఏళ్లు పడుతుందని తెలిపింది. లింగ సమానత్వాన్ని కోవిడ్‌ మహమ్మారి ఒక తరం వెనక్కి నెట్టిందని, రికవరీ నెమ్మదిగా ఉండటం ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను తీవ్రతరం చేసిందని నివేదిక తెలిపింది. భారత్‌లో లింగ సమానత్వం గత 16 ఏళ్లలో ఏడో అత్యధిక స్థాయిని అందుకున్నా.. వివిధ రంగాల్లో దారుణ ప్రదర్శనతో గత ర్యాంక్‌లోనే భారత్‌ కొసాగుతుందని నివేదిక చెప్పింది. సుమారు 66 కోట్ల ఉన్న మహిళా జనాభా కూడా భారత ర్యాంక్‌లపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. 2012 నుంచి కోలుకోవడంలో ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల విభాగాల్లో భారత్‌ గణనీయమైన, సానుకూల మార్పును ప్రదర్శిస్తున్నా, 2021 నుంచి పురుషుల, మహిళల ఇద్దరికీ కార్మిక శక్తి భాగస్వామ్యం తగ్గిపోయిందని తెలిపింది. మహిళా శాసన సభ్యులు, సీనియర్‌ అధికారులు, మేనేజర్లలో మహిళల వాటా 14.6 శాతం నుంచి 17.6 శాతానికి పెరిగిందని, వృత్తి, సాంకేతిక ఉద్యోగాల్లో కూడా 29.2 శాతం నుంచి 32.9 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఆరోగ్యం, మనుగడ ఉప జాబితాలోనూ భారత్‌ 146 దేశాల్లో చిట్టచివరి నుంచి ఐదో స్థానంలో ఉంది.