Jan 07,2023 07:27

ఈ అంశంపై భారత్‌ వెనుకడుగు వేయడానికి కారణం ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తుండడమే. అందువల్లే పాలస్తీనా ప్రయోజనాల విషయంలో మెతక వైఖరి అనుసరిస్తోంది. ఇజ్రాయిల్‌తో మోడీ ప్రభుత్వానికి పెరుగుతున్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిన విషయమే. గతంలో ప్రధానిగా వున్నపుడు నెతన్యాహు, మోడీకి చాలా సన్నిహితుడు. సైద్ధాంతికంగా వారిద్దరూ సహచరులే. పాలస్తీనియన్లు, అరబ్బుల పట్ల యూదు శతృత్వానికి ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపిలు అభిమానులు. అమెరికా ప్రణాళిక ప్రకారమే, పశ్చిమాసియా లోని ఐ2యు2 (భారత్‌, ఇజ్రాయిల్‌, యుఎఇ, అమెరికా) ఫోరంలో భారత్‌ చేరింది. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడానికి ఒక రోజు ముందే నెతన్యాహు ప్రభుత్వం అధికార బాధ్యతలను చేపట్టింది. ఇక్కడ తీర్మానంపై ఓటింగ్‌లో భారత్‌ గైర్హాజరవడం అంటే నెతన్యాహు ప్రభుత్వం పట్ల సుహృద్భావాన్ని ప్రదర్శించడంగా చూడవచ్చు.

పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయిల్‌ చాలా కాలంగా ఆక్రమించుకుంటూ పోతుండడం వల్ల తలెత్తే చట్టపరమైన పర్యవసానాలపై అభిప్రాయాన్ని తెలియచేయాల్సిందిగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసిజె) కోరుతూ డిసెంబరు 31, 2022న ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ చేపట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. తీర్మానానికి 87 దేశాలు మద్దతు ఇవ్వగా, 26 దేశాలు వ్యతిరేకించాయి. భారత్‌ సహా 52 దేశాలు గైర్హాజరయ్యాయి.
             పవిత్ర నగరమైన జెరూసలేం ప్రతిపత్తిని, స్వభావాన్ని జనాభా కూర్పును మార్చడానికి ఉద్దేశించిన చర్యలతో సహా ఇజ్రాయిల్‌ ఆక్రమణ, సెటిల్‌మెంట్‌, కలుపుకోవడం వంటి చర్యల చట్టపరమైన పర్యవసానాల గురించి...అలాగే యూదు దురహంకార ఇజ్రాయిల్‌ చేపడుతున్న వివక్షాపూరిత చట్టాలు, చర్యల గురించి ఈ తీర్మానం పేర్కొంది.
          ఈ తీర్మానానికి ఓటు వేయకుండా వుండడం ద్వారా...పాలస్తీనా ప్రయోజనాలకు, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి గట్టిగా మద్దతిస్తూ చిరకాలంగా అనుసరిస్తూ వచ్చిన వైఖరిని నుంచి పక్కకు వైదొలగుతున్నట్టు భారత్‌ సంకేతాలు ఇచ్చింది. 1967లో యుద్ధం జరిగినప్పటి నుండి వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలేం, గాజా ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ ఆక్రమణ కొనసాగుతూ వస్తోంది. అప్పటి నుండి, ఈ ఆక్రమణ చర్యలకు అంతం పలకాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి పలుసార్లు తీర్మానాలు చేసినప్పటికీ, వెస్ట్‌ బ్యాంక్‌లో యూదు ఆవాసాల ఏర్పాటును ఇజ్రాయిల్‌ అదేపనిగా అనుమతిస్తూ వస్తోంది. తూర్పు జెరూసలేంలో పాలస్తీనా ఆవాస ప్రాంతాలను ధ్వంసం చేస్తూ, పూర్తిగా అక్కడ జనాభా పొందికను మార్చాలని చూస్తోంది.
          మొత్తంగా జెరూసలేం, వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న పాలస్తీనియన్లను తరిమేయడమో లేదా ఇజ్రాయిలీ యేతర పౌరులుగా వర్ణ వివక్షకు గురి కావాల్సిందేనని ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఆ ప్రాంతాలను కూడా తమలో కలిపేసుకోవాలన్నది ఇజ్రాయిల్‌ పన్నాగంగా ఉన్నది. భూ ఆక్రమణల ద్వారా తూర్పు జెరూసలేంను బహిరంగంగానే కలిపేసుకోవడంతో ఆ నగర యథాతథ పరిస్థితి మారింది. ఇజ్రాయిల్‌ 'శాశ్వత రాజధాని'గా జెరూసలేం వుంటుందని ప్రకటించింది. వెస్ట్‌ బ్యాంక్‌ లోని పాలస్తీనా భూభాగాల్లో 5 లక్షల మంది యూదులు నివాసం ఏర్పరచుకోవడానికి ఇజ్రాయిల్‌లో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తూ వచ్చాయి.
         గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు జైళ్ళలో మాదిరి దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. వారు తరచుగా వైమానిక బాంబు దాడులకు, దిగ్బంధనాలకు గురవుతూనే వున్నారు. పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లతో వెస్ట్‌ బ్యాంక్‌ను వేరు చేస్తూ నిర్మించిన గోడ వర్ణ వివక్ష వ్యవస్థను స్థాపించింది. గత రెండేళ్ళలో, వెస్ట్‌ బ్యాంక్‌ను కలుపుకునే దిశగా ఇజ్రాయిల్‌ దేశం సాగుతోంది.
          బెంజమిన్‌ నెతన్యాహు ప్రధానిగా ఇజ్రాయిల్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం- వర్ణవివక్షతతో కూడిన యూదు జాతీయ పార్టీలతో, అతి సాంప్రదాయవాద మత గ్రూపులతో ఏర్పడిన పచ్చి మితవాద సంకీర్ణ ప్రభుత్వ వ్యవస్థగా వుంది. ''జుడియా, సమారియా (వెస్ట్‌ బ్యాంక్‌కు బైబిల్‌ పేర్లు)తో సహా ఇజ్రాయిల్‌లో అన్ని ప్రాంతాల్లో యూదు ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటూ పోవాలని'' సంకీర్ణ పార్టీల ఒప్పందం పేర్కొంది. ''సమయం చూసుకుని, ఇజ్రాయిల్‌ జాతీయ, అంతర్జాతీయ ప్రయోజనాలను పరిగణన లోకి తీసుకుని'' వెస్ట్‌ బ్యాంక్‌ను కలుపుకునేందుకు కూడా ఈ ఒప్పందం హామీ ఇచ్చింది.
             యూదు ఆవాసాలను ఏర్పాటు చేసేందుకు పాలస్తీనా భూభాగాలను, ఆలివ్‌ తోటలను ఆక్రమించుకోవడంలో, బుల్డోజర్లతో పాలస్తీనియన్ల గృహాలను ధ్వంసం చేయడం వంటి దుర్మార్గమైన చర్యలకు ఈ కిరాతక వలసవాద ప్రభుత్వం పాల్పడుతోంది. ఈ అణచివేత చర్యలను ప్రతిఘటించినా, లేదా నిరసన తెలిపినా ఇజ్రాయిల్‌ సాయుధ బలగాలు కాల్పులతో అణచివేస్తాయి.. 2022 సంవత్సరంలో వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలేం ప్రాంతాల్లో 171 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ బలగాలు హతమార్చాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. వీరిలో 30 మందికి పైగా పిల్లలు వున్నారు. ఇటువంటి హింసకు సంబంధించి అత్యంత అధ్వాన్నమైన సంవత్సరాల్లో 2022 ఒకటిగా వుంది. మొత్తంగా 9 వేల మంది గాయపడ్డారు.
              కొత్త మితవాద ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న సంకీర్ణ పార్టీల్లో ఒకటైన రెలిజియస్‌ జియోనిస్ట్‌ పార్టీలో ప్రధానంగా వెస్ట్‌ బ్యాంక్‌ సెటిలర్లే వున్నందువల్ల వెస్ట్‌ బ్యాంక్‌లో పాలస్తీనియన్లను మొత్తంగా అణచివేయడానికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తీవ్రవాద భావజాలం కలిగిన జ్యూయినష్‌ పవర్‌ పార్టీకి చెందిన, జాతీయ భద్రతా వ్యవహారాల మంత్రి ఇత్మార్‌ బెన్‌ గివిర్‌ పాలస్తీనియన్లు, అరబ్బులకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలకు పేరొందిన వ్యక్తి. వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ సరిహద్దు పోలీసులను అలాగే పాలస్తీనా ఆవాసాలను ఆయన మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.
             అందువల్ల, ఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ కొత్త తీవ్రవాద ప్రభుత్వం తన దూకుడు చర్యలను మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానం సముచితమైన సమయంలో వచ్చింది.
                ఏ దేశంలోనైనా అంతర్గత మానవ హక్కుల విషయాలపై బయటి విచారణకు పిలుపిచ్చినా లేదా తాను అంగీకరించని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుకు సంబంధించిన అంశాలపౖెె ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి, ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ చేసిన తీర్మానాలకు భారత్‌ గతంలో ఎన్నడూ మద్దతివ్వలేదు. కానీ, ప్రస్తుత తీర్మానంపై భారత్‌ ఇలా గైర్హాజరవడాన్ని సమర్ధించడానికి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేం. అన్నింటికంటే ముందు, ఒక సార్వభౌమాధికార దేశం అంతర్గత వ్యవహారాలకు సంబంధం లేని విషయాన్ని... ఆక్రమిత భూభాగానికి సంబంధించిన విషయాన్ని పరిశీలించాల్సిందిగా ఐసిజెను కోరారు. వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలేం రెండూ ఆక్రమిత భూభాగాలేనని భారత్‌ ఇప్పటికీ భావిస్తూ వున్నది. పైగా, ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో గోడ నిర్మాణం వల్ల తలెత్తే చట్టపరమైన పర్యవసానాల గురించి 2004లో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ పట్టుబట్టిన మేరకు ఐసిజె తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
                 ఈ అంశంపై భారత్‌ వెనుకడుగు వేయడానికి కారణం ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తుండడమే. అందువల్లే పాలస్తీనా ప్రయోజనాల విషయంలో మెతక వైఖరి అనుసరిస్తోంది. ఇజ్రాయిల్‌తో మోడీ ప్రభుత్వానికి పెరుగుతున్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిన విషయమే. గతంలో ప్రధానిగా వున్నపుడు నెతన్యాహు, మోడీకి చాలా సన్నిహితుడు. సైద్ధాంతికంగా వారిద్దరూ సహచరులే. పాలస్తీనియన్లు, అరబ్బుల పట్ల యూదు శతృత్వానికి ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపిలు అభిమానులు. అమెరికా ప్రణాళిక ప్రకారమే, పశ్చిమాసియా లోని ఐ2యు2 (భారత్‌, ఇజ్రాయిల్‌, యుఎఇ, అమెరికా) ఫోరంలో భారత్‌ చేరింది.
               ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడానికి ఒక రోజు ముందే నెతన్యాహు ప్రభుత్వం అధికార బాధ్యతలను చేపట్టింది. ఇక్కడ తీర్మానంపై ఓటింగ్‌లో భారత్‌ గైర్హాజరవడం అంటే నెతన్యాహు ప్రభుత్వం పట్ల సుహృద్భావాన్ని ప్రదర్శించడంగా చూడవచ్చు.
నిర్వాసితులవడం, వలసవాద ఆక్రమణలు వంటి కష్టాలను పాలస్తీనా ప్రజలు ఏడు దశాబ్దాలకు పైగా అనుభవిస్తూనే వున్నారు. 1948లో ఏడు దశాబ్దాలకు పైగా వారిని వారి మాతృభూమి నుండి బహిష్కరించినప్పటి నుండి లక్షలాదిమంది పాలస్తీనా వెలుపల శరణార్ధులుగానే జీవించారు. సైనిక ఆక్రమణ కింద వారిని లొంగ తీసుకున్నారు. మన స్వాతంత్య్రోద్యమ పోరాట కాలం నుండి, పాలస్తీనా ప్రజల పట్ల భారత్‌ సంపూర్ణ సానుభూతితో, సంఘీభావంతో వ్యవహరిస్తూనే వచ్చింది. కానీ, ఇప్పుడు బిజెపి పాలకుల ఈ హిందూత్వ దృక్పథం ఈ పరాక్రమవంతులను అణచివేసే వారి పక్షాన భారతదేశాన్ని నడిపిస్తోంది.
 

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)